సిటీబ్యూరో, జూలై 24 (నమస్తే తెలంగాణ): పై ఫొటోలో ఉన్న వారంతా ఏ గ్యాస్ కంపెనీకో చెందిన వారనుకుంటున్నారా..? అయితే తప్పులో కాలేసినట్టే..! వాళ్లెందుకు ఎర్ర డ్రస్సు వేసుకున్నారో.. తెలిస్తే.. అవాక్కవుతారు..! వీరంతా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారు. వీరందరిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఒక రోజు నుంచి 20 రోజుల వరకు జైలు శిక్షను విధించారు. ఇలా శిక్ష ఖరారైన వారిని చర్లపల్లి జైలుకు తరలించారు. జైలు అధికారులు వీరందరికీ ఈ ఎరుపు రంగు దుస్తులను అందించారు. శిక్ష ఖరారైన ఖైదీలు కావడంతో జైలులో ఉన్న రోజు వారు కచ్చితంగా ఈ డ్రెస్సు కోడ్ పాటించాల్సిందే. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే ఏదో జైలు శిక్షే కదా ఒకటి రెండు రోజులలో వచ్చేస్తామని అంతా తేలికగా తీసుకుంటున్నారు. కానీ, వారంతా శిక్షపడిన ఖైదీలుగా జైలు అధికారులు నమోదు చేసుకుని డేంజ ర్ గుర్తుగా భావించే ఎరుపు రంగు దుస్తులను అందిస్తున్నారు. ఇక ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టబడితే కోర్టు వారికి జైలు శిక్ష విధిస్తే వారు శిక్షపడిన ఖైదీలుగా రికార్డులకు ఎక్కడం ఖాయమైంది. మందు బాబులు తస్మాత్ జాగ్రత్త!