బుధవారం 28 అక్టోబర్ 2020
Hyderabad - Sep 21, 2020 , 00:35:21

త్యాగధనులను మరువకుండా...

త్యాగధనులను మరువకుండా...

అడుగడుగునా ఉద్యమ స్మృతులు

కమ్యూనిటీహాళ్లకు మహానీయుల పేర్లు

పిల్లల పార్కుకు శ్రీకాంతాచారిపేరు

డిప్యూటీ మేయర్‌ ప్రత్యేక చొరవతో ఏకగ్రీవంగా ఆమోదించిన స్టాండింగ్‌ కమిటీ

ప్రపంచానికి పోరాటం నేర్పిన చరిత్ర తెలంగాణది. ఏదైనా ఉద్యమం మొదలుపెడితే.. విజయవంతం అయ్యేవరకు విశ్రమించని గడ్డ ఇది. తెల్లవారి దాష్టీకాన్ని.. నిజాం నిరంకుశ పాలనను, ఉమ్మడి ఆంధ్ర కుట్రలను ఎదుర్కొని నిలబడిన సత్తా ఇక్కడి ప్రజలది. అంతటి చర్రిత ఉన్న తెలంగాణలో ఎంతో మంది పోరాట యోధులు, అమరవీరులు వారి ప్రాణాలను పణంగా పెట్టి నేటితరం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడానికి బాటలు వేశారు. అలాంటి మహానుభావులను ఆ జన్మాంతం యాది ఉంచుకోవడం కోసం వారి పేర్లను బోరబండ డివిజన్‌లోని కమ్యూనిటీహాళ్లకు నామకరణం చేయాలని నగర డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ నిశ్చయించుకున్నారు. తన ఆలోచన కార్యాచరణలోకి తీసుకొచ్చి ఆదర్శంగా నిలుస్తూ.. తెలంగాణపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. 

- సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ 

మలిదశ ఉద్యమంతో.. 

ప్రొఫెసర్‌ జయశంకర్‌, కొమురంభీం, సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌, తుర్రెబాజ్‌ఖాన్‌.. వీరిలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ పేరు తప్పా.. మిగతా మహనీయుల ముగ్గురి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాడు తెలంగాణ ఉద్యమ బాట పట్టిన తర్వాతనే పాపన్నగౌడ్‌, తుర్రెబాజ్‌ఖాన్‌, కొమురం భీంల ప్రత్యేకత ఏమిటో తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంతో మహనీయులను స్మరించుకుంటున్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త అయిన జయశంకర్‌ నాటి పాలకుల నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పనిచేశారు. ఇక తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడి అమరులైన కోమురం భీం, సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌, తుర్రెబాజ్‌ఖాన్‌ల పేర్లను ప్రజలు చిరస్థాయిగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉన్నది. ఇదే ఆలోచన డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ మదిలో మెదిలింది. 

స్టాండింగ్‌ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం

బోరబండ డివిజన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ బోరబండ డివిజన్‌లోని కమ్యూనిటీహాళ్లకు మహనీయుల పేర్లు పెడితే బాగుంటుందని భావించారు. అనుకున్నదే తడవుగా జీహెచ్‌ఎంసీ సమావేశంలో తన అభిప్రాయాన్ని ఉంచారు. అన్ని పార్టీల మద్దతు కూడగట్టారు. ఎన్‌ఆర్‌ఆర్‌ పురం సైట్‌-3 కాలనీ కమ్యూనిటీహాల్‌కు ప్రొఫెసర్‌ జయశంకర్‌ పేరు, సైట్‌-1 కాలనీ కమ్యూనిటీహాల్‌కు తుర్రెబాజ్‌ఖాన్‌ పేరు, సైట్‌-2 కాలనీ కమ్యూనిటీహాల్‌కు సర్దార్‌ సర్వాయి పాపన్న పేరు, బంజారానగర్‌ కమ్యూనిటీహాల్‌కు కొమురం భీం పేరు పెట్టాలని బల్దియా సమావేశంలో బాబా ఫసియుద్దీన్‌ ప్రతిపాదించగా స్టాండింగ్‌ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో బల్దియా ఆయా కమ్యూనిటీహాళ్లకు అధికారికంగా ఆయా పేర్లు పెట్టింది. ఇక సైట్‌-4, సైట్‌-5 కాలనీల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో గ్రేటర్‌లో మొట్టమొదటి పిల్లల పార్కును డిప్యూటీమేయర్‌ ఏర్పాటు చేయించారు. దీనికి శ్రీకాంతాచారి పేరును పెట్టారు.


బోరబండ అనగానే చాలా మందికి గుర్తుకొచ్చేది పంకా (ఫ్యాన్‌). సుమారు 38ఏండ్లుగా ఈ ఫ్యాన్‌ బోరబండకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉంటున్నది. స్థానిక బస్టాండ్‌లో ఉన్న ఈ పంకాకు ఎంతో ఘనచరిత్ర ఉన్నది. 38ఏండ్ల క్రితం బోరబండ జనాభా అతి తక్కువ. తాగునీటి కోసం స్థానికులు నానా అవస్థలు పడే వారు. బోరబండ వాసుల దాహార్తిని తీర్చటానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్‌ఈఎల్‌ నాడు ముందుకు వచ్చింది. 

గాలి సహాయంతో తిరిగే పెద్ద పంకాను బోరబండ చౌరస్తాలో ఏర్పాటు చేయించారు. మనుషులు, ఇంధనం, విద్యుత్తుతో అవసరం లేకుండానే 24 గంటలు భూగర్భం నుంచి నీటిని తోడి బోరబండ వాసుల దాహార్తిని తీర్చేది. కాల క్రమేణా బోరబండ రూపురేఖలు మారాయి. గుడిసెలు, చిన్న చిన్న ఇండ్ల స్థానంలో బహుళ అంతస్థులు వెలిశాయి. కాంక్రీట్‌ జంగిల్‌ మధ్య ఉన్న పంకాకు గాలి తాకిడి కరువై తిరగటం మానేసింది. అయినప్పటికీ బోరబండకు దశాబ్దాల పాటు కేరాఫ్‌ అడ్రస్‌గా కొనసాగుతున్న పంకాను నేటికీ స్థానిక బస్టాండ్‌లో చూడవచ్చు. 

ప్రస్తుతం ఈ పంకా సరికొత్త అందాన్ని సంతరించుకున్నది. ఫ్యాన్‌కు ఉన్న రెక్కలపై తెలంగాణ అమర వీరులు, ప్రజాకవుల పేర్లను లిఖించటం జరిగింది. ఈ పంకా ప్రత్యేక ఆకర్షణలు నిలుస్తున్నది.

మహనీయులను స్మరించుకుందాం

మహానీయుల పోరాటం మరవలేనిది. వారి ఉద్యమ స్మృతులు నేటి పౌరులు, భావితరాలు గుర్తుంచుకోవాలి. ఉద్యమ నాయకుడే రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఉండటం ప్రజల ఆదృష్టం. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పాలన అందిస్తూ దేశంలోనే ఆదర్శవంతంగా రాష్ట్రం నిలుపుతున్నారు. రాష్ట్రం వచ్చాకనే ఉద్యమకారులు, పండగలు, మతాలకు గౌరవం దక్కిందనడంలో ఎలాంటి సందేహం లేదు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ మార్గదర్శకంలో హైదరాబాద్‌ గణనీయంగా అభివృద్ధి చెందుతున్నది.

- బాబా ఫసియుద్దీన్‌ , డిప్యూటీ మేయర్‌, 

గ్రేటర్‌ హైదరాబాద్‌  

logo