బుధవారం 15 జూలై 2020
Hyderabad - May 28, 2020 , 00:31:16

పనిచేస్తున్న సంస్థను పక్కదోవ పట్టించి నగదు అపహరించిన ఉద్యోగి

పనిచేస్తున్న సంస్థను పక్కదోవ పట్టించి నగదు అపహరించిన ఉద్యోగి

నిందితుడి నుంచి రూ. 8.50 లక్షల నగదు స్వాధీనం

మన్సూరాబాద్‌ : ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ కేసు వివరాలను వెల్లడించారు. ఏపీ, ప్రకాశం జిల్లా, పొదిలి గ్రామానికి చెందిన మారం అచ్చిరెడ్డి (28) ఎంబీఏ చదివాడు. సూర్యాపేట జిల్లా, కోదాడ, కప్పుగల్లులో తన సమీప బంధువు బెజ్జం తిరుపతిరెడ్డికి చెందిన శ్రీసాయిచరణ్‌ పేపర్‌మిల్స్‌ లిమిటెడ్‌లో ఆరు నెలల క్రితం అకౌంటెంట్‌ కమ్‌ కలెక్షన్‌ బాయ్‌గా చేరాడు. సమీప బంధువు కావడంతో కంపెనీకి చెందిన నగదు లావాదేవీలను తిరుపతిరెడ్డి.. అచ్చిరెడ్డికి అప్పగించాడు. కాగా.. తీవ్ర ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న ప్రేమించిన యువతికి మెరుగైన వైద్యం చేయించాలనుకున్నాడు. ఇందుకు కంపెనీ డబ్బులు కాజేయాలనుకున్నాడు. ఈ క్రమంలో కరోనా, లాక్‌డౌన్‌ రావడంతో కలెక్షన్‌ కోసం నగరానికి రాలేదు. ఇటీవల సడలింపు ఇవ్వడంతో ఈనెల 25న ఉదయం నగరానికి వచ్చిన లచ్చిరెడ్డి... ఇద్దరి వద్ద వసూలు చేసిన రూ.8.5లక్షలను బ్యాగులో పెట్టుకున్నాడు. గుర్రంగూడలో మరొకరి వద్ద రూ.26వేలు తీసుకుని జేబులో పెట్టుకుని నడుచుకుంటూ వెళుతుండగా.. డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఎల్బీనగర్‌లో డ్రాప్‌ చేస్తానని చెప్పగా.. అందుకు అచ్చిరెడ్డి నిరాకరించాడు. అనంతరం తన పథకంలో భాగంగా గుర్రంగూడలోని నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్లిన అచ్చిరెడ్డి.. తన బ్యాగులో ఉన్న రూ. 8.50లక్షల నగదును చెట్ల పొదల్లో దాచిపెట్టి దారిదోపిడీ డ్రామా ఆడాడు. నడుచుకుంటూ వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు బైకుపై వచ్చి.. తన వద్ద ఉన్న రూ. 8.50లక్షల నగదును అపహరించుకుపోయారని.. యజమాని అయిన తిరుపతిరెడ్డికి సమాచారం ఇచ్చాడు.  అచ్చిరెడ్డి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన మీర్‌పేట్‌ పోలీసులు పలు ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. గుర్రంగూడ శివారు ప్రాంతంలో బుధవారం ఉదయం 7:30 గంటలకు అనుమానాస్పదంగా తచ్చాడుతున్న అచ్చిరెడ్డిని మీర్‌పేట్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా దారిదోపిడీ ఒక డ్రామాగా తేలింది. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు గుర్రంగూడ నిర్మానుష్య ప్రాంతంలో దాచిన నగదును స్వాధీనం చేసుకున్నారు. అచ్చిరెడ్డిని రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో డీసీపీ క్రైమ్స్‌ యాదగిరి, అడిషనల్‌ డీసీపీ క్రైమ్స్‌  శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


logo