మంగళవారం 14 జూలై 2020
Hyderabad - Jun 30, 2020 , 01:20:40

సృజనాత్మకంగా డిజిటల్‌ తరగతులు

సృజనాత్మకంగా  డిజిటల్‌ తరగతులు

అంగన్‌వాడీలో ఆన్‌లైన్‌ విద్య

ఇంటివద్దే టీ సాట్‌ పాఠాలు 

అహ్మద్‌నగర్‌ :  కరోనా నేపథ్యంలో అంగన్‌వాడీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ విద్యాబోధన అందుబాటులోకి తెచ్చారు. టీ సాట్‌ ఆధ్వర్యంలో  పనిదినాల్లో ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఇంటివద్దే అంగన్‌వాడీ చిన్నారులతో పాటు తల్లిదండ్రులకు ఈ విద్యాబోధన అందిస్తున్నారు. చిన్నారులకు ఆట పాటలు , పొడుపు కథలు, సృజనాత్మక కార్యక్రమాలు, శాస్త్రీయ పరిజ్ఞానంతో కూడిన అంశాలను ప్రసారం చేస్తున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రసారమవుతున్న ఈ కార్యక్రమాలలో పాటలు , నృత్యాలతో పాటు యోగా  కార్యక్రమాలు  ప్రసారం చేస్తున్నారు. ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులతో ఆడుకోవడం, వృథాగా పడేసే పేపర్లతో బొమ్మలు చేయడం, వ్యర్థాలకు సృజనాత్మకతతో అలంకృతులు తయారుచేయడం వంటి అంశాలను నిపుణులతో బోధిస్తున్నారు.  మెరుగైన అంశాలను జోడించి ఈ డిజిటల్‌ విద్యాబోధన సాగిస్తున్నారు.   కార్యక్రమాలను టీవీ ప్రసారాలు , స్మార్ట్‌ఫోన్‌ యూ ట్యూబ్‌ లైవ్‌లోనే కాక తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి మళ్లీ చూడడానికి వారికి లింక్‌లను సైతం పంపుతున్నారు. ఈ పూర్వ ప్రాథమిక విద్య తరగతులతో విద్యార్థులకు బొమ్మలు, నృత్యాల ప్రదర్శనతో వివిధ అంశాలలో బోధన చేయడంతో పాటు వారిలో మేథోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ , ఆ శాఖ కార్యదర్శి , కమిషనర్‌ దివ్య దేవరాజన్‌ చొరవతో అంగన్‌వాడీ విద్యార్థులకు రూపొందించి బోధిస్తున్న టీ సాట్‌ ఆన్‌లైన్‌ విద్యాబోధన అంగన్‌వాడీ కేంద్రాలలో నూతన అధ్యాయానికి తెరతీయనున్నది. 

   కార్యక్రమాలు ఉపయుక్తంగా  ఉన్నాయి

టీ సాట్‌ ద్వారా చిన్నారులకు అందిస్తున్న ఆన్‌లైన్‌ విద్యాబోధన విద్యార్థులు, తల్లిదండ్రులకు  ఉపయుక్తంగా ఉంటున్నాయి. కరోనాతో ఇండ్లకే పరిమితమవుతున్న 3 నుంచి 6 ఏండ్లలోపు పిల్లలు, తల్లిదండ్రులతో పాటు ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులందరూ ఈ కార్యక్రమాలను చూడవచ్చు.  రేషన్‌ సరుకులు పంపిణీ చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకుని పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు 

టీ సాట్‌ విద్య బోధన తరగతులు చూపిస్తున్నారు. 

-  రేణుక ,  సీడీపీవో , గోల్కొండ         


logo