శనివారం 05 డిసెంబర్ 2020
Hyderabad - Oct 30, 2020 , 07:29:41

స్వదేశీ రాకపోకలు పుంజుకున్నాయ్‌...

స్వదేశీ రాకపోకలు పుంజుకున్నాయ్‌...

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వదేశీ విమాన సర్వీసులు రోజురోజుకూ పుంజుకుంటున్నాయి. ఎయిర్‌పోర్టులో అనుసరిస్తున్న కొవిడ్‌ నిబంధనలు, తీసుకుంటున్న రక్షణ చర్యలతో రాకపోకలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. ప్రయాణికులు సైతం పెరుగుతుండడంతో ఎయిర్‌పోర్టులో సందడి వాతావరణం నెలకొంటున్నది. 

(శంషాబాద్‌) కొవిడ్‌-19 అన్‌లాక్‌ 4.0, 5.0 కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సడలింపుల కారణంగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వృద్ధి వేగం ఎక్కువైంది. పునఃప్రారంభ సమయంలో రోజుకు 3000 మంది దేశీయ ప్రయాణికుల నుంచి ప్రస్తుతం రోజుకు సుమారు 20,000కు చేరింది. అదే విధంగా వందేభారత్‌, ఎయిర్‌ ట్రాన్స్‌పోర్టు బబుల్‌ ద్వారా వివిధ దేశాల నుంచి ఇప్పటి వరకు 1.1లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. 40 దేశీయ విమానాల నుంచి సెప్టెంబర్‌ నాటికి రోజుకు 230 విమానాల రాకపోకలకు పెరిగింది. సెప్టెంబర్‌ 30 వరకు 13,500 విమానసర్వీసులు రాకపోకలు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఎయిర్‌పోర్టు నుంచి ఎయిర్‌ ఇండియా, ఇండిగో, స్పైస్‌ జెట్‌ విమాన సర్వీసులు దేశీయ సేవలందిస్తున్నాయి. ప్రయాణికులకు శాస్త్రీయంగా, ఆధునాతన సురక్షిత సేవలందిస్తున్న నేపథ్యంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ఎయిర్‌పోర్టు కౌన్సిల్‌ ఇంటర్నేషనల్‌ (ఏసీఐ) వారి ఎయిర్‌పోర్టు హెల్త్‌ అక్రిడేషన్‌ను పొందినట్లు అధికారులు వెల్లడించారు.