గురువారం 26 నవంబర్ 2020
Hyderabad - Sep 03, 2020 , 23:07:34

అభివృద్ధే ఎజెండా..

అభివృద్ధే ఎజెండా..

రూ. 6 కోట్లతో ఫంక్షన్‌ హాల్‌

రూ. 4.60 కోట్లతో అధునాతన శ్మశానవాటిక

పటాన్‌చెరులో మోడల్‌ రైతు బజార్‌

క్రీడా సామగ్రి కొనుగోలుకు ఒక్కో డివిజన్‌కు రూ. 2 లక్షలు

బల్దియా స్థాయీ సంఘం ఆమోదం 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రూ. 6కోట్లతో ఫంక్షన్‌ హాల్‌...రూ. 4.60 కోట్లతో అధునాతన శ్మశానవాటిక, పటాన్‌చెరులో మోడల్‌ రైతు బజార్‌.. ఇలా అభివృద్ధే ఎజెండాగా గురువారం  మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అధ్యక్షతన బల్దియా ప్రధాన కార్యాలయంలో స్థాయీసంఘం సమావేశం జరిగింది. ఇందులో పలు కీలక నిర్ణయాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. 

స్థాయీ సంఘం ఆమోదించిన పలు అంశాలు....

తార్నాకలోని లాలాపేట్‌ వాలీబాల్‌ కోర్టు వద్ద రూ. 6 కోట్ల వ్యయంతో మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణం. పరిపాలన అనుమతి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన.

డివిజన్‌-149లోని బేగంపేట్‌ దనియాలగుట్టలో రూ. 4.60 కోట్ల వ్యయంతో మోడల్‌ హిందూ శ్మశానవాటిక నిర్మాణం.

ఒక్కో డివిజన్‌లో క్రీడా సామగ్రి కొనుగోలు కోసం ఇది వరకు రూ. 1లక్ష కేటాయిం చగా, అదనంగా మరో రూ. 1 లక్ష మంజూరు. 

పటాన్‌చెరు రామచంద్రాపురం సర్కిల్‌ పరిధిలో 1.23 ఎకరాల విస్తీర్ణంలో మోడల్‌ రైతు బజార్‌ ఏర్పాటు, ఖాళీ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణం తదితర పనుల కోసం రూ. 2.98 కోట్లు మంజూరు. 

ఖైరతాబాద్‌ జోన్‌లో 13 థీమ్‌ పార్కుల నిర్మాణానికి గతంలో రూ. 41 కోట్లు మంజూరు చేయగా, కొత్తగా మరో పార్కు నిర్మాణానికి ఆమోదం. అలాగే గతంలో ఎంపిక చేసిన స్థలాలకు బదులుగా మరో చోట థీమ్‌ పార్కుల నిర్మాణానికి నిర్ణయం. 

నగరానికి చెందిన ప్రముఖ మాజీ క్రీడాకారులకు పెన్షన్‌ పథకం పొడిగింపు.

వీధి కుక్కల జనాభా నియంత్రణ కోసం చేపట్టే స్టెరిలైజేషన్‌, యాంటీ రేబిస్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాల్లో జంతు సంక్షేమ సంఘాల భాగస్వామ్యం. 

ఔటర్‌ రింగ్‌రోడ్‌ సర్వీసు రోడ్డు నుంచి ఖాజాగూడ లేక్‌, వయా ఉర్దూ యూనివర్సిటీ (కారిడార్‌-27) వరకు రోడ్డు విస్తరణ.

ఎస్‌ఆర్‌డీపీ కింద ఎల్బీనగర్‌ జంక్షన్‌ నుంచి బైరామల్‌గూడ కూడలి వరకు 60 మీటర్లు వెడల్పు చేసేందుకు రహదారి విస్తరణ.