ఆదివారం 31 మే 2020
Hyderabad - May 20, 2020 , 23:26:25

పేదల సొంతింటి కల నెరవేరే సమయం ఆసన్నమైంది..

పేదల సొంతింటి కల నెరవేరే సమయం ఆసన్నమైంది..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పేదల సొంతింటి కల నెరవేరే సమయం ఆసన్నమవుతున్నది. నగరంలోని పేదల ఆత్మగౌరవాన్ని పెంపొందించే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణం శరవేగంగా పూర్తవుతుండటంతో దశలవారీగా పంపిణీచేసేందుకు  జీహెచ్‌ఎంసీ అధికారులు కార్యప్రణాళికను సిద్ధంచేశారు. వచ్చే జూన్‌ నాటికి 45వేల ఇండ్లను పంపిణీకి సిద్ధం చేయాలని, అలాగే దశలవారీగా వచ్చే ఏడాది మార్చి నాటికి మొత్తం ఇండ్లను పూర్తిచేయాలని సంకల్పించారు.

హైదరాబాద్‌: నగరంలోని పేదలకోసం హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి తదితర జిల్లాల పరిధిలో 117ప్రాంతాల్లో లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణం చేపట్టిన విషయం విదితమే. ఇందులో 49 ప్రాంతాల్లో ఇన్‌-సీటూ(బస్తీల్లో గుడిసెలు తొలగించి అదేచోట ఇండ్ల నిర్మాణం) పద్ధతిలో 9,828 ఇండ్లను నిర్మిస్తుండగా, 68 చోట్ల ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో 90,172 ఇండ్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో 13చోట్ల 8,796ఇండ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. అన్నానగర్‌, రామకృష్ణానగర్‌, కుందన్‌పల్లి తదితర మూడు ప్రాంతాల్లో భూ వివాదాలు, ఇతర సమస్యల కారణంగా 2,047ఇండ్ల నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. హైదరాబాద్‌ జిల్లాలో 9,913, రంగారెడ్డిలో 23,604, మేడ్చల్‌లో 36,216 , సంగారెడ్డిలో 28,220 కలిపి మొత్తం 97,953 ఇండ్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో ముఖ్యంగా కొల్లూరు, అహ్మద్‌గూడ, రాంపల్లి, గాజులరామారం, బాచుపల్లి, డి.పోచంపల్లి తదితర ప్రాంతాల్లోనే దాదాపు 35వేల ఇండ్లను నిర్మిస్తుండటం విశేషం. 

ఒక్కో ఇంటికి రూ.9లక్షలు

నగరంలో చేపట్టిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లకు ఒక్కోదానికి (ఇంటికి) రూ.7.5 లక్షలు, మౌలిక సదుపాయాలకు రూ.1.5లక్షలు కలిపి మొత్తం రూ.9 లక్షల వరకు ఖర్చు అవుతున్నది. ఇందులో ప్రధానమంత్రి ఆవాస్‌యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.1.5లక్షలు ఇవ్వనుండగా, మిగిలినదంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి పీఎంఏవై నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం, లబ్ధిదారుడు కూడా వాటాదారులుగా ఉండాలి. అయితే లబ్ధిదారుల పూర్తి వివరాలు అందజేస్తేనే నిధులు విడుదల చేస్తామని కేంద్రం షరతు విధించింది. 

8452 ఇండ్లు పంపిణీకి రెడీ

మొత్తం లక్ష ఇండ్లకుగాను 13ప్రాంతాల్లో 8796ఇండ్ల నిర్మాణం పూర్తికాగా, అందులో సింగంచెరువు తండా, చిత్తారమ్మబస్తీ, కిడ్కీ బూద్‌ అలీషా, సయిద్‌ సాబ్‌ కా బాడా తదితర నాలుగు ప్రాంతాల్లో నిర్మించిన 344 ఇండ్ల పంపిణీ ఇదివరకే పూర్తయింది. ఇవికాకుండా గాజులరామారం, అమీన్‌పూర్‌, జమ్మిగడ్డ, అహ్మద్‌గూడ, డి.పోచంపల్లి-1, డి.పోచంపల్లి-2, బహదూర్‌పల్లి, ఎరుకల నాచారమ్మ బస్తీ, జియాగూడ తదితర తొమ్మిది ప్రాంతాల్లో 8,452ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఇవి కాకుండా మరో 18చోట్ల 36,076 ఇండ్ల నిర్మాణం తుదిదశకు చేరుకున్నది. దీంతో వచ్చే జూన్‌ మాసంలో వీటిని పంపిణీ చేయాలని నిర్ణయించారు.


logo