సోమవారం 01 జూన్ 2020
Hyderabad - May 20, 2020 , 23:34:56

ఇండ్ల కోసం దళారులను నమ్మొద్దు: మేయర్‌ బొంతు రామ్మోహన్‌

ఇండ్ల కోసం దళారులను నమ్మొద్దు: మేయర్‌ బొంతు రామ్మోహన్‌

హైదరాబాద్ : నగరంలోని పేదలకోసం నిర్మిస్తున్న లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల కేటాయింపు, లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా కొనసాగుతున్నదని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ భరోసా ఇచ్చారు. అర్హులైన పేదలకు మాత్రమే ఇండ్లను కేటాయించనున్నట్లు, దళారులను నమ్మరాదని స్పష్టంచేశారు.  జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్‌ విలేకరులతో మాట్లాడుతూ, పేదలు సౌకర్యవంతంగా అన్ని వసతులతో నివసించాలనే ఉద్దేశంతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను పేదల ఆత్మగౌరవ ఇండ్లుగా సీఎం కేసీఆర్‌ పేర్కొన్నట్లు చెప్పారు.

ఈ ఏడాది ఆగస్టు నెలాఖరుకు 50వేల ఇండ్లను పూర్తిచేసి లబ్ధిదారులకు పంపిణీచేయాలని ప్రభుత్వం సంకల్పించినట్లు పేర్కొన్నారు. అక్టోబర్‌ నాటికి 80శాతం ఇండ్లను పూర్తిచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. నగరానికి ఉన్న ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు, నాణ్యతకు పెద్దపీట వేసినట్లు చెప్పారు. అంతేకాకుండా కమ్యూనిటీ వసతులు కూడా పూర్తిస్థాయిలో కల్పిస్తున్నట్లు మేయర్‌ వివరించారు.


logo