మంగళవారం 04 ఆగస్టు 2020
Hyderabad - Jul 04, 2020 , 00:18:16

కరోనాతో భయపడకండి

కరోనాతో భయపడకండి

నగరంలో తగ్గని కరోనా కేసులు.. 

స్వీయ నిర్బంధంతో చైన్‌ తెంపేద్దాం

భయం అవసరంలేదంటున్న నిపుణులు

లాక్‌డౌన్‌ భయంతో.. పల్లెబాట పట్టిన వలసజీవులు

నగరంలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడంలేదు. దినదినం కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. దీంతో వైరస్‌ ఎప్పుడు.. ఎలా సోకుతుందోననే భయంతో ప్రజలు వణికిపోతున్నారు. అయితే కరోనా సోకగానే భయపడాల్సిన అవసరం లేదు. వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తే మహమ్మారిని జయించవచ్చు.. అనేక మంది భయంతోనే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.. అని వైద్యనిపుణులు తెలుపుతున్నారు. 

ప్రతిఒక్కరూ నిబంధనలు పాటిస్తూ ఒకరినుంచి ఒకరికి పాకుతున్న కరోనా వైరస్‌ చైన్‌ను తెంచేయాలి.. ఇది మనచేతుల్లోనే ఉన్నది.. వైరస్‌ లక్షణాలున్న వారు స్వీయ నిర్బంధంలోకి వెళ్లడమే క్షేమం.. అని బుల్లితెర నటి నవ్యస్వామి పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా ఎవరికివారుగా వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ ప్రకటించుకుంటుండగా ప్రభుత్వం సైతం ఈ దిశగానే చర్యలు తీసుకుంటున్నదేమోనన్న ఆందోళనతో వలసజీవులు పుట్టినగడ్డకు పయనమవుతున్నారు. 

పాజిటివ్‌ కేసులు

జీహెచ్‌ఎంసీలో.. 1658

రంగారెడ్డిలో.. 56

మేడ్చల్‌లో.. 44

కరోనా పరీక్షలకు వచ్చి.. దవాఖాన ఆవరణలోనే మృతి

హిమాయత్‌నగర్‌ : కరోనా లక్షణాలతో పరీక్షల కోసం వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి దవాఖాన ఆవరణలోనే మృతి చెందిన సంఘటన నారాయణగూడ పీఎస్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకున్నది. అడ్మిన్‌ ఎస్సై డి.కర్ణాకర్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని ఓ వ్యక్తి (40) కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షల నిమిత్తం కింగ్‌కోఠిలోని ప్రభుత్వ దవాఖానకు వచ్చాడు. కొవిడ్‌ పరీక్షల కేంద్రానికి వెళ్లే క్రమంలో దవాఖాన ఆవరణలోనే సొమ్మసిల్లి పడిపోయాడు. గుర్తించిన వైద్యసిబ్బంది పరీక్షలు చేయగా అప్పటికే మృతిచెందాడు. దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజేంద్రనాథ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అచూకీ కోసం వెతికినా అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడు నల్లా రంగు చొక్కా, క్రిమ్‌ కలర్‌ ప్యాంట్‌ ధరించి ఉన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అంబర్‌పేటలో.. 49మందికి..

అంబర్‌పేట : అంబర్‌పేట నియోజకవర్గంలో శుక్రవారం 49కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాచిగూడ డివిజన్‌లో 16, నల్లకుంటలో 12, అంబర్‌పేటలో 21కేసులు నమోదయ్యాయి. అయితే కాచిగూడలో 69 ఏండ్ల ఓ వృద్ధుడు కరోనాతో మృతిచెందాడు.

ఖైరతాబాద్‌లో.. 48 మందికి..

ఖైరతాబాద్‌: ఖైరతాబాద్‌ సర్కిల్‌ పరిధిలోని ఖైరతాబాద్‌, సోమాజిగూడ, అమీర్‌పేట, సనత్‌నగర్‌ డివిజన్లలో శుక్రవారం ఒక్క రోజే 48 కేసులు నమోదైనట్లు జీహెచ్‌ఎంసీ అధికారి రవీందర్‌ తెలిపారు.

యూసుఫ్‌గూడలో.. 36 మందికి..

వెంగళరావునగర్‌: జీహెచ్‌ఎంసీ యూసుఫ్‌గూడ సర్కిల్‌-19 పరిధిలో 36 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ఉప కమిషనర్‌ రమేశ్‌ తెలిపారు. యూసుఫ్‌గూడ డివిజన్‌ పరిధిలో 15, బోరబండలో 9, ఎర్రగడ్డలో 7, రహ్మత్‌నగర్‌లో 1, వెంగళరావునగర్‌లో 4 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వివరించారు. 

కోలుకుని విధుల్లో చేరిన డీఐ సుధీర్‌కృష్ణ

పహాడీషరీఫ్‌ : కరోనాకు భయపడాల్సిన అవసరంలేదని సీఐ భాస్కర్‌, డీఐ సుధీర్‌కృష్ణ అన్నారు. శుక్రవారం బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో సిబ్బందికి కరోనా వైరస్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నెలరోజుల కిందట డీఐ సుధీర్‌కృష్ణకు కరోనా సోకింది. గాంధీలో 14 రోజులు చికిత్స పొందిన అనంతరం మరో 14రోజులు హోం క్వారంటైన్‌లో ఉన్నాడు. పూర్తిగా కోలుకోవడంతో తిరిగి విధుల్లో చేరాడు. కరోనాపై విజయం సాధించి విధుల్లో చేరిన ఆయనను సీఐ భాస్కర్‌ ఆధ్వర్యంలో పోలీసులు శాలువా, పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా సోకిందని భయాందోళనకు గురికావద్దన్నారు. వైద్యుల సూచనలు పాటిస్తే మహమ్మారి నుంచి భయటపడవచ్చని తెలిపారు. విధుల్లో ఉన్నా.. లేకపోయినా.. భౌతికదూరం పాటిస్తూ తప్పనిసరిగా మాస్కు ధరించాలన్నారు. చేతులను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు సరైన పోషకాహారం తీసుకోవాలని సూచించారు. క్రమం తప్పకుండా ఉదయం, సాయంత్రం యోగా, ధ్యానం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సైలు నాగరాజు, వినయ్‌, వెంకట్‌ రెడ్డి, సిబ్బంది దేవేందర్‌, పర్వతాలు, చందు తదితరులు పాల్గొన్నారు.

రామంతాపూర్‌ : ఉప్పల్‌ ఆరోగ్యకేంద్రం పరిధిలోని రామంతాపూర్‌, ఉప్పల్‌, హబ్సిగూడ, చిలుకానగర్‌ తదితర ప్రాంతాల్లో 16 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఎల్బీనగర్‌ : హయత్‌నగర్‌ సర్కిల్‌ జైపురికాలనీలోని యువకుడికి, మైత్రీవిలాస్‌లో వ్యక్తికి, ఆనంద్‌నగర్‌కాలనీలో గృహిణికి, ఆర్టీసీ కాలనీలో విద్యార్థికి, లెక్చరర్స్‌కాలనీలో వ్యక్తికి, మన్సూరాబాద్‌ సరస్వతీనగర్‌లో బ్యాంక్‌ ఉద్యోగికి, తంగ్రీలా హోమ్స్‌లో చిన్నారికి, మహిళకు, వ్యక్తికి, వనస్థలిపురం గ్రీన్‌ మెడోస్‌ అపార్ట్‌మెంట్‌లో ఒకరికి, నాగోలు అరుణోదయనగర్‌లో గృహిణికి, వనస్థలిపురంలో వ్యక్తికి, కమలానగర్‌ కాలనీలో విద్యార్థికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.

కాప్రా : కాప్రా సర్కిల్‌లో శుక్రవారం 10 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

బాలానగర్‌ : మూసాపేట సర్కిల్‌ కేపీహెచ్‌బీకాలనీలోని వివిధ ప్రాంతాల్లో 4 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఫతేనగర్‌ ఎల్బీఎస్‌నగర్‌లో 3, ఆల్విన్‌కాలనీ 2వ ఫేజ్‌లో 1 కేసు నమోదైంది. 

హిమాయత్‌నగర్‌: హిమాయత్‌నగర్‌లో ముగ్గురు, నారాయణగూడలో నలుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని అంబర్‌పేట సర్కిల్‌-16 వైద్యాధికారి హేమలత తెలిపారు.

అహ్మద్‌నగర్‌ : అహ్మద్‌నగర్‌లో 3 , ఎంజీనగర్‌లో 3 , సయ్యద్‌నగర్‌లో 1 , ప్రేమ్‌నగర్‌లో 2, ఆనంద్‌నగర్‌లో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  

బషీర్‌బాగ్‌ : బాపూజీనగర్‌లో వృద్ధురాలికి (62), ముషీరాబాద్‌లో మహిళకు(42), జమిస్తాన్‌పూర్‌ హరినగర్‌లో మహిళకు(33), అడిక్‌మెట్‌ డివిజన్‌ ఆనంద్‌ నర్సింగ్‌ హోం ప్రాంతంలో మహిళకు(34), వ్యక్తికి(42), లలితానగర్‌లో వ్యక్తికి(56) పాజిటివ్‌ వచ్చింది.

అల్వాల్‌ : అల్వాల్‌లో మరో నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా అల్వాల్‌ సర్కిల్‌ పరిధిలోని సూర్యనగర్‌లో  వ్యక్తికి (51), వృద్ధుడికి(83), మహిళకు, అయ్యప్పనగర్‌లో యువకుడికి(25) పాజిటివ్‌ వచ్చినట్లు అల్వాల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్‌ ప్రసన్న తెలిపారు. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 80కి చేరింది. హోం క్వారంటైన్‌లో 171మంది ఉండగా.. ప్రైమరీ కాంటాక్ట్‌లో 180 మంది ఉన్నారని ఆమె తెలిపారు.

అడ్డగుట్ట : అడ్డగుట్టలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు.  

కార్వాన్‌ : పురానాపూల్‌లోని కార్వాన్‌ శాఖ పోస్టల్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో అతడితో కలిసి విధులు నిర్వహించిన తోటి ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు.

మేడిపల్లి: మేడిపల్లి శ్రీనివాస్‌నగర్‌లో నివాసముంటూ హైదరాబాద్‌ స్పెషల్‌ బ్రాంచ్‌లో పోలీస్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.

కరోనాను ధైర్యంగా ఎదుర్కొందాం

బుల్లి తెర నటి నవ్యస్వామి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కరోనా పాజిటివ్‌ వచ్చినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు.. ‘ధైర్యంగా ఉండండి.. ఈజీగా తీసుకోండి’.. అని బుల్లితెర నటి నవ్యస్వామి భరోసా కల్పించారు. ఇటీవల ఆమె టెస్టులు చేయించుకోగా పాజిటివ్‌ అని తేలడంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయింది. దీంతో ఆమెతో పాటు కలిసి పనిచేసిన వారందరికీ అధికారులు ముందు జాగ్రత్తగా పరీక్షలు జరిపి క్వారంటైన్‌కు పంపారు. ఈ సందర్భంగా నవ్యస్వామి ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసింది. కరోనా అనే చైన్‌ను తెంపేద్దాం.. అది మన చేతుల్లోనే ఉన్నది.. అని ప్రజలకు పిలుపునిచ్చారు. సరైన మందులు, స్వీయ నిర్బంధం ద్వారా మనం మహమ్మారి నుంచి బయట పడొచ్చని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. నాలో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రస్తుతం సరియైన మందులు, డైట్‌, అన్ని రకాల ఆరోగ్యకరమైన పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటున్నాను. మన రక్షణార్థం, ఎదుటి వారి రక్షణ కోసం తనతో సన్నిహితంగా ఉన్న వారందరూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లడంతో పాటు పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఇటీవల కరోనా గురించి ఏవేవో వార్తలు వినిపిస్తున్నాయని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. నాకేమీ కాదు. నేను బాగానే ఉంటాను. మళ్లీ త్వరలో మీ ముందుకు వస్తానని తెలిపారు.
logo