ఆదివారం 29 నవంబర్ 2020
Hyderabad - Oct 28, 2020 , 06:30:38

దత్తత గ్రామమే ధరణి వేదిక

దత్తత గ్రామమే ధరణి వేదిక

  • మూడుచింతలపల్లిలో పోర్టల్‌ను 
  • ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌
  • ఏర్పాట్లను పర్యవేక్షించిన సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

మేడ్చల్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తత గ్రామమైన మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లి మరో చారిత్రక ఘట్టానికి వేదిక కాబోతున్నది. ధరణి పోర్టల్‌ను సీఎం కేసీఆర్‌ ఈ నెల 29న ఇక్కడి తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రారంభించనున్నారు. అనంతరం గ్రామ శివారులో బహిరంగ సభ నుంచి ‘ధరణి’ సందేశం ఇవ్వనున్నారు. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రఘునందన్‌రావు, ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, మేడ్చల్‌ కలెక్టర్‌ డా.వాసం వెంకటేశ్వర్లు, అడిషనల్‌ కలెక్టర్‌ విద్యాసాగర్‌, సీపీ సజ్జనార్‌ మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర ప్రజలకు పారదర్శకమైన రెవెన్యూ సేవలను అందించాలనే సంకల్పంతో కొత్త రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా ధరణి పోర్టల్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. నగరానికి అత్యంత చేరువలో ఉన్నా అభివృద్ధికి నోచని మూడుచింతలపల్లిని మూడేండ్ల కిందట ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తత తీసుకున్నారు. మండల కేంద్రంగా మార్చడంతోపాటు ముఖ్యమంత్రి స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ నుంచి రూ.28.71కోట్లతో అభివృద్ధి చేశారు.