సోమవారం 30 నవంబర్ 2020
Hyderabad - Oct 27, 2020 , 07:51:04

తిరిగి ప్రారంభం కానున్న వరదసాయం పంపిణీ

తిరిగి ప్రారంభం కానున్న వరదసాయం పంపిణీ

బంజారాహిల్స్‌ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న  పేదలకు ప్రభుత్వం ద్వారా అందిస్తున్న వరదసాయం పంపిణీ కార్యక్రమం మంగళవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నది. దసరా సెలవుల కారణంగా పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయలేకపోవడంతో గడువు పెంచాలని జీహెచ్‌ఎంసీ అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు కోరారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ పరిధిలోని అన్ని డివిజన్లతోపాటు వెంకటేశ్వరకాలనీ, ఖైరతాబాద్‌, సోమాజిగూడ, హిమాయత్‌నగర్‌ డివిజన్ల పరిధిలో సుమారు 30వేల ఇండ్లకు వరదసాయం అందించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే సగం ఇండ్లకు పంపిణీ పూర్తిచేసినట్లు తెలుస్తోంది. మిగిలిన ఇండ్లకు కూడా సాయం అందించేందుకు అధికారులు పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. ముంపుకు గురైన ఇండ్లవద్దకు వెళ్లి నేరుగా సాయం అందించాలని ఉన్నతాధికారులు సూచించారు. లబ్ధిదారులకు చెందిన ఆధార్‌ నంబర్‌తోపాటు ఫోన్‌ నంబర్లను యాప్‌ద్వారా అనుసంధానం చేసి ఫొటో తీసుకుంటున్నారు. దీనివల్ల లబ్ధిదారులకు చేరాల్సిన సాయం పక్కాగా అందుతుందని అధికారులు భావిస్తున్నారు. సాయం అందుకున్న వారి వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయనున్నారు. ఎలాంటి అవకతవకలు లేకుండా వరదసాయం పంపిణీ చేసేలా  చూడడానికి ప్రత్యేక విజిలెన్స్‌ బృందాలను సైతం రంగంలోకి దించారు.  నియోజకవర్గం పరిధిలో మరో మూడురోజుల్లో పంపిణీ పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అర్హులందరికీ ఆర్థిక సాయం -కార్పొరేటర్‌  సూర్యనారాయణ

భారీ వర్షాలతో ఇబ్బందులు పడిన వారందరికీ వరదసాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని జూబ్లీహిల్స్‌ కార్పొరేటర్‌ కాజా సూర్యనారాయణ అన్నారు. జూబ్లీహిల్స్‌లోని గురుబ్రహ్మనగర్‌ బస్తీలో వరదసాయం అందలేదంటూ పలువురు స్థానికులు సోమవారం కార్పొరేటర్‌ కాజా సూర్యనారాయణకు ఫిర్యాదు చేశారు. చాలా బస్తీల్లో పంపిణీ కార్యక్రమం పూర్తయిందని, మిగిలిన ప్రాంతాల్లోనూ మంగళవారం పంపిణీ ఉంటుందని వెల్లడించారు. ఎవరూ ఆందోళన చెందవద్దని అందరికీ సాయం అందించాలని ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఆదేశించారన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు మొగులేశ్‌, రాంచందర్‌ తదితరులు పాల్గొన్నారు.