బుధవారం 03 జూన్ 2020
Hyderabad - May 23, 2020 , 03:31:25

లాక్‌డౌన్‌లో పెరిగిన విద్యుత్‌ వినియోగం

లాక్‌డౌన్‌లో పెరిగిన విద్యుత్‌ వినియోగం

అబిడ్స్‌:  అసలే వేసవి కాలం, అందులో లాక్‌డౌన్‌తో  అందరూ నివాసాలకే పరిమితమయ్యారు. దీంతో విద్యుత్‌ వినియోగం పెరిగింది. అయినా విద్యుత్‌ శాఖ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నది. బేగంబజార్‌ డివిజన్‌ పరిధిలో సాధారణ సమయాల్లో ప్రతి నెలా దాదాపు రెండు లక్షల యూనిట్ల విద్యుత్‌ వినియోగం ఉంటుంది. వేసవి కాలంలో 50 నుంచి 60 వేల యూనిట్ల వరకు వినియోగం పెరుగుతుంది. ఈ సారి వేసవితో పాటు లాక్‌డౌన్‌ తోడవడంతో అదనంగా సుమారు 30 వేల  యూనిట్ల విద్యుత్‌ వినియోగం పెరిగినట్లు అధికారులు  చెబుతున్నారు. వేసవి కాలం, లాక్‌డౌన్‌ సమయాల్లో విద్యుత్‌ వినియోగం అధికమైనా ప్రజలకు విద్యుత్‌ సరఫరాలో ఆటంకం కలగకుండా బేగంబజార్‌ డీఈ ఎ. శ్రీధర్‌ అన్ని విధాలా చర్యలు చేపడుతున్నారు. డొమెస్టిక్‌ వినియోగదారుల విద్యుత్‌ వాడకం పెరిగిందని డీఈ శ్రీధర్‌ తెలిపారు. అదే విధంగా లాక్‌డౌన్‌తో విద్యుత్‌ రీడింగ్‌ తీయడానికి అనుకూలంగా లేకపోవడంతో గత సంవత్సరం ఇదే మాసంలో వచ్చిన బిల్లులను చెల్లించాలని, మీటర్‌ రీడింగ్‌ తరువాత సరి చేస్తామని అధికారులు చెబుతున్నారు. కొంత మంది వినియోగదారులు తమ బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లించారు. అయితే డివిజన్‌లో ప్రతి నెలా దాదాపు రూ. 12 నుంచి 13 కోట్ల వరకు విద్యుత్‌ బిల్లుల రెవెన్యూ వస్తుంది. కానీ లాక్‌డౌన్‌ సందర్భంగా మార్చి, ఏప్రిల్‌ మాసంలో రూ. 4.5 కోట్లు విద్యుత్‌ బిల్లులు వసూలయ్యాయని శ్రీధర్‌ తెలిపారు. 

బిల్లుల చెల్లింపులకు మైకులతో ప్రచారం..

విద్యుత్‌ బిల్లులను చెల్లించాలని బస్తీల వారీగా మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. రెండు నెలలుగా విద్యుత్‌ బకాయిలు పేరుకు పోవడంతో ఈ నెలలో లాక్‌డౌన్‌ సడలింపులు ఉండడంతో విద్యుత్‌ బిల్లులను వసూలు చేసేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. 

సకాలంలో చెల్లించండి

విద్యుత్‌ బిల్లులను వసూలు చేసేందుకు ప్రచారాన్ని చేపడుతున్నాం. బస్తీలు, కాలనీల్లో ప్రచారాన్ని చేపట్టడంతో పాటు సిబ్బందిని కాలనీలు, బస్తీలలో తిప్పి బిల్లులను వసూలు చేస్తున్నాం.  ప్రతి నెలా రూ. 12 నుంచి 13 కోట్ల వసూలు అయ్యేది కానీ లాక్‌డౌన్‌తో నెలకు రూ. 4 కోట్లు మాత్రమే వసూలైంది. జూన్‌ మొదటి వారంలో రీడింగ్‌లు తీసి అందరి బిల్లులను సరి చేస్తాం.             -శ్రీధర్‌, బేగంబజార్‌ డీఈ


logo