శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 07, 2020 , 00:21:05

వేడి నీళ్లు తాగా.. ధైర్యంగా ఉన్నా..

వేడి నీళ్లు తాగా.. ధైర్యంగా ఉన్నా..

మామూలు జ్వరమే అనుకున్నా   

హోం క్వారంటైన్‌లో 20 రోజులు.. 

కొవిడ్‌ వస్తే భయపడొద్దు 

కరోనా విజేత డిప్యూటీ తహసీల్దార్‌ సుదర్శన్‌రెడ్డి

‘మామూలు జ్వరమే అనుకున్నా.. టెస్టు చేయిస్తే పాజిటివ్‌ వచ్చింది. అయినా భయపడలేదు. వైద్యుల సూచనలు పాటించా.. కషాయం, వేడి నీళ్లు తాగా.. కొవిడ్‌ వస్తే ఆందోళన పడొద్దు. చిట్కాలు పాటిస్తే నయమవుతుంది’. అని డిప్యూటీ తహసీల్దార్‌ సుదర్శన్‌రెడ్డి భరోసా ఇస్తున్నారు. కందుకూరు ఆర్డీవో కార్యాలయంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన.. వైరస్‌ బారినపడి.. జయించారు. తాను మహమ్మారి నుంచి ఎలా బయటపడ్డారో  ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే....  

20 రోజుల పాటు.. 

కందుకూరు ఆర్డీవో కార్యాలయంలో ఇన్‌చార్జి ఏవోతో పాటు డిప్యూటీ తహసీల్దార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నా.  వారం రోజుల నుంచి జ్వరం తగ్గకపోవడంతో సాధారణమైందేనని భావించా.... పరీక్షలు చేయిస్తే టైఫాయిడ్‌ అని డాక్టర్లు చెప్పారు. అయినా ఫీవర్‌ తగ్గలేదు. అనుమానంతో సరూర్‌నగర్‌ ప్రభుత్వ వైద్యశాలలో కరోనా టెస్టు చేయించుకుంటే.. పాజిటివ్‌ అని తేలింది. నాతో పాటు మరో ముగ్గురు సిబ్బంది కూడా వైరస్‌ బారినపడ్డారు. కరోనా వచ్చిందని తెలియగానే  కొంత ఆశ్చర్యపోయా.. ఆత్మైస్థెర్యంతో 20 రోజుల పాటు  హోం క్వారంటైన్‌లో ఉన్నా.  డాక్టర్ల సలహాలు తీసుకున్నా. భయపడొద్దని, ఏం కాదని  ఆర్డీవో రవీందర్‌రెడ్డి ధైర్యం చెప్పారు. ప్రతి రోజూ మందులతో పాటు ఆవిరిపట్టా.. మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం, లవంగాలు, యాలకులతో  కూడిన కషాయం, వేడి నీళ్లు తాగాను. తొందరగానే కోలుకొని ఆరోగ్యవంతుడినయ్యా.  నెగెటివ్‌ రిపోర్టు రావడంతో డ్యూటీలో చేరా. కరోనా వస్తే అనవసరంగా టెన్షన్‌ పడొద్దు. ప్రభుత్వ దవాఖానకు వెళ్తే  నయమవుతుంది. కంగారుపడి ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లకండి. ప్రజల్లో సర్కారు ఆస్పత్రులపై ఉన్న అపోహలు వీడాలి. అక్కడ చక్కటి వైద్యం అందిస్తారని తెలుసుకోవాలి.


logo