గురువారం 03 డిసెంబర్ 2020
Hyderabad - Oct 25, 2020 , 12:32:16

పేదలకు సాయం అందుతుంటే ప్రతిపక్షాలకు కడుపుమంట

పేదలకు సాయం అందుతుంటే ప్రతిపక్షాలకు కడుపుమంట

బంజారాహిల్స్‌:  పేదలకు సాయం అందుతుంటే ప్రతిపక్ష పార్టీల నాయకులకు కడుపుమంట ఎందుకని ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ప్రశ్నించారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లోని ఎన్‌బీనగర్‌ బస్తీలో శనివారం వర్షాలవల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి రూ.10వేల చొప్పున వరదసాయం పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పాల్గొన్నారు. వర్షాలతో ఇండ్లలోకి నీరువచ్చిన వారందరికీ రూ.10వేల తక్షణ సాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. ఈ మేరకు పేదలు నివాసం ఉంటున్న బస్తీల్లో సాయం అందిస్తుంటే కొంతమంది చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు సాయం అందిస్తుంటే ప్రతిపక్ష పార్టీలు ఓర్వలేకపోతున్నాయని, పేదలు ఎప్పుడూ బాధల్లోనే ఉండాలనేది ప్రతిపక్ష పార్టీల నైజమని, ప్రజలంతా సంతోషంగా ఉండాలనేది సీఎం కేసీఆర్‌ లక్ష్యమని పేర్కొన్నారు. 

బంజారాహిల్స్‌ డివిజన్‌లో..

బంజారాహిల్స్‌ డివిజన్‌ పరిధిలోని పలు బస్తీల్లో వర్షం బాధితులకు ప్రభుత్వ సాయం అందజేసే కార్యక్రమాన్ని కార్పొరేటర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఖాజానగర్‌, బోళానగర్‌, ఎన్‌బీటీనగర్‌, ఎన్‌బీనగర్‌, శ్రీరాంనగర్‌, ప్రేమ్‌నగర్‌లలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి రూ.10వేల చొప్పున సాయం అందించారు. అర్హులైన వారందిరకీ సాయం అందించాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారని, ఎవరూ ఆందోళన చెందవద్దని కార్పొరేటర్‌ సూచించారు.

జూబ్లీహిల్స్‌ డివిజన్‌లో..

జూబ్లీహిల్స్‌ డివిజన్‌ పరిధిలోని ఫిలింనగర్‌ 18బస్తీలతో పాటు ఇందిరానగర్‌, జవహర్‌నగర్‌ కాలనీ తదితర ప్రాంతాల్లో  వరద బాధితులకు ప్రభుత్వ సాయం ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ సిబ్బందితో పాటు స్థానిక బస్తీల నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు రూ.10వేల చొప్పున సాయం అందిస్తున్నారు. కార్పొరేటర్‌ కాజా సూర్యనారాయణతో పాటు డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు పెరుక కిరణ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు ఎల్లయ్య, నగేశ్‌, ఘని, అశోక్‌, పద్మ, వెంకటస్వామి, రాములు, రామకృష్ణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సోమాజిగూడ డివిజన్‌లో

ఖైరతాబాద్‌: సోమాజిగూడ డివిజన్‌లోని కపాడియా లేన్‌లో శనివారం ఎమ్మెల్యే దానం నాగేందర్‌, కార్పొరేటర్‌ పి.విజయారెడ్డి బాధితుల ఇంటికి వెళ్లి రూ.10వేల సాయాన్ని అందజేచారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌ పర్సన్‌ కె.ప్రసన్న పాల్గొన్నారు. అలాగే ఖైరతాబాద్‌లోని నెహ్రునగర్‌లో కార్పొరేటర్‌ పి. విజయారెడ్డి ముంపునకు గురైన బాధితులకు పదివేల సాయాన్ని అందజేశారు.

సోమాజిగూడ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ నాయకుడు వనం శ్రీనివాస్‌యాదవ్‌ నేతృత్వంలో ఎంఎస్‌ మక్తాలో రూ.10వేల సాయాన్ని బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు సలావుద్దీన్‌, నాగరాజు, ఎస్‌కే అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.