ఆదివారం 29 మార్చి 2020
Hyderabad - Mar 16, 2020 , 08:13:24

సోషల్‌మీడియాలో ఫొటోలు పెడుతున్నారా..?

సోషల్‌మీడియాలో ఫొటోలు పెడుతున్నారా..?

హైదరాబాద్ : ఇంటర్‌ర్నెట్‌లో ఫొటోలు పెడితే అవి ఎంత వరకు సేఫ్‌ అనే విషయంలో ప్రతిఒక్కరూ అవగాహనతో ఉండాల్సిన అవసరముంది. సోషల్‌మీడియా అప్లికేషన్లలో ఫొటోలు పెట్టి.. వాటిని సర్క్యూలేట్‌ చేయడం వల్ల ఎప్పుడో ఓ సారి అవి చిక్కులు తెచ్చే అవకాశముంటుంది. కొందరు కక్షతో ఆ ఫొటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్‌మీడియాలో కించపరిచే విధంగా చేయవచ్చు.. మరికొందరు ఆ ఫొటోలను మార్ఫింగ్‌ చేసి..కొన్ని అసభ్యకరమైన యాప్‌లు, వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేయవచ్చు. ఇప్పుడు సోషల్‌మీడియాకు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ ఇతర యాప్‌లలో ఫొటోలు పెట్టి పది మందికి అందంగా కనిపించాలని తాపత్రయ పడేవాళ్లు చాలా మంది ఉన్నారు. 

అలాంటి వారిలో చాలా మందికి సోషల్‌మీడియాలో ఆయా ఫొటోలు, వీడియోలను పోస్టింగ్‌ చేసే సమయం లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై అం తగా తెలిసి ఉండదు. ఇదే మోసం చేయాలనుకునే వారికి కలిసి వస్తున్నాయి. సైబర్‌నేరగాళ్లకు ఈ ఫొటోలు ఇప్పు డు ఒక వరంగా మారాయి. సీఏ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న వెన్నెల వెంకటేశ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ను ఆధారంగా చేసుకొని, అమ్మాయిల ఫొటోలను పెట్టి ఎందరో అమాయకులను మోసం చేశాడు. అమాయకులకు ఆర్థిక పరమైన నష్టం ఒక ఎత్తయితే.. అభం శుభం తెలియని అమ్మాయిల ఫొటోలు డేటింగ్‌ సైట్లలో హల్‌చల్‌ చేయడంతో కుదిరిన పెండ్లి కూడా చెడిపోయింది. ఇలా ఎందరివో ఫొటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో మనకు తెలియకుండా సర్క్యూలేట్‌ అవుతుంటాయి. 

ధ్యాసంతా మెసేజ్‌లు.. డీపీలపైనే..!

పాఠశాలలు, కాలేజీల నుంచి తిరిగి ఇంటికి వచ్చిన తరువాత.. ఉదయం నిద్ర లేవగానే.. పడుకునే ముందు మా ఫ్రెండ్స్‌ ఏం మెసేజ్‌ పంపించారు.. నేను పెట్టిన ఫొటోకు ఎలాంటి కామెంట్స్‌ వచ్చాయి.. నా పోస్టింగ్‌ను ఎంత మంది చూశారనే ధ్యాసతో చాలా మంది యువత, టీనేజర్లు నేడు సెల్‌ఫోన్‌నే సర్వంగా గడిపేస్తున్నారు. టెక్నాలజీ నేడు మనిషిని శాసించే స్థాయికి వచ్చేసింది.. ఫోన్‌ అవసరమే కానీ.. అది ఎంత వరకు ఉపయోగించాలో అంతకే పరిమితమైతే బాగుంటుంది. పాఠశాల నుంచి రాగానే హోంవర్క్‌ చేసుకొని కొద్దిసేపు ఆటలు ఆడే పరిస్థితి నేడు లేదు. ఇంట్లో ఉన్న అమ్మనాన్న.. తాత నానమ్మలు.. అక్కాచెల్లి.. అన్న తమ్ముడితో మాట్లాడుకునే సమయం ఇవ్వడం లేదు. ఇంటికి వచ్చామా.. సెల్‌ఫోన్‌ పట్టుకొని కూర్చున్నామా అనే ధోరణిలో చాలా మంది ఉన్నారు. పిల్లల చేష్టలతో తల్లిదండ్రులు ఎవరికీ చెప్పుకోలేని నిస్సాయ స్థితిలో ఉన్నారు. విద్యా సంస్థల్లో కూడా పిల్లలకు పాఠాలతోపాటు సంస్కారం నేర్పడం మానేశారు. టెక్నాలజీతో ఉపయోగాలు.. దాని అనర్థాలు విడమరిచి చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. సోషల్‌మీడియా దాని ఉపయోగాలు.. దుష్ప్రభావాలపై విద్యార్థుల్లో ఆయా విద్యాసంస్థలు అవగాహన తెచ్చేందుకు నిరంతరం ప్రయత్నించడం మంచింది. 

అనర్థాలను కూడా గుర్తించండి..!

ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేసిన ఫొటోలు అందరికీ కన్పించకుండా, డౌన్‌లోడ్‌ కాకుండా ఉండేందుకు సెట్టింగ్‌లలో ఆప్షన్స్‌ ఉంటాయి. అలాగే ప్రైవేట్‌ వ్యక్తులకు ఫొటోలు కన్పించకుండా ఉండే విధంగా వివిధ రకాలైన సెక్యూరిటీ ఆప్షన్లను ఆయా అప్లికేషన్ల నిర్వాహకులు అందుబాటులోకి తెచ్చారు. ముందుగా సెక్యూరిటీ ఆప్షన్స్‌ ఏమున్నాయనే విషయంలో అవగాహన పెంచుకోవాల్సిన అవసరముంది. తమ ఫొటోలు అందరూ చూడాలనే కోరిక ఉంటుంది. వందలు, వేల మందిలో ఒక్కరైనా ఆ ఫొటోలను తప్పుడుగా వినియోగిస్తే, అది ఆ ఫొటోలో ఉన్నవారికి అవమానకరంగా కాకుండా, ఆ ప్రభావం కుటుంబంపై కూడా పడే అవకాశాలుంటాయి. ఫొటోలు ఇంటర్‌నెట్‌లో పెట్టుకునే సమయంలో మంచి, చెడులను కూడా ప్రతిఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

సోషల్‌మీడియాతో మంచి, చెడులు రెండూ ఉన్నాయి. దాని వల్ల కలిగే ప్రయోజనాలకు మాత్రమే యువత ఆకర్షితులు కావాలి. కానీ కొన్ని సందర్భాల్లో సంతోషం, సరదాల కోసం సోషల్‌మీడియాలో పెట్టే ఫొటోలు, పోస్టింగ్‌లు ఇబ్బందులకు గురిచేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఎంత వరకు సోషల్‌మీడియాను వాడుకోవాలో అంతవరకే వాడుకోవడం మంచిది. వాడకం ఎక్కువైతే అనర్థాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. దీనిపై యువత అప్రమత్తంగా ఉండాలి.  - మోహన్‌రావు, సీసీఎస్‌ సైబర్‌క్రైమ్స్‌ ఇన్‌స్పెక్టర్‌

* నగరానికి చెందిన ఒక యువతి ఫొటో ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి వెన్నెల వెంకటేశ్‌ డౌన్‌లోడ్‌ చేశాడు. ఆ ఫొటోను డేటింగ్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయడంతో ఆ ఫొటోను చూసిన చాలా మంది యువకులు అ ఫొటోలో ఉన్నది అమ్మాయి అనే ఆశతో చాటింగ్‌ చేశారు. నిందితుడు తెలివిగా వందల రూపాయలు మాత్రమే కొట్టేయడంతో.. బాధితులు సైతం ఎవరికీ చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోయారు. ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడి గుట్టు బయటపడింది.

* ఇంజినీరింగ్‌ చదువుతున్న ఓ యువతికి తాను అందంగా దిగిన ఫొటోలు ఫేస్‌బుక్‌లో పెట్టడం అలవాటు. ఆమె ఫొటోలను డౌన్‌లోడ్‌ చేసిన ఓ వ్యక్తి.. ఆ ఫొటోలను మార్ఫింగ్‌ చేసి, అమ్మాయిని బ్లాక్‌ మెయిల్‌ చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో నిందితుడు అడిగిన డబ్బును ఇచ్చిన యువతి, బ్లాక్‌మెయిలింగ్‌ ఇంకా పెరగడంతో పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు దర్యాప్తు చేయడంతో నిందితుడు బాధితురాలికి గతంలో పరిచయం ఉన్న వ్యక్తిగా తేలింది. 

* పీజీ కోర్సు చేసే సమయంలో అమ్మాయి, అబ్బాయి ఇద్దరు స్నేహంగా ఉన్నారు. అయితే చదువు అయిపోయిన తరువాత ఇద్దరు ఉద్యోగాల్లో స్థిరపడి ఎవరికి వారు విడిపోయి వారి వారి పెండ్లిళ్లు చేసుకున్నారు. చదువుకున్న సమయంలో తన ప్రేమను యువతి అంగీకరించలేదనే కసి యువకుడిలో ఉండిపోయింది. దీంతో పెండ్లయిన ఐదేండ్ల తరువాత తన పాత స్నేహితురాలి ఫొటో ఇంటర్‌నెట్‌లో నుంచి డౌన్‌లోడ్‌ చేసి ఆ ఫొటోను పోర్న్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశాడు. అయితే ఆమె భర్తకు తెలిసిన వాళ్లు దీనిని గుర్తించి, విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్‌ చేశారు. అయితే ఆమె అవమానంతో ఉద్యోగం మాని భర్తతో కలిసి తమ స్వస్థలమైన రాజస్థాన్‌కు వెళ్లిపోయింది. logo