శుక్రవారం 27 నవంబర్ 2020
Hyderabad - Oct 28, 2020 , 07:26:33

రక్తదానం చేసి.. ప్రాణాలు కాపాడండి

రక్తదానం చేసి.. ప్రాణాలు కాపాడండి

  • సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పిలుపు
  • మహా రక్తదాన శిబిరంలో 569 యూనిట్ల రక్తం సేకరణ
  • 140 సార్లు రక్తదానం.. 12 సార్లు ప్లాస్మాదానం చేసిన వైద్యులకు సత్కారం
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : పోలీస్‌ అమరవీరుల దినోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆవరణలో మహా రక్తదాన శిబిరం నిర్వహించారు. పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ కూడా రక్త దానం చేశారు. మంగళవారం ఒక్క రోజు 569 యూనిట్‌ల రక్తాన్ని సేకరించారు. సీపీ మాట్లాడుతూ.. రక్తదానం చేయడంలో అపోహలు, అనుమానాలు వద్దని... అందరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. అందరూ సహకరిస్తే రక్తనిల్వలు పెరిగి అత్యవసరంగా అవసరమైన వారికి ఈ రక్తం ఉపయోగపడి.. వారు ఆరోగ్యంగా బయటపడే అవకాశం ఉందన్నారు. అనంతరం 140 సార్లు రక్తదానం చేసిన రెడ్‌ క్రాస్‌ సొసైటీ చైర్మన్‌(మహబూబ్‌నగర్‌) డాక్టర్‌ నటరాజన్‌, 12 సార్లు ప్లాస్మా దానం చేసిన డాక్టర్‌ సంపత్‌కుమార్‌ను ఈ సందర్భంగా సీపీ సత్కరించారు. అనంతరం సైబరాబాద్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి ఆన్‌లైన్‌లో ఓపెన్‌ హౌజ్‌ నిర్వహించారు. పోలీసులు ఉపయోగిస్తున్న ఆయుధాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఎస్‌సీఎస్‌సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏదులతో పాటు వైద్యులు, వివిధ విభాగాలకు చెందిన సైబరాబాద్‌ పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.