సోమవారం 08 మార్చి 2021
Hyderabad - Jan 28, 2021 , 05:58:46

ప్రయాణికులకు డబుల్‌ ఖుషీ

ప్రయాణికులకు డబుల్‌ ఖుషీ

  • నగర రహదారులపై డబుల్‌ డెక్కర్‌ బస్సులు 
  • పునరుద్ధరించనున్న గ్రేటర్‌ ఆర్టీసీ
  • నగర అందాలను వీక్షించేలా బస్సుల రూపురేఖలు

టీబ్యూరో, జనవరి 27 (నమస్తేతెలంగాణ) : హైదరాబాద్‌లో ఎన్నో ఏండ్ల కిందట నిలిచిపోయిన డబుల్‌ డెక్కర్‌ బస్సులను పునరుద్ధరించడంపై గ్రేటర్‌ ఆర్టీసీ దృష్టి సారించింది. నగరంలో పెరుగుతున్న పర్యాటక రంగం, అనేక కట్టడాలు వంటి వాటిని వీక్షిస్తూ ప్రయాణించేలా ఈ బస్సులను తీర్చిదిద్దుతున్నారు. నగరవాసుల అవసరాలకనుగుణంగా 50లోపు బస్సులను అన్ని ప్రధాన రూట్లలో నడిపించాలని భావిస్తున్నారు. అయితే పెరిగిన రద్దీ దృష్ట్యా నగరంలో పైవంతెనలు, ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిల సంఖ్య కూడా భారీగా పెరిగింది. తెలుగుతల్లి వంటి ఫ్లైఓవర్‌ లాంటి ప్రాంతంలో డబుల్‌ డెక్కర్‌ బస్సులను నడిపించడం ఇబ్బందిగా ఉందంటున్నారు. అయితే డబుల్‌ డెక్కర్‌ బస్సులు తిరిగే ప్రాంతాలను ఆర్టీసీ అధికారులు ఇప్పటికే సర్వే నిర్వహించి నివేదిక రూపొందించారు. ప్రధానంగా కోఠి-పటాన్‌చెరువు, మెహిదీపట్నం-సికింద్రాబాద్‌ ప్రధాన రూట్లలో ఈ బస్సులను నడిపించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. బస్సుల సంఖ్య, తిరిగే మార్గాలు, ఆదాయ వ్యయాలపై ప్రతిపాదనలు సిద్ధం చేశామని, ప్రభుత్వం ఆమోదించాల్సి ఉన్నదని ఆర్టీసీ గ్రేటర్‌ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. 

‘డబుల్‌'తో పెరగనున్న ఆదాయం 

మహానగరంలో బస్సుల ద్వారా ఆదాయం పెంచేందుకు అధికారులు ఇప్పటికే రకరకాల చర్యలు తీసుకుంటున్నారు. పర్యాటక ప్రాంతాల మీదుగా డబుల్‌ డెక్కర్‌ బస్సులను నడిపిస్తే మరింత ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. అందుకోసం బస్సుల నమూనాలు సిద్ధం చేస్తున్నారు. వాటిని మెట్రోస్టేషన్లతో అనుసంధానం చేయనున్నారు. విద్యార్థుల విజ్ఞానయాత్రలు, స్టడీ టూర్లకు అనుకూలంగా ఉండేలా డబుల్‌ డెక్కర్‌ బస్సులను నడిపిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

VIDEOS

logo