e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home హైదరాబాద్‌ రామాలయ భూములపై రాబందుల రెక్కలు

రామాలయ భూములపై రాబందుల రెక్కలు

రామాలయ భూములపై రాబందుల రెక్కలు
 • మాయమైన దేవరయంజాల్‌ భూములు
 • పత్తా లేని సీతారామచంద్ర స్వామికి చెందిన 1500 ఎకరాలు
 • ప్రేక్షకపాత్ర పోషించిన ఎండోమెంట్‌
 • పట్టించుకోని రెవెన్యూ అధికారులు n తాజాగా లోకాయుక్తలో కేసు
 • భూములు తమవేనంటూ ఎండోమెంట్‌ నివేదిక
 • తతంగం వెనుక కబ్జా నేత హస్తముందంటూ స్థానికుల చర్చ

దేవుడి మాన్యం మింగేశారు.. ఒకటా రెండా దేవరయంజాల్‌ శ్రీ సీతారామచంద్ర స్వామికి చెందిన సుమారు 15 వందల ఎకరాల భూములపై కన్నేశారు. రాబందుల్లా వాలిపోయారు. అందినకాడికి తమ కబంధ హస్తాల్లో పెట్టుకున్నారు. ప్రభుత్వ వ్యవస్థలను ఏమార్చి.. అడ్డొచ్చిన అధికారులను నయానో భయానో బెదిరించి కబ్జాలకు తెరలేపారు. ఎండోమెంట్‌ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి వేల కోట్ల సామాజ్రాన్ని స్థాపించారు. ఈ తతంగం వెనుక ఇటీవల కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మంత్రి హస్తం ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి దేవరయంజాల్‌ భూములపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతున్నారు. దేవాలయ భూములను తిరిగి పరిరక్షించాలని వేడుకుంటున్నారు.

ఆరు వందల ఏండ్ల చరిత్ర కలిగిన పురాతన సీతారామచంద్ర స్వామి దేవస్థానం అది. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండల పరిధిలోని దేవరయంజాల్‌ గ్రామంలోని ఆలయానికి వేల ఎకరాల భూములుండేవి. అయితే ప్రస్తుతం ఆ దేవాలయ పరిసర భూములు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహానగరంతో పోటీపడుతూ అభివృద్ధి చెందుతుండటంతో అక్కడ ఎకరాకు రూ.30-40 కోట్ల వరకు ధర పలుకుతుంది. ఇంకేముంది రాక్షసుల్లాంటి భూ రాబంధులు రెక్కలు కట్టుకుని సీతారామచంద్ర స్వామి దేవాలయ భూములపై వాలిపోయారు. 1976 నుంచి ఆక్రమణల పర్వం కొనసాగుతున్నా.. ఎండోమెంట్‌ అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తే రెవెన్యూ అధికారులు తమకేమీపట్టనట్లు వ్యవహరించారు. దీంతో రూ.కోట్ల విలువైన సీతారామచంద్ర స్వామి దేవాలయ మాన్యాలు (భూములు) మాయమయ్యాయి. ఈ వ్యవహారంపై ఓ వ్యక్తి లోకాయుక్తలో ఫిర్యాదు చేయడంతో మేల్కొన్న ఎండోమెంట్‌ అధికారులు ఆ భూములు దేవాలయానికి చెందినవేనంటూ నివేదిక సమర్పించారు. సర్వే నెంబర్ల వారీగా పరిశీలిస్తే.. 55 నుంచి 63 వరకు, 212 నుంచి 218 వరకు, 513 నుంచి 586 వరకు, 639 నుంచి 699 వరకు, 700 నుంచి 737 వరకు సుమారు 1461.19 ఎకరాల ఎండోమెంట్‌ భూమి ఉన్నట్లు రెవెన్యూ, ఎండోమెంట్‌ అధికారులు స్పష్టం చేస్తుండగా.. ఎండోమెంట్‌ రికార్డుల్లో మాత్రం సుమారు 15 వందల ఎకరాల వరకు ఉందని పేర్కొంటున్నారు.

1976 నుంచి కబ్జాల పర్వం..

1976కు ముందు కొంత మంది వ్యక్తులు దేవాలయానికి సంబంధించిన 668 నుంచి 716 వరకు ఉన్న సర్వే నెంబర్లలోని సుమారు 883.8 ఎకరాల భూములను తమవేనని పేర్కొంటూ రెవెన్యూ అధికారుల సహకారంతో రికార్డుల్లో నమోదు చేయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది రైతులు 1976లో అప్పటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సబ్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇందులో సుమారు 883.8 ఎకరాల భూమి కబ్జాకు గురైందని స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో విచారణ చేయాలని జిల్లా సబ్‌ కలెక్టర్‌ రెవెన్యూ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు విచారణ నిర్వహించిన డీఆర్వో (డీఆర్వో ఫైల్‌ నెంబర్‌-బి1/15043/1977) సబ్‌ కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. ఈ నివేదికలో సర్వే నెంబర్‌ 668 నుంచి 712, 716 (మొత్తం 26 సర్వే నెంబర్లలో) ఉన్న సుమారు 400.37 ఎకరాల భూమి దేవాలయ భూమిగా పేర్కొనడంతో పాటు సుమారు 39 మంది ఈ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే డీఆర్వో విచారణ నివేదిక, రెవెన్యూ రికార్డుల ఆధారంగా 400.37 ఎకరాల భూమిని ఎండోమెంట్‌ వెంటనే రిజిస్ట్రేషన్‌ చేసుకొని సదరు ఆక్రమణదారులపై సెక్షన్‌-83(1) ప్రకారం ఎవెక్షన్‌ (కబ్జాలోని భూమిని ఖాళీ చేయాలని) ఎండోమెంట్‌ కోర్టులో కేసులు నమోదు చేసింది.

డీఆర్వో విచారణపై కోర్టుకు..

డీఆర్వో విచారణ నివేదికను సవాల్‌ చేస్తూ కొంత మంది ఆక్రమణదారులు అప్పట్లో కోర్టును ఆశ్రయించారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే విచారణ నిర్వహించారని ఆక్రమణదారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డీఆర్వో ఆర్డర్‌ను రద్దు చేస్తూ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం 2004లో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మళ్లీ నూతనంగా ఆక్రమమదారులుగా పేర్కొంటున్న వ్యక్తులకు నోటీసులు జారీ చేసి విచారణ చేయాలని, వారివద్ద ఉన్న ఆధారాలను పరిగణలోకి తీసుకొని తుది నివేదికను సమర్పించాలని కోర్టు స్పష్టంగా ఉత్తర్వులు జారీ చేసింది.

మళ్లీ డీఆర్వో వద్దకు..

1925, 1926 రెవెన్యూ రికార్డుల ప్రకారం 1531.26 ఎకరాల భూమిని దేవాదాయ శాఖకు చెందినదిగా ఆర్డర్‌ ఇవ్వాలని కోరుతూ ఎండోమెంట్‌ డిపార్ట్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ 2005లో అప్పటి రంగారెడ్డి జిల్లా డీఆర్వోను ఆశ్రయించారు. అయితే ఇప్పటి వరకు ఈ ఫైల్‌ పెండింగ్‌లోనే ఉంది. జిల్లాల విభజన నేపథ్యంలో ఈ ఫైల్‌ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మేడ్చల్‌ జిల్లాకు బదిలీ చేసినట్లుగా రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు.

ఓ వైపు విచారణ.. మరోవైపు ఒప్పందం..

ఓ వైపు డీఆర్వో విచారణ, మరోవైపు కోర్టులో కేసు నడస్తుండగానే కొంత మంది ఆక్రమణదారులు ఎండోమెంట్‌ అధికారులతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా సెక్షన్‌-89 ఎండోమెంట్‌ యాక్టు ప్రకారం కబ్జాదారుల నుంచి కొంత మొత్తంలో నగదు కట్టించుకొని వారి ఆధీనంలోని భూములను వారికే రాసిచ్చేలా ఎండోమెంట్‌ అధికారులు పావులు కదిపారు. ఈ క్రమంలోనే తమ కబ్జాలో ఉన్న సుమారు 365.4 ఎకరాలు, మరో 5899 చ.గజాల భూమిపై ఎన్‌వోసీ జారీ చేయాలని కోరుతూ సుమారు 75 మంది ఆక్రమణదారులు ఎండోమెంట్‌ ఉన్నతాధికారులకు దరఖాస్తులు చేసుకున్నారు. సుమారు 2.39 కోట్లు చెల్లించగా.. సుమారు 63 మంది ఆక్రమణ దారుల ఆధీనంలోని 324 ఎకరాలతో పాటు మరో 2899 చదరపు గజాల భూమిపై ఎండోమెంట్‌ అధికారులు ఎన్‌ఓసీ (నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌)ని జారీ చేశారు. ఈ వ్యవహారంపై అప్పట్లో తీవ్ర దుమారం చెలరేగడంతో స్పందించిన అప్పటి ప్రభుత్వం ఎండోమెంట్‌ ఇచ్చిన ఎన్‌ఓసీలను రద్దు చేస్తూ 2005 మే 31న జీవో నం. 1087ను విడుదల చేసింది. అంతటితో ఊరుకోకుండా ఈ ఆక్రమణలపై విచారణ చేయాలని జస్టిస్‌ ఎ.వెంకట్‌రామిరెడ్డి కమిషన్‌ను నియమించింది. అయితే కారణం తెలియదు కానీ ఇప్పటి వరకూ ఈ నివేదిక వివరాలను ఎండోమెంట్‌ శాఖ వెల్లడించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఇదీ చరిత్ర

 • 1925-1926 సంవత్సరాల కిందటి రెవెన్యూ రికార్డులు, పహాణీలలో దేవరయంజాల్‌ సీతారామచంద్రస్వామి దేవాలయానికి సుమారు 1531.13 వందల ఎకరాల భూమి (మాన్యం) ఉంది.
 • ప్రముఖ బ్యాంకర్‌, కాంట్రాక్టర్‌గా సేవలందించి వైశ్రాయ్‌ అండ్‌ గవర్నర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా ‘రావు బహదూర్‌’ బిరుదు పొందిన రామిని పుల్లయ్య సీతారామచంద్ర స్వామి పరమ భక్తుడు.
 • ఈ క్రమంలోనే రామిడి పుల్లయ్య సేవా దృక్పథానికి మెచ్చిన నిజాం ప్రభువు దేవాలయానికి చెందిన సుమారు 1531.13 ఎకరాల భూమిని ఆయనకు ఇనాంగా ఇచ్చారు.
 • అయితే నిజాం ప్రభుత్వ హయాంలో మత సంస్థల మాన్యాల రికార్డులు ఉమ్మెరే మజీబి డిపార్ట్‌మెంట్‌ (మసీదులు, హిందూ దేవాలయాలు, చర్చిలు తదితర మత సంస్థలకు సబంధించిన ఆస్తుల వివరాలు నమోదు చేసే సంస్థ) ఆధీనంలో ఉండేవి.
 • అనంతరం 1954లో ప్రభుత్వం వక్ఫ్‌బోర్డును స్థాపించి ఉమ్మెరే మజీబి డిపార్ట్‌మెంట్‌ ఆధీనంలోని రికార్డులను బదిలీ చేసింది.
 • తదనంతరం అప్పటి ప్రభుత్వం 1966లో ఎండోమెంట్‌ డిపార్ట్‌మెంట్‌ను స్థాపించి వక్ఫ్‌బోర్డ్‌ ఆధీనంలో ఉన్న 11అవుకాఫ్‌ రిజిస్టర్లను దేవాదాయ శాఖకు బదిలీ చేసినట్లు ఎండోమెంట్‌ అధికారులు పేర్కొంటున్నారు.
 • ఇదిలా ఉంటే రామిడి పుల్లయ్య ఆధీనంలోని 1531.13 ఎకరాల భూమిని దేవాలయానికి రాసిచ్చినట్లుగా రెవెన్యూ, ఎండోమెంట్‌ రికార్డుల ద్వారా స్పష్టమవుతోంది.
 • ఈ భూమి నిజాం ప్రభుత్వ ఎండోమెంట్‌ డిపార్ట్‌మెంట్‌ (ఎక్లస్టికల్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ హైదరాబాద్‌)లో నమోదు చేయబడి ఉందని, 1944 సేత్వార్‌ రిజిస్టర్‌లో కూడా సీతారామచంద్రస్వామి దేవాలయ భూమిగా, ముత్వెల్లి (దేవాలయం ట్రస్టీ)గా రామిని పుల్లయ్య పేరు స్పష్టంగా ఉందని ఎండోమెంట్‌ అధికారులు పేర్కొన్నారు.

ఈటల కనుసన్నల్లోనేనా

 • మంత్రి ఈటల రాజేందర్‌ కనుసన్నల్లోనే దేవరయంజాల్‌ శ్రీ రామచంద్ర స్వామి దేవాలయ భూముల అన్యాక్రాంతంలో వేగం పెరిగిందని స్థానికుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 • ఓ ఎంపీకి, ఈటలకు కొందరు వ్యక్తులు బినామీగా ఉండి ఈ భూముల్లో అక్రమంగా సుమారు 155 భారీ కమర్షియల్‌ గోదాంలను నిర్మించారు.
 • ఇందులో ఏ ఒక్క దానికీ అనుమతి లేదు. అలాగే ఈ భూములకు కనీసం రిజిస్ట్రేషన్లు కూడా లేవు.
 • దీంతో అధికారులు ఈ నిర్మాణాలను తొలగించే ప్రయత్నం చేసినా మాజీ అమాత్యులు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆ నిర్మాణాల జోలికి వెళ్లకుండా చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
 • ఈ క్రమంలో మరింత రెచ్చిపోయిన ఎండోమెంట్‌ భూముల ఆక్రమణదారులు ఈటలకు బినామీలుగా చేరి మరిన్ని ఆక్రమణలకు పాల్పడ్డారని స్థానిక అధికారులు పేర్కొంటున్నారు.
 • గతంలో ఈ ఎండోమెంట్‌ భూములను కబ్జా చేసిన వారి నుంచి తక్కువ ధరకే ఈటల కొనుగోలు చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
 • ఈ భూములు నిషేధిత జాబితాలో ఉన్నా కొంత మందికి రిజిస్ట్రేషన్‌ చేయించారని.. ఇందులో మంత్రి అధికారులపై ఒత్తిడి తెచ్చాడనేది సమాచారం.
 • ఈ భూములపై పూర్తిస్థాయి విచారణ చేస్తే ఆక్రమణ దారుల గుట్టు రట్టయ్యే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

లోకాయుక్తలో కేసు నమోదు..

 • అసలు ఈ దేవాలయ భూములపై జరుగుతున్న అక్రమాల నిగ్గు తేల్చాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఎన్‌.శ్రీనివాస్‌ లోకాయుక్తలో (కేసు నెంబర్‌-2713/2016/బి1) ఫిర్యాదు చేశారు.
 • దీన్ని స్వీకరించిన కోర్టు 2017 జూన్‌లో నివేదిక ఇవ్వాలని ఎండోమెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది.
 • ఈ భూమి ముమ్మాటికి సీతారామస్వామి దేవాలయానిదేనని అయితే కొంత మంది వ్యక్తులు కబ్జాలో ఉన్నారని ఎండోమెంట్‌ అధికారులు లోకాయుక్తకు నివేదించారు.

1934 నుంచి రికార్డుల్లో పేర్లు మారాయి..

 • దేవరయంజాల్‌లోని 1531.13 ఎకరాలు సీతారామస్వామి దేవాలయానికి చెందినవే.
 • కానీ 1934 నుంచి రికార్డుల్లో పేర్లు మారుతూ వస్తున్నాయి.
 • పూర్వం దేవాలయానికి చెందిన భూములను కౌలుకు ఇచ్చేవారు. ఇలా కౌలుకు భూములు తీసుకున్న వారు పేరు మార్చుకొని ఉంటారు.
 • ప్రస్తుం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉంది. సుమారు 131 ఎకరాల భూమి హకీంపేట ఎరోడ్రమ్‌ కబ్జాలో ఉంది.
 • వారి ఆధీనంలో భూములను స్వాధీనం చేసుకుంటాం. – ఎండోమెంట్‌ అధికారులు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రామాలయ భూములపై రాబందుల రెక్కలు

ట్రెండింగ్‌

Advertisement