శుక్రవారం 27 నవంబర్ 2020
Hyderabad - Oct 27, 2020 , 07:42:53

తొలగుతున్న అడ్డంకులు..

తొలగుతున్న అడ్డంకులు..

బంజారాహిల్స్‌ : జూబ్లీహిల్స్‌ డివిజన్‌ పరిధిలోని గురుబ్రహ్మనగర్‌ బస్తీలో నివాసం ఉంటున్న పేదల డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి అడ్డంకులు తొలగుతున్నాయి. ఎన్నో ఏండ్లుగా గుడిసెల్లో నివాసం ఉంటున్న కుటుంబాలకు పక్కా ఇండ్లను కట్టించేందుకు ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నప్పటికీ స్థలం విషయంలో వివాదాలు తలెత్తడంతో పనులు ముందుకు సాగలేదు. బస్తీవాసులకు, పక్కనే ఉన్న నందగిరిహిల్స్‌ కాలనీవాసులకు మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించేందుకు స్థానిక కార్పొరేటర్‌ కాజా సూర్యనారాయణ, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఏడాది కాలంగా చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి. బస్తీవాసులు ప్రస్తుతం ఉంటున్న 1.25 ఎకరాల  స్థలాన్ని వదిలిపెట్టి మిగిలిన స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణం చేసుకునేందుకు నందగిరిహిల్స్‌ కాలనీవాసులు, గురుబ్రహ్మనగర్‌ బస్తీవాసులు అంగీకరించారు. ఈ స్థలంపై హైకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకునేందుకు కాలనీవాసులు ఒప్పుకున్నారు. త్వరలోనే కోర్టు బయట ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తెలిపారు. సుమారు 27 ఏండ్ల క్రితం తమ బస్తీ ఏర్పడిందని, గత ప్రభుత్వం హయాంలో 272మందికి పొసేషన్‌ సర్టిఫికెట్లు కూడా ఇచ్చారని బస్తీ అధ్యక్షుడు గోపాల్‌ నాయక్‌ తెలిపారు. ప్రస్తుతం సుమారు 400 కుటుంబాలు ఈ బస్తీలో నివాసం ఉంటున్నారని, వారందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఇప్పిస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్‌ హామీ ఇచ్చారని వివరించారు. మంత్రి కేటీఆర్‌ చేతులమీదుగా త్వరలోనే డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తెలిపారు.

ప్రణాళికలు సిద్ధం..

గురుబ్రహ్మనగర్‌బస్తీలో స్థల వివాదం పరిష్కారం కావడంతో ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టేందుకు జీహెచ్‌ఎంసీ హౌసింగ్‌ అధికారులు  కసరత్తు ప్రారంభించారు. మూడురోజుల క్రితం హౌజింగ్‌ ఈఈ వెంకట్‌దాస్‌ రెడ్డి, డీఈ సుధాకర్‌తో కార్పొరేటర్‌ కాజా సూర్యనారాయణ సమావేశమయి డిజైన్లను పరిశీలించారు. సుమారు 1.25 ఎకరాల స్థలం అందుబాటులో ఉండడంతో నాలుగు బ్లాక్స్‌తో నిర్మాణాలు చేపట్టాలని యోచిస్తున్నారు. అవసరమైతే మరిన్ని బ్లాక్స్‌ నిర్మించి డివిజన్‌ పరిధిలోని మరింతమంది లబ్ధిదారులకు కూడా ఇండ్లను కేటాయించాలని అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.