శనివారం 05 డిసెంబర్ 2020
Hyderabad - Nov 01, 2020 , 06:32:51

‘జంట’ జలాశయాల పరిరక్షణకు చర్యలు..!

‘జంట’ జలాశయాల పరిరక్షణకు చర్యలు..!

  • డ్రిప్‌ కింద నిధులు మంజూరు చేసిన కేంద్రం
  • హిమాయత్‌సాగర్‌కు రూ. 28. 20 కోట్లు 
  • ఉస్మాన్‌సాగర్‌కు రూ. 14 కోట్లతో పనులు 
  • మరమ్మతు పనులు చేపట్టనున్న జలమండలి 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : చారిత్రక జంట జలాశయాలు పూర్వ వైభవాన్ని సంతరించుకోనున్నాయి. పాతనగర ప్రజల దాహార్తిని తీర్చడంలో ముఖ్య భూమిక పొషిస్తున్న ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ రిజర్వాయర్ల పరిరక్షణే లక్ష్యంగా తెలంగాణ జలవనరుల శాఖ, కేంద్ర జల సంఘానికి ప్రతిపాదనలు సమర్పించింది. దేశవ్యాప్తంగా ఆనకట్టల మరమ్మతులు, అభివృద్ధికి విదేశీ ఆర్థిక సహాయంతో చేపడుతున్న డ్యాం రిహాబిలిటేషన్‌, ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్టు (డ్రిప్‌) కింద జలాశయాల పరిరక్షణకు కేంద్రం నిధులు విడుదల చేసింది. ఇందులో భాగంగానే ఉస్మాన్‌సాగర్‌ జలాశయానికి రూ. 14 కోట్లు, హిమాయత్‌సాగర్‌కు రూ. 28. 20 కోట్లు రానున్నాయి. 

పకడ్బందీ చర్యలు 

ఉస్మాన్‌సాగర్‌కు 738 చదరపు కిలోమీటర్లు (117 గ్రామాలు), హిమాయత్‌సాగర్‌కు 1308 చదరపు కిలోమీటర్ల (208 గ్రామాలు) పరీవాహక ప్రాంతం ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జంట జలాశయాల్లోకి భారీగా వరద వచ్చి చేరింది. హిమాయత్‌సాగర్‌ పరిధిలోని వెంకటాపూర్‌ మెయిన్‌ రివర్‌ కోర్సు (ఈసీ), దొడ్డి సుల్తాన్‌ పల్లి, అమ్ధాపూర్‌, ఉస్మాన్‌సాగర్‌ పరిధిలోని చండిప్ప మొయిన్‌ రివర్‌ కోర్సు, ఖానాపూర్‌, పొద్దుటూర్‌, బాల్కాపూర్‌, ఎల్వర్తీ, మేడిపల్లి ఛానెల్స్‌ల నుంచి జలాశయాల్లోని నీరు వచ్చి చేరుతుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఈ నిధులతో ఇన్‌ఫ్లో ఛానెల్స్‌, కట్ట(బండ్‌)ను మరింత బలోపేతం చేయనున్నారు. పరీవాహక ప్రాంతాల్లో ఎలాంటి కబ్జాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోనున్నారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చుట్టూ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. సందర్శకులను ఆకట్టుకునేలా పచ్చదనం పెంపు, ల్యాండ్‌ స్క్రేపింగ్‌ పనులు చేపట్టనున్నారు.