ఎనిమిది నెలలు గడిచినా ఒక్క రూపాయైనా ఇచ్చిందా..?
వాళ్లు ఇయ్యకున్నా వాళ్లవాటా కలిపి ఏక మొత్తంలో 56కోట్లు ఇచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే
రేషన్ డీలర్లకు అండగా సీఎం కేసీఆర్: మంత్రి గంగుల
హుజూరాబాద్‌టౌన్, జూన్17: రేషన్ డీలర్లకు ఎనిమిది నెలలుగా కేంద్రం ఒక్క రూపాయి కూడా కమీషన్ ఎందుకివ్వడం లేదని, క్వింటాల్‌కు 35 కమీషన్ ఎందుకు విడుదల చేయడం లేదని రాష్ట్ర బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. రేషన్ డీలర్లపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానం ఉందని, కేంద్రం ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రం వాటా కలుపుకొని క్వింటాల్‌కు 70 కమీషన్ ఇస్తున్నదని చెప్పారు. పాత బకాయిలు 56 కోట్లను ఏక మొత్తంలో అందించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కొనియాడారు. గురువారం హుజూరాబాద్‌లో డివిజన్‌స్థాయి రేషన్ డీలర్లతో వారి సమస్యలపై మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
రేషన్ డీలర్లకు సీఎం అండగా నిలుస్తున్నారని, సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని చెప్పారు. చౌకధరల దుకాణాలు నిర్వహించే వారిని ప్రభుత్వంలో భాగంగా స్టాక్ హోల్డర్లుగానే సీఎం కేసీఆర్ చూస్తున్నారని, ప్రభుత్వం తరఫున నిరుపేదల కడుపునింపే మహాయజ్ఞంలో ఫ్రంట్‌లైన్ వారియర్లుగా డీలర్లు నిరంతరం పనిచేస్తున్నారని కొనియాడారు. డీలర్ల సమస్యలు పరిషరించడం కోసం తన అధ్యక్షతన మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని సీఎం ఏర్పాటు చేశారని, రేషన్ డీలర్లపై ప్రభుత్వానికి సానుకూల దృక్పథం ఉందని తెలిపారు. కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదనలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని, త్వరలోనే రేషన్ డీలర్ల సహెతుక కోరికలను తీర్చుతామని మంత్రి చెప్పారు. రేషన్ డీలర్లలోని అన్ని సంఘాలు ఏకమవడం శుభపరిణామమన్నారు.
టీఆర్ఎస్కు డీలర్ల మద్దతు
సమావేశం సందర్భంగా రేషన్ డీలర్లు, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. మంత్రి మాట్లాడుతున్న సమయంలో చేతులు పైకెత్తి హర్షం వ్యక్తం చేశారు. తమ సంక్షేమం గురించి అనేక చర్యలు చేపడుతున్న ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడూ కృతజ్ఞులమై ఉంటామని చెప్పారు. రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో రేషన్ డీలర్ల, ఎల్పీజీ డీలర్ల సంపూర్ణ మద్దతు, సహాయ సహకారాలు కేసీఆర్‌కు, టీఆర్ఎస్కు ఉంటాయని స్పష్టం చేశారు. ఇక్కడ హుజూరాబాద్ ఆర్డీవో సీహెచ్ రవీందర్ రెడ్డి, తహసీల్దార్ ఎల్ రాంరెడ్డి, రేషన్ డీలర్ల సంఘం డివిజన్ అధ్యక్షుడు సొల్లు అశోక్, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల ప్రతినిధులు పీవీ మదన్మోహన్, స్వరూప, వసంత్, రేషన్ డీలర్లు ఉన్నారు.