బుధవారం 02 డిసెంబర్ 2020
Hyderabad - Jul 20, 2020 , 22:57:59

దాణా వద్దు

దాణా వద్దు

నగరంలో పెరిగిపోతున్న పావురాలు

శ్వాసకోశ వ్యాధుల వ్యాప్తికి వాహకాలు

మేత వేయవద్దని జీహెచ్‌ఎంసీ విస్తృత ప్రచారం

నగరంలో పావురాల సమస్య రోజురోజుకూ ఎక్కువవుతున్నది. ఒకప్పుడు వందల్లో ఉన్నవి ఇప్పుడు లక్షలకు చేరాయి. పర్యాటక స్థలాలు, అపార్ట్‌మెంట్లలో తిష్ట వేస్తూ ప్రజల ఆరోగ్యానికి హాని చేకూర్చుతున్నాయి. వీటి వల్ల శ్వాసకోశ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో వీటిని నియంత్రించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు కొంతకాలంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోతున్నది. ఈ సమస్య పరిష్కారానికి ప్రజలు ముందుకు రావాలని, వాటికి మేత వేయడం మానుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇందులో భాగంగా “డు నాట్‌ ఫీడ్‌” అనే నినాదంతో ప్రచారం చేపడుతున్నారు. 

చారిత్రక హైదరాబాద్‌ నగరానికి శాంతి చిహ్నంగా ఉన్న పావురాలు నేడు పెద్ద సమస్యగా మారాయి. తామరతంపరగా పుట్టుకొచ్చిన పావురాల సంతతిని నియంత్రించడంతో పాటు.. పావురాలకు దాణా వేస్తూ పెంచి పోషిస్తున్న వారిని కట్టడి చేయాలని జీహెచ్‌ఎంసీ  నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే దాణా వేయరాదు (డు నాట్‌ ఫీడ్‌) అంటూ గ్రేటర్‌ కార్పొరేషన్‌ అధికారులు కొంతకాలంగా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాక పదే పదే దాణా వేసినట్లు తేలితే న్యూసెన్స్‌ కేసులు పెడుతామని హెచ్చరిస్తున్నారు.

50 ప్రాంతాలు.. వేల సంఖ్యల్లో పావురాలు.. 

నగరంలోని మోజంజాహీ మార్కెట్‌, ట్యాంక్‌బండ్‌, పబ్లిక్‌ గార్డెన్‌, ఇందిరా పార్కు, నాంపల్లి, మెహిదీపట్నం, మార్కెట్‌ స్థలాలు, రేతిఫైల్‌ .. ఇలా సుమారు 50 ప్రాంతాల్లో వేల సంఖ్యలో పావురాలు తిష్ట వేయగా, నిత్యం ఉదయం పూట వాకర్స్‌, పర్యాటకులు వీటికి మేత వేస్తున్నారు. ఇంతే        కాకుండా నాంపల్లి, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, ఎల్బీనగర్‌, మాసబ్‌ట్యాంక్‌, మెహిదీపట్నం, లంగర్‌హౌస్‌, చార్మినార్‌ తదితర ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్‌లు, ఇండ్లల్లోని బాల్కనీలు, కిటికీల్లో గూళ్లు ఏర్పాటు చేసుకొని రెట్టలు వేస్తూ ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఎక్కడకీ కదలాల్సిన అవసరం లేకుండా దరిదాపుల్లో అవసరమైనంత ఆహారం లభిస్తుండటంతో  పావురాలు చీకూచింతా లేకుండా తమ సంతతిని వృద్ధి చేసుకుంటున్నాయి.  

పావురాల బాధ భరించలేక పలు ప్రాంతాల్లో ప్రజలు వేలాది రూపాయలు వెచ్చించి అపార్ట్‌మెంట్లకు జాలీ (పీజియన్‌ నెట్‌)లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులకు శ్వాసకోశ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశముందని వైద్య నిపుణులు పేర్కొంటుండంతో స్థానికులు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈ జాలీలు ఎక్కువ ధర పలుకుతుండటంతో కొందరు కిటికీలు, బాల్కానీల్లో ఇనుప కంచెలు నిర్మించుకుంటున్నారు. 

ఫీడింగ్‌ ఆపితేనే నియంత్రణ..

ముఖ్యంగా నగరంలోని జంతు, పక్షి ప్రేమికులు పావురాలకు దాణా వేస్తున్నారు. దీంతో నగర వ్యాప్తంగా వీటి సంతతి పెరిగిపోతున్నది. పావురాల వ్యాప్తి పెరిగితే శ్వాసకోశ వ్యాధులు పెరగడం ఖాయమని జీహెచ్‌ఎంసీ వెటర్నరీ విభాగం వైద్యుడు డా. విల్సన్‌ తెలిపారు. ప్రజలు ఫీడింగ్‌ ఆపనంతకాలం పావురాల నియంత్రణ సాధ్యం కాదని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఆబిడ్స్‌ జోన్‌లో పలువురు చిరుధాన్యాల వ్యాపారులకు జరిమానాలు విధించడమే కాకుండా రెండు మూడు క్వింటాళ్ల ధాన్యాలను సీజ్‌ చేసినట్టు తెలిపారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు. 

తరలించినా తిరిగొచ్చాయి..

హెరిటేజ్‌ కట్టడాలకు పూర్వవైభవం తెచ్చే కార్యక్రమంలో భాగంగా  జీహెచ్‌ఎంసీ రూ.10 కోట్లతో మోజంజాహీ మార్కెట్‌ను పునరుద్ధరిస్తున్నది. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తి కాగా.. ముఖ్యంగా మార్కెట్‌ పైభాగంలోని గుమ్మటం, గడియారం పునరుద్ధరణ పనులను పూర్తి చేసింది. ఓ వైపు అధికారులు మార్కెట్‌ను మెరుగుపర్చేందుకు నిర్విరామంగా శ్రమిస్తుంటే.. మరోవైపు పావురాలు రెట్టలు వేస్తూ అందవిహీనంగా తయారు చేస్తున్నాయి. గత సంవత్సరం చివర్లో అధికారులు సుమారు 500 పావురాలను నగర శివారులోని నిర్జన ప్రాంతాలకు తరలించినా అవి కొద్ది రోజులకే తిరిగి ప్రత్యక్షమయ్యాయి. దీంతో చేసేది లేక అధికారులు మార్కెట్‌ పై భాగంలో పావురాలు వాలకుండా ముళ్ల కంచె ఏర్పాటు చేశారు.