శనివారం 27 ఫిబ్రవరి 2021
Hyderabad - Jan 23, 2021 , 07:34:31

అదనపు కట్నం.. బలి తీసుకుంది

అదనపు కట్నం.. బలి తీసుకుంది

దుండిగల్‌,జనవరి22 : అదనపు కట్నంతో పాటు పిల్లలు పుట్టడం లేదనే కారణంతో నిత్యం వేధిస్తుండటంతో ఓ వివాహిత తనువుచాలించింది. కట్టుకున్న భర్తతోపాటు అత్త నిత్యం చిత్రహింసలకు గురిచేస్తుండటంతో తీవ్ర మనోవేదనకు గురైన హోమియోపతి వైద్యురాలు ఉరివేసుకుని బలవన్మరణం చెందింది. ఈ విషాద ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...హన్మకొండకు చెందిన సత్యనారాయణ, సుజాత దంపతుల రెండో కూతురు పల్లవిని 2016లో మెదక్‌ జిల్లా గజ్వేల్‌కు చెందిన శ్రీనివాస్‌కు ఇచ్చి వివాహం జరిపించా రు. వివాహ సమయంలో రూ.15లక్షల నగదు, 25 తులాల బంగారు ఆభరణాలతో పాటు ఫర్నిచర్‌ను కట్నంకింద ఇచ్చారు. పల్లవి హోమియోపతి వైద్యురాలు కాగా.. శ్రీనివాస్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. దంపతులు ప్రస్తుతం బాచుపల్లిలోని రేణుకాఎల్లమ్మ కాలనీలోని అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. వీరితోపాటు శ్రీనివాస్‌ తల్లి బాలమణి కూడా ఉంటుంది. ఈ క్రమంలో అదనపుకట్నం తీసుకురావాలని భర్త, అత్త.. పల్లవిని వేధించేవారు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పగా.. వారు 2018లో రూ.5లక్షలు, ఆ తర్వాత మరో రూ.2లక్షలు ఇచ్చారు. అయినా అదనపు కట్నంతోపాటు పిల్లలు పుట్టడం లేదని నిత్యం వేధించడంతోపాటు చిత్ర హింసలకు గు రిచేసేవారు. గురువారం ఉద యం నుంచి వేధిస్తుండటంతో తట్టుకోలేక గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  ఈ విషయాన్ని శ్రీనివాస్‌ రాత్రి 7 గంటల ప్రాంతంలో పల్లవి తండ్రి సత్యనారాయణకు సమాచారం ఇచ్చాడు. వెంటనే వారు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా ఫ్యానుకు వేలాడు తూ ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సైకోలా  వ్యవహరించేవాడు...

కాగా.. మృతురాలి భర్త శ్రీనివాస్‌ సైకోలా  వ్యవహరించేవాడని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు.. స్వతహాగా హోమియో వైద్యురాలైన పల్లవి కూకట్‌పల్లిలోని ఓ వైద్యశాలలో పనిచేసేదని, అయితే పల్లవి తనకంటే అధికంగా సంపాదించి, పేరు తెచ్చుకుంటే తనను ఎవరు గుర్తించరనుకుని వైద్యం చేయడం మాన్పించేశాడని తెలిపారు. పల్లవి ఆత్మహత్యకు కారకులైన ఆమె భర్త, అత్తపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. 

VIDEOS

logo