శనివారం 31 అక్టోబర్ 2020
Hyderabad - Sep 18, 2020 , 02:28:09

డబుల్‌బెడ్‌రూం ఇండ్లు నిర్ణీత కాలంలో అందజేస్తాం

డబుల్‌బెడ్‌రూం ఇండ్లు నిర్ణీత కాలంలో అందజేస్తాం

మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

డబుల్‌ ఇండ్ల పరిశీలనలో ఎమ్మెల్యే  భట్టి విక్రమార్క,   హనుమంతరావులకు వివరాలు వెల్లడి 

జియాగూడ: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించిందని రాష్ట్ర పశుసంవర్ధక  మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. జియాగూడ డివిజన్‌ పరిధి పాత మున్సిపల్‌ క్వార్టర్స్‌లో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డివిజన్‌ కార్పొరేటర్‌ మిత్రకృష్ణ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వి.హనుమంతరావు, జీహెచ్‌ఎంసీ హౌసింగ్‌ ఈఈ వెంకట్‌దాస్‌రెడ్డితో కలిసి  పర్యటించారు. అనంతరం జియాగూడలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల వివరాలను వారికి వెల్లడించారు. మొత్తం రూ. 71. 40 కోట్ల వ్యయంతో 12 బ్లాకుల్లో ఐదు అంతస్తుల్లో 840 ఇండ్లను నిర్మించినట్లు తెలిపారు. ఒక్కో ప్లాట్‌ వైశాల్యం 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు బెడ్‌రూం, కిచెన్‌, రెండు బాత్‌రూంలు, ప్రతి బ్లాక్‌కు లిఫ్ట్‌, పార్కింగ్‌ సౌకర్యం ఉండేలా నిర్మాణాలు చేపట్టినట్లు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, వి.హనుమంతరావులకు మంత్రి తలసాని వివరించారు. కరెంట్‌ కోతలు లేకుండా ఉండేందుకు ఆటోమెటిక్‌ వ్యవస్థ ఏర్పాటు చేశామని, అండర్‌గ్రౌండ్‌లో విద్యుత్‌ వైర్లు ఏర్పాటు చేసి విద్యుత్‌ సరఫరా అందిస్తున్నామన్నారు. జియాగూడ పాత మున్సిపల్‌ క్వార్టర్స్‌ నిర్వాసితులు 570 మందికి  ఇండ్లను నిర్మించామని, వాటితోపాటు మరో 270 అదనంగా నిర్మించినట్లు పేర్కొన్నారు. గోషామహల్‌ నియోజకవర్గం పరిధి గోడెకబర్‌లో 192, కట్టెలమండిలో 120ఇండ్లను నిర్మిస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ కార్వాన్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఠాకూర్‌ జీవన్‌సింగ్‌, గోషామహల్‌ కార్పొరేటర్‌ ముఖేశ్‌సింగ్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి ఆర్వీ మహేందర్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ హౌసింగ్‌ ఏఈ హుస్సేన్‌ బాను, నిర్మాణ సంస్థ ప్రతినిధి సర్వేశ్‌, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌, మహ్మద్‌ ఖాజా హుస్సేన్‌, నాంపల్లి నియోజకవర్గ నాయకులు ఫిరోజ్‌ఖాన్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు సాయికన్నా పాల్గొన్నారు.

ఇందిరానగర్‌ డబుల్‌ గృహాల వద్ద పర్యటన..

ఖైరతాబాద్‌: అసెంబ్లీలో కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క సవాల్‌కు ధీటైన జవాబిస్తూ  మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ డబుల్‌ గృహాలు నిర్మితమవుతున్న ఖైరతాబాద్‌ ఇందిరానగర్‌లో గురువారం పర్యటించారు. భట్టి విక్రమార్కను తోడ్కొని వచ్చిన మంత్రి వేగవంతంగా పూర్తవుతున్న గృహాలను చూపించారు. అత్యంత నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ గృహాలను నిర్మిస్తున్నామని, నిర్ణీత కాలంలో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పారు. మంత్రి వెంట మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కార్పొరేటర్‌ పి.విజయారెడ్డి ఉన్నారు.

బన్సీలాల్‌పేట్‌లో నేతలకు స్వాగతం..

బన్సీలాల్‌పేట్‌: జీవైఆర్‌ కాంపౌండ్‌, చాచానెహ్రూనగర్‌, పొట్టి శ్రీరాములు నగర్‌, బండమైసమ్మనగర్‌ బస్తీల్లో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాలను పరిశీలించేందుకు వచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, వి.హనుమంతరావు, అంజన్‌కుమార్‌యాదవ్‌, ఇతర నాయకులకు లబ్ధిదారులు స్వాగతం పలికారు. సకల సదుపాయాలతో రెండు పడకల గదుల ఇండ్లను నిర్మించి ఇస్తున్న సీఎం కేసీఆర్‌కు, మంత్రి తలసానికి రుణపడి ఉంటామన్నారు. ‘చిన్నచిన్న గుడిసెల్లో అనేక ఏండ్లు ఎన్నో బాధలు అనుభవించి జీవించాం, మరికొద్ది రోజుల్లోనే తాము కూడా గౌరవంగా జీవించబోతున్నాం’ అని లబ్ధిదారు లక్ష్మ మ్మ హర్షం వ్యక్తం చేసింది. బన్సీలాల్‌పేట్‌ రెసిడెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎంఏ ఫహీం భట్టి విక్రమార్కను సన్మానించారు. బన్సీలాల్‌పేట్‌ కార్పొరేటర్‌ కె.హేమలత, జీహెచ్‌ఎంసీ హౌసింగ్‌ ఈఈ వెంకట్‌దాస్‌రెడ్డి కాంగ్రెస్‌ నాయకులకు నాలుగు ప్రాజెక్ట్‌ల గురించి వివరించారు. టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు వెంకటేశన్‌ రాజు, కె.లక్ష్మీపతి పాల్గొన్నారు.