అత్యవసరమంటూ మస్కా...

ఎఫ్బీలో నకిలీ ఖాతాలు సృష్టించి... అర్జెంట్‌గా డబ్బులు పంపాలంటూ మెసేజ్
భరత్పూర్ సైబర్‌నేరగాళ్ల నయా మోసం..
అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్‌క్రైమ్ పోలీస్
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:
ఓఎల్ఎక్స్లో ప్రకటనలు వేస్తూ.. ఆర్మీ సిబ్బందిమంటూ నమ్మిస్తూ మోసం చేస్తున్న రాజస్థాన్, భరత్పూర్ సైబర్ నేరగాళ్లు మరో కొత్త మోసానికి తెరలేపారు. నకిలీ ఫేస్బుక్(ఎఫ్బీ) ఖాతాలను తెరిచి.. అసలైన ఖాతాదారుడి మాదిరిగానే నటిస్తూ, అతడి స్నేహితులు, బంధువులతో చాట్ చేస్తూ.. తమకు అత్యవసరంగా డబ్బులు కావాలంటూ కోరుతున్నారు. దీంతో కొందరు వారి బుట్టలో పడుతుండగా.. మరికొందరు అసలైన వాళ్లకు ఫోన్లు చేసి నిర్ధారించుకుంటున్నారు. అయితే.. నకిలీ ఫేస్బుక్ ఖాతా బాధితుల్లో పోలీసు ఉన్నతాధికారులు సైతం ఉంటున్నారు. ఎఫ్బీ ఖాతాలపై హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాలు, కమిషనరేట్లలోని సైబర్ విభాగాల్లో బాధితులు ఫిర్యాదులు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు 8 మంది పోలీసు విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది తమ పేరుతో నకిలీ ఖాతా తెరిచారంటూ ఫిర్యాదు చేశారు.
ఫేక్ ఖాతాలు సృష్టించి..
బ్యాంకు అధికారులమంటూ, కస్టమర్‌కేర్ వంటి పలు రకాల నేరాలు చేస్తున్న సైబర్ దొంగలు.. కొత్తగా ఇటీవల నకిలీ ఫేస్బుక్ ఐడీలతో మోసాలు చేయడం ప్రారంభించారు. అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు సైబర్‌నేరగాళ్లు ఏదో ఒక రూపంలో అమాయకులకు వల వేస్తున్నారు. అందులో ఈ ఫేక్ ఖాతాల తయారీ కూడా ఒకటి. ఈ ఫేక్ ఖాతాల్లో అసలైన వ్యక్తి పేరు, ఫొటో, ప్రొఫైల్ వివిధ అంశాలు కూడా బాధితులకు సంబంధించినవే ఉంటాయి. ఇలా నకిలీ ఖాతాలతో బాధితుల అసలైన ఖాతాలో ఉండే స్నేహితులకు సంబంధించిన సర్కిల్ గురించి ఒక అంచనాకు వచ్చిన తరువాత డబ్బులు అడగడం ప్రారంభిస్తారు. ఎవరైనా అనుమానం వచ్చి ఇదేంటీ?... మరో ఖాతా ప్రారంభించావా? అని ప్రశ్నిస్తే.. అదేమి లేదు..చాలా రోజుల నుంచే వాడుతున్నాను... ఇటీవల ఎక్కువగా ఆన్‌లైన్‌లోకి రాలేకపోయానంటూ చెబుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఎలాంటి చాటింగ్‌లు లే కుండానే డబ్బు కావాలంటూ బాధగా అడిగి.. బ్యాంకు ఖాతా, గూగుల్ పే నంబర్లు కూడా పంపిస్తున్నారు. ఇలా.. చాలా మంది నిజమని నమ్మి డబ్బు ఇచ్చేస్తున్నారు.
జాగ్రత్తగా ఉండాలి...
సైబర్‌నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ దొంగలు రోజుకో కొత్త మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటివారిపై జాగ్రత్తగా ఉండాలంటున్నారు. తెలిసిన వారు, గుర్తుతెలియని వారు ఎవరైనా సరే ఆన్లైన్లో డబ్బు ప్రస్తావన తెస్తే అనుమానిస్తూ వెంటనే సంబంధిత వ్యక్తులకు ఫోన్ చేసి, అసలు విషయాన్ని నిర్ధారించుకోవాలి. ఎవరు కూడా డబ్బులను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం, డిజిటల్ పద్ధతుల్లో ట్రాన్స్ఫర్ చేయడం చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
మోసం ఇలా...
సైబర్ నేరగాళ్లు.. నిత్యం ఇతరుల ఫేస్బుక్ ఖాతాలను ఫాలో అవుతూ, అందులో ఉన్న ఖాతాదారుడి ఫొటో, పేరు, ప్రొఫైల్‌లోని వివరాలతో నకిలీ ఖాతాలు సృష్టిస్తారు. ఈ నకిలీ ఖాతాలోకి అసలైన ఖాతాదారుడి సర్కిల్లో ఉన్న వారిని ఫ్రెండ్స్‌గా యాడ్ చేస్తూ... అదను చూసి అత్యవసరంగా డబ్బు అవసరముందంటూ వల వేస్తున్నారు. ఇలా వేసిన వలలో చిక్కినవారు కొందరు నిజమని నమ్మి... డబ్బు పోగొట్టుకుంటుండగా.. మరికొందరు అనుమానంతో అసలైన ఖాతాదారుడికి ఫోన్ చేసి నిర్ధారించుకుంటున్నారు. ఇలాంటి ఫిర్యాదులు ప్రతీ రోజు సైబర్‌క్రైమ్ పోలీస్‌స్టేషన్‌కు మూడు నుంచి ఐదు వరకు వస్తున్నాయి. మరికొందరు డబ్బు ఏమి ఇవ్వలేదని, తమపేరుపై నకిలీ ఖాతా తెరిచారంటూ ఫోన్లలో సైబర్‌క్రైమ్ పోలీసులకు సమాచారం ఇస్తున్నారు.
అధికారుల ముసుగులోనూ...
ప్రైవేట్, ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే అధికారుల వ్యక్తిగత పేర్లతోనూ నకిలీ ఫేస్బుక్ ఖాతాలు, ఈమెయిల్ ఐడీలు తయారు చేస్తుంటారు. స్నేహితులే కాకుండా కార్యాలయాల్లో పనిచేసే వారిని కూడా లక్ష్యంగా సైబర్‌నేరగాళ్లు ఎంచుకుంటున్నారు. ఎవరో ఒకరికి కాదు.. వేల సంఖ్యలో ఇలాంటి నకిలీ ఖాతాలు తెరిచి.. వల వేస్తుంటారు. ఆ వలలో చిక్కుకున్న వారు, నేరగాళ్లు చెప్పేది నిజమని నమ్మి డబ్బు డిపాజిట్ చేసి చివరకు మోసపోతున్నారు. అలాగే.. ఇతర దేశాల్లో ఉన్నట్లు చెప్పుకుంటూ, హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న తమ దగ్గరి బంధువు, స్నేహితుడికి డబ్బు అత్యవసరమంటూ నమ్మిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. అలాగే.. నకిలీ ఈ మెయిల్ ఐడీలతో ఈ మెయిల్స్ పంపించి, తాను ఊరిలో లేనని, ఫలానా వాళ్లకు డబ్బు అవసరమంటూ సూచిస్తూ మెయిల్స్ పంపించి మోసాలకు పాల్పడుతున్నారు.
తాజావార్తలు
- టీజర్‌కు ముందు ప్రీ టీజర్..ప్రమోషన్స్ కేక
- భద్రతామండలిలో భారత్‌కు చోటుపై లిండా ఏమందంటే?!
- ట్రాక్టర్ ర్యాలీ హింస: 33 కేసులు.. 44 లుక్ అవుట్ నోటీసులు
- వెంకీ-వరుణ్ 'ఎఫ్ 3' విడుదల తేదీ ఫిక్స్
- 40ఏండ్ల ఇండస్ట్రీకి కూడా ఇది తెలుసు. కానీ,
- శ్యామ్‌సంగ్ మరో బడ్జెట్ ఫోన్ గెలాక్సీ ఎంవో2 ..! 2న లాంచింగ్!!
- ప్రపంచంలోనే అత్యధిక కార్లు విక్రయించిన కంపెనీ ఇదే..!
- సోనూసూద్ కోసం 2 వేల కి.మీ సైక్లింగ్..!
- డాలర్ జాబ్‌లపై మోజు ఎందుకంటే!
- కొవిడ్ - 19 : రెండు రాష్ట్రాల్లోనే 67 శాతం కేసులు