గురువారం 03 డిసెంబర్ 2020
Hyderabad - Oct 27, 2020 , 06:57:18

భాగ్యనగరంలో కన్నులపండువగా విజయదశమి వేడుకలు

భాగ్యనగరంలో కన్నులపండువగా విజయదశమి వేడుకలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : విజయదశమి వేడుకలను భాగ్యనగరంలో కన్నులపండువగా నిర్వహించారు. నరగవాసులంతా కుటుంబసభ్యులు, స్నేహితుల మధ్య పండుగను సంబురంగా  జరుపుకొన్నారు. బొమ్మల కొలువులు, అమ్మవారి ఆరాధనలు, దేవాలయ దర్శనాలు, ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, అన్నదానాలు, వాహనపూజలు, రావణబొమ్మల దహనాలు చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో యువత దాండియా నృత్యాలతో అలరించారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసిన ముగ్గురమ్మల మూలపుటమ్మను తనివితీరా వీక్షించి జయహో జగన్మాత అంటూ వేడుకున్నారు. పలు ప్రాంతాల్లో శమీ, ఆయుధ పూజలు చేశారు. కొవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలు ఉత్సాహంగా పండుగను జరుపుకొన్నారు. 

  • మాసబ్‌ట్యాంక్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ ప్రాంగణంలోని మహంకాళీ అమ్మవారి ఆలయంలో శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.
  • అంబర్‌పేట మున్సిపల్‌మైదానంలో నిర్వహించిన రావణబొమ్మ దహనంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు పాల్గొన్నారు.
  • బషీర్‌బాగ్‌లోని శ్రీ కనకదుర్గా, శ్రీ నాగలక్ష్మి అమ్మవార్ల ఆలయంలో నిర్వహించిన విజయదశమి పూజల్లో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.
  • గోషామహల్‌లోని రాణి అవంతిబాయి కమ్యూనిటీ హాల్‌ వద్ద నిర్వహించిన రావణదహనం, తన నివాసంలో నిర్వహించిన ఆయుధపూజలో ఎమ్మెల్యే రాజాసింగ్‌ పాల్గొన్నారు.
  • బోరబండ బస్టాండ్‌లో నిర్వహించిన రావణబొమ్మ దహన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ పాల్గొన్నారు.
  • శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లి నిజరూప దర్శనాన్ని తిలకించేందుకు భారీగా జనం తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఫిలింనగర్‌లోని కనకదుర్గా ఆలయంలో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పూజలు చేశారు.