e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home హైదరాబాద్‌ హేయ్‌.. నా బ్యాగ్రౌండ్‌ తెలుసా..? ఊదమంటే తాగుబోతులు నానా యాగీ..

హేయ్‌.. నా బ్యాగ్రౌండ్‌ తెలుసా..? ఊదమంటే తాగుబోతులు నానా యాగీ..

  • ఫలానా వాళ్లు తెలుసంటూ.. బెదిరింపులు.. వీడియోలు తీసి.. రచ్చ చేసే ప్రయత్నం
  • సముదాయించి పరీక్షిస్తే.. బీఏసీ కౌంట్‌ వందల్లో..
  • వీకెండ్‌లో నిషాలోనే డ్రైవింగ్‌.. వారాంతాల్లో రోడ్డు ప్రమాదాలు.. ఆదివారం అధికం..
  • 7 నెలల్లో 144 మంది మృతి.. నిబంధనలు పాటిస్తే అందరం సురక్షితం

మాదాపూర్‌ ప్రాంతంలో ఓ వాహనదారుడు రయ్యిమంటూ దూసుకువచ్చాడు. డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో భాగంగా పోలీసులు ఆపారు. అతడిని బ్రీత్‌ ఎనలైజర్‌ ద్వారా పరీక్షించారు. రీడింగ్‌ 300 దాటింది. పోలీసులు వాహనం స్వాధీనం చేసుకుని అతడిని విచారించారు. సార్‌.. సాయంత్రం 5 గంటలకు ఫ్రెండ్స్‌తో బయలు దేరాను. ముందుగా ఒక బార్‌లో తాగాం. ఆ తర్వాత పబ్‌కు వెళ్లాం. అక్కడా మద్యం తీసుకున్నాం. మరో పబ్‌కు వెళ్ళాం. అక్కడా మద్యం సేవించాం.. చివరకు మా ఫ్రెండ్‌ను ఇంటి దగ్గర దించేసి ఓ బీర్‌ తాగాం. నేను ఇంటికి వెళ్తున్నాను. జరంత ముందుకు పోయి గల్లీ దాటితే ఇంటికి చేరుకుంటా. ఇంతలో మీరు పట్టుకున్నారు.

రాజేంద్రనగర్‌ వద్ద ఓ లారీ డ్రైవర్‌ను పోలీసులు ఆపారు. అతడికి బ్రీత్‌ ఎనలైజర్‌ ద్వారా డ్రంకన్‌ డ్రైవ్‌ టెస్టు నిర్వహించారు. 550 రీడింగ్‌ వచ్చింది. అసలు ఆ డ్రైవర్‌ ఇంత ఎందుకు తాగాడని ట్రాఫిక్‌ పోలీసులు ఆరా తీశారు. ఉదయం 8 గంటల నుంచి తాగుతూ ఉన్నట్లు చెప్పాడు. క్వార్టర్‌ తాగి ఓ రెండు గంటలు గ్యాప్‌ ఇచ్చిన తర్వాత మరో క్వార్టర్‌ తాగాడు. ఇలా తాగుతూ.. డ్రైవ్‌ చేస్తున్నానని చెప్పాడు.

- Advertisement -

ఈ తరహా సన్నివేశాలు ప్రతి డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పాల్గొన్న పోలీసులు చూస్తుంటారు. నేడు మందు బాబులు రోడ్లపై ప్రమాదాలు సృష్టించే మానవ బాంబులుగా మారుతున్నారు. ఎంత అవగాహన కల్పిస్తున్నా వారిలో మార్పు రావడం లేదు. మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేస్తూ తోటి ప్రయాణికులకు ప్రాణగండంగా మారుతున్నారు. రోడ్డు ప్రమాదాలు సృష్టిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిని కుటుంబ సభ్యులు వారించాలని పోలీసు అధికారులు కోరుతున్నారు. పార్టీల పేరుతో స్నేహితులంతా కలిసి తాగుతున్నారు.. దీంతో ఇంటికి క్షేమంగా చేరుకోవడంలేదని, స్నేహితుల్లో ఒకరిద్దరూ తాగకుండా ఉంటే.. తాగిన వారిని క్షేమంగా ఇంటికి చేర్చే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

పోలీసులను వీడియో తీస్తున్నారు…

మందుబాబుల వాగ్వివాదాలు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. వారిని ఆపి డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించే పోలీసులతో విచిత్రంగా వ్యవహరిస్తారు. నాకు ఎమ్మెల్యే తెలుసు, మా అంకుల్‌ పోలీసు ఆఫీసర్‌, మా అన్న ప్రెస్‌ రిపోర్టర్‌, మానాన్న పెద్ద పారిశ్రామికవేత్త. అంటూ పోలీసులను బెదిరిస్తుంటారు. కొందరైతే సెల్‌ఫోన్‌లతో వీడియోలు తీస్తూ.. ట్రాఫిక్‌ పోలీసులు దౌర్జన్యంగా వాహనదారులను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మగవారితోపాటు మద్యం మత్తులో వాహనాలు నడిపిస్తున్న మహిళలు కూడా ఇబ్బంది పెడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ పరిస్థితి ఇప్పుడు గ్రేటర్‌ హైదరాబాద్‌లోని హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్ల పరిధిలో కనిపిస్తుంది.

నషాలోనే వాహనాల డ్రైవింగ్‌..

  • వారాంతాల్లో రోడ్డు ప్రమాదాలు..
  • ఆదివారం అధికం.. 7 నెలల్లో 144 మంది మృతి..

సిటీబ్యూరో, జూలై 25 (నమస్తే తెలంగాణ): మద్యం తాగి వాహనాలు నడపడం వారాంతాల్లో ప్రమాదకరంగా మారింది. ఈ ఏడాది ఏడు నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేషిస్తే.. సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులకు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. ప్రధానంగా ఆదివారం వచ్చిందంటే చాలు. మందుబాబుల్లో ఉత్సాహం పెరిగి.. వాహనాల వేగాన్ని కూడా పెంచుతున్నారు. ఒకపక్క మద్యం మత్తు.. మరోపక్క వేగంతో వాహనం నడిపించడంతో నూరేళ్లు బతుకాల్సిన వారు పాతికేళ్లకు రోడ్డు ప్రమాదాల్లో చిక్కుకొని మరణిస్తున్నారు. ఈ ఏడు నెలల్లో మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల మొత్తం 144 మంది చనిపోయారు. అందులో వారాంతాపు రోజుల్లో 71 మంది చనిపోయారు. చాలా మంది వీకెండ్‌ అంటూ మద్యాన్ని ఫుల్‌గా తాగేస్తున్నారు. ఆ తర్వాత నషా దిగకపోయినా రోడ్లపైకి వచ్చి వాహనాలు వేగంగా నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు.

డ్రంకన్‌ డ్రైవ్‌ పరీక్షల నుంచి తప్పించుకోవడానికే: ట్రాఫిక్‌ పోలీసులు

మద్యం మత్తులో ఉండి, డ్రంకన్‌ డ్రైవ్‌ పరీక్షల నుంచి తప్పించుకునేందుకు ఈ విధంగా వాగ్వివాదాలకు దిగుతున్నారు. అయినా, అధికారులు, సిబ్బంది సహనంతో వారిని ఒప్పించి చివరకు డ్రంకన్‌ డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహించి పంపుతున్నాం. తనిఖీకి సంబంధించిన ప్రతి అంశాన్ని రికార్డు చేస్తాం. ఇంత యాగీ చేసే మందుబాబులు.. మద్యం తాగి వాహనాలు నడిపించకుండా ఉంటేచాలు. నిబంధనలు పాటిస్తే అందరూ సురక్షితంగా ఉంటారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana