e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home హైదరాబాద్‌ ఇంజిన్‌ తీసేద్దాం.. ఈవీకి మారుదాం..

ఇంజిన్‌ తీసేద్దాం.. ఈవీకి మారుదాం..

  • స్వల్ప ఖర్చుతో మార్చి చూపిస్తున్న యువకులు, కంపెనీలు
  • గో ఎలక్ట్రిక్‌ క్యాంపెయిన్‌ -రోడ్‌షోలో ‘ఈ-తరం’ వాహనాల ప్రదర్శన
  • పీపుల్స్‌ ప్లాజా వేదికగా ఆకట్టుకున్న పర్యావరణహిత వెహికిల్స్‌
  • ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పెట్రోల్‌, విద్యుత్‌తో నడిచే బైక్‌

మీ వాహనం కాలం చెల్లిందా..తుక్కు కింద వేసేద్దామనుకుంటున్నారా.. లేక సరికొత్త వాహనానికి ఎలక్ట్రికల్‌ సదుపాయం కల్పిద్దామనుకుంటున్నారా? అయితే స్వల్ప ఖర్చుతో మీరు ఆ వెసులుబాటు పొందొచ్చు. నగరానికి చెందిన పలువురు ఔత్సాహిక యువకులు, కంపెనీలు పాత వాహనాలను ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ (ఈవీ)గా మార్చి చూపించారు. టీఎస్‌రెడ్‌కో ఆధ్వర్యంలో ఆదివారం పీవీ మార్గ్‌లోని పీపుల్స్‌ప్లాజాలో నిర్వహించిన ‘గో ఎలక్ట్రిక్‌ క్యాంపెయిన్‌- రోడ్‌షో’లో పలు వాహనాలను ప్రదర్శించి ఆసక్తి రేకెత్తించారు.అతితక్కువ ఖర్చుతో ఇంజిన్‌ మార్పు చేసి ఎలక్ట్రిక్‌గా మార్చడంతోపాటు కాలుష్య రహితంగా స్వల్ప రుసుముతో ఎక్కువ దూరం ప్రయాణించొచ్చని వివరించారు.

హైదరాబాద్‌ జూన్‌ 27 (నమస్తే తెలంగాణ ): మీ వద్ద కాలం చెల్లిన వాహనం ఉందా..? స్క్రాప్‌లో పడేద్దామనుకుంటున్నారా..? తొందర పడకండి..కొద్దిగా ఖర్చు పెడితే.. దానిని ఎంచక్కా ఎలక్ట్రిక్‌ వాహనంగా మార్చుకోవచ్చు…? లేదా ప్రస్తుతం వాడుతున్న వెహికిల్‌కూ ఆ సదుపాయం కల్పించుకోవచ్చు. నగరానికి చెందిన పలువురు ఔత్సాహికులు ఇంజిన్‌ను తొలగించి, పూర్తిగా ఎలక్ట్రిక్‌ వాహనంగా మార్చుతున్నారు. అంతేకాదు….ఇంధనంతో పాటు విద్యుత్‌తో కూడా నడిచే విధంగా రూపకల్పన చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలాంటి వాహనాలను తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్‌రెడ్‌కో) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘గో ఎలక్ట్రిక్‌ క్యాంపెయిన్‌ – రోడ్‌షో ’లో ప్రదర్శించారు.

- Advertisement -

యువతను ఆకట్టుకునే విధంగా వివిధ రకాల పర్యావరణహిత బైక్‌లను ఈ ప్రదర్శనలో ఉంచారు. పీవీ మార్గ్‌లోని పీపుల్స్‌ ప్లాజా వేదికగా నిర్వహించిన ఈ ప్రదర్శనను ఐటీ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌రంజన్‌, ఇంధన శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, రవాణా శాఖ కమిషనర్‌ రామ్మెహన్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌రెడ్‌కో చైర్మన్‌ సయ్యద్‌ అబ్దుల్‌ అలీముద్దీన్‌, ఎండీ ఎన్‌. జానయ్య, ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ ఇండియా చైర్మన్‌ డాక్టర్‌ రామేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

క్రిడన్‌ బైక్‌..

యమహా ఆర్‌ఎక్స్‌- 100 మోడల్‌లో క్రిడన్‌ బైక్‌ను హైదరాబాద్‌కు చెందిన రియాల్టీ షీల్డ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. మేకిన్‌ ఇండియాలో భాగంగా ఈ బైక్‌ను తయారు చేశారు. 6 సెకండ్లలోనే జీరో నుంచి 60 కిలోమీటర్ల వేగం అందుకునే ఈ బైక్‌పై గంటకు 95 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. పూర్తి చార్జింగ్‌ చేస్తే 80-110 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చు. దీని వ్యయం రూ.70వేలు ఉంటుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

పెట్రోల్‌, విద్యుత్‌తో నడిచే బైక్‌..

పెట్రోల్‌, విద్యుత్‌…ఇలా రెండింటితో నడిచే బైక్‌ను నగరానికి చెందిన హైటెక్‌ ఇన్నోవేషన్‌ కంపెనీకి చెందిన బి. యశస్వి గోపాల్‌ రూపొందించారు. ప్రస్తుతం మనం వినియోగించే బైక్‌లో కొద్దిగా మార్పులు చేసి, రెండు రకాలుగా వినియోగించుకోవచ్చని ఆయన చెబుతున్నారు. ఒకే ఒక్క స్విచ్ఛ్‌ను ఆన్‌చేసి పెట్రోల్‌ అయిపోయినప్పుడు ఎలక్ట్రిక్‌గా, చార్జింగ్‌ అయిపోయినప్పుడు పెట్రోల్‌ వాహనంగా మార్చుకోవచ్చని అంటున్నారు. ఇందుకు సుమారుగా రూ. 15వేల
వరకు ఖర్చవుతుందని
తెలిపారు.

ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ ఆటో..

ప్రస్తుతానికి వినియోగిస్తున్న ప్యాసింజర్‌ ఆటోలను ఎలక్ట్రిక్‌గా మార్చవచ్చని అంటున్నారు ఎన్వీస్మార్ట్‌ కంపెనీ సీఈవో వై. అవినాశ్‌రెడ్డి. ఆటోలకు బిగించిన డీజిల్‌ ఇంజిన్‌ను పూర్తిగా తొలగించి…6 కిలోవాట్ల సామర్థ్యం గల 100 ఆంప్స్‌ లిథియం అయాన్‌ బ్యాటరీ, మోటర్‌, గేర్‌బాక్స్‌, కంట్రోలర్‌, డీసీ టూ డీసీ కన్వర్టర్‌, మెటల్‌ బ్రేకులు వినియోగించి విద్యుత్‌తో నడిచే విధంగా తయారు చేయవచ్చంటున్నారు. తాము తయారు చేసిన ఆటోలో రోజుకు 54 రూపాయలతో 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని
చెబుతున్నారు.

రీవోల్ట్‌..

అచ్చం యమహా ఎఫ్‌జెడ్‌ తరహాలో ఉండే రీవోల్ట్‌ బైక్‌ను మెంబీ మోటర్స్‌ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ. 1.20 లక్ష ధర పలికే ఈ బైక్‌లు మూడు రకాల్లో లభ్యమవుతున్నాయి. ఎకోమోడ్‌లో రోజుకు 150 కి.మీ, నార్మల్‌మోడ్‌లో 100, స్పోర్ట్‌ మోడ్‌లో 80 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. రోజుకు నాలుగున్నర గంటల పాటు చార్జింగ్‌ చేయాలి.

క్వాంటా..

యువత, ప్రత్యేకించి మహిళల కోసం క్వాంటా పేరుతో రూపొందించిన బైక్‌ను గ్రేవ్‌టాన్‌ సంస్థ తయారు చేస్తున్నది. రాజన్నసిరిసిల్లా జిల్లాలోని ఉత్పాదక యూనిట్‌లో వీటిని రూపొందిస్తున్నారు. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ఈ బైక్‌పై ప్రయాణించవచ్చు. మూడు గంటల పాటు చార్జింగ్‌ చేయాల్సి ఉంటుంది. పూర్తిగా చార్జింగ్‌ చేస్తే 85-150 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. దీని ధర రూ.60వేల వరకు ఉంటుందని సంస్థ వర్గాలు చెబుతున్నాయి.

ప్రభుత్వ శాఖలకు ఎలక్ట్రిక్‌ వాహనాలు..

ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఎలక్ట్రిక్‌ వాహనాలను వినియోగించే ఆలోచన చేస్తున్నాం. అద్దె వాహనాల స్థానంలో వీటిని ఉపయోగించేందుకు టీఎస్‌రెడ్‌కో ద్వారా ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చనున్నది. కాలుష్యం, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్న క్రమంలో కిలోమీటర్‌కు రూ. 10 ఖర్చు చేయాల్సి వస్తున్నది. అదే ఈవీతో కిలోమీటర్‌కు పైసాలోపే ఖర్చయ్యే అవకాశమున్నది. ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు రకాల రాయితీలను ఇస్తున్నది. ఫలితంగా తెలంగాణలో ఈవీ విక్రయాలు జోరందుకున్నాయి. రాష్ట్రంలో 8-9వేల వాహనాలు రిజిస్ట్రేషన్‌ కాగా, పలు ఉత్పాదక సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. తాజాగా ట్రైటాస్‌ సంస్థ 2వేల కోట్లతో జహీరాబాద్‌లోని నిమ్జ్‌లో యూనిట్‌ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. వాహనదారుల కోసం తెలంగాణ వ్యాప్తంగా చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఓఆర్‌ఆర్‌ల్లో వీటిని పెద్ద ఎత్తున నెలకొల్పుతున్నాం.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana