గురువారం 13 ఆగస్టు 2020
Hyderabad - Aug 01, 2020 , 00:54:18

నిండుగా ముంచేస్తున్న సైబర్‌ నేరగాళ్లు

నిండుగా ముంచేస్తున్న సైబర్‌ నేరగాళ్లు

అమాయకత్వంతో పాస్‌వర్డ్‌ ఇచ్చేస్తున్న బాధితులు

వివరాలతో  లోన్‌కు దరఖాస్తు చేసి..  డబ్బును  కాజేస్తున్న చీటర్స్‌

బ్యాంకు ఖాతా వివరాలు ఇతరులతో షేర్‌ చెయ్యొద్దు.. హెచ్చరిస్తున్న  సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం.. అంటూ సైబర్‌నేరగాళ్లు చిక్కడపల్లికి చెందిన సునీతకు ఫోన్‌ చేశారు. మీ బ్యాంకు ఖాతా లావాదేవీలు చాలా బాగున్నాయి.. మీకు ఎలాంటి ష్యూరిటీ లేకుండానే రూ.5లక్షల లోన్‌ వస్తుంది.. తీసుకోండి అంటూ అడిగారు. నాకు వద్దంటూ ఆమె వారించింది. అయినా సరే.. పదే పదే ఫోన్‌ చేసి ఆమెను బతిమిలాడారు. చివరకు మేడం.. మేము పంపించే ఫారంలో వివరాలు ఇవ్వండి చాలు.. అంటూ ఒక లింక్‌ను ఆమెకు పంపించారు. మీరు వివరాలు ఇవ్వడం వల్ల మీకు ఈ ఆఫర్‌ భవిష్యత్తులో కూడా ఉపయోగపడుతుంది.. ప్రస్తుతం కరోనా సమయం కాబట్టి బ్యాంకులు లోన్‌ విరివిగా ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయంటూ మాయ మాటలు చెప్పారు. దీంతో ఆమె వాళ్లు పంపించిన లింకును ఓపెన్‌ చేసి.. అందులో బ్యాంకు ఖాతా, ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ను పొందుపరిచింది. అన్ని వివరాలు నింపి సబ్‌మిట్‌ అనే బటన్‌ నొక్కగానే.. పూర్తి వివరాలు సైబర్‌నేరగాళ్ల చేతిలోకి వెళ్లాయి. ఆ మరుసటి రోజు ఆమె ఖాతాలో రూ.4.5 లక్షలు క్రెడిట్‌ అయ్యాయి. వెంటనే ఆమె అంతకు ముందు రోజు వచ్చిన ఫోన్‌ నంబర్‌కు కాల్‌చేసి. నేను వద్దన్నా.. మీరు లోన్‌ ఎందుకు మంజూరు చేశారు.. అంటూ చెప్పడంతో.. మేడం వాపస్‌ తీసుకుంటున్నామంటూ.. ఆ డబ్బుతో పాటు ఖాతాలో ఉన్న ఆమె సొంత డబ్బు రూ.50 వేలు కూడా కాజేశారు. ఇలాగే.. మరో ఘటనలో కూడా సైబర్‌నేరగాళ్లు రూ.4 లక్షలు కొట్టేశారు. ఇలాంటి ఘటనలు వారం రోజుల్లో రెండు వెలుగులోకి వచ్చాయి. 

మూడు సెకండ్లలో ఇన్‌స్టంట్‌ లోన్‌..!

పలు బ్యాంకులు ఇప్పుడు తమ ఖాతాదారులకు ఈజీగా రుణాలు అందించేందుకు ఇన్‌స్టంట్‌ లోన్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ఆ బ్యాంకు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే.. అందులో ఇన్‌స్టంట్‌ లోన్‌ సౌకర్యం ఉంటుంది. అందులో తమ వివరాలను పూర్తిచేసి.. లోన్‌కు దరఖాస్తు చేస్తే.. ఖాతాదారుడి లావాదేవీల స్థోమతను పరిశీలించి, ఎంత రుణానికి అర్హుడో.. అంత  మొత్తం  మూడు సెకండ్లలో మంజూరవుతుంది. ఈ ఇన్‌స్టంట్‌ లోన్‌ విధానాన్ని సైతం సైబర్‌నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకొని.. డబ్బులు కాజేస్తున్నారు. 

లోన్‌ కట్టాల్సిందే..!

సైబర్‌నేరగాళ్లు వేసే వలలో పడిన అమాయకులు.. తమ నెట్‌ బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌ను చెప్పేస్తున్నారు. దీంతో బ్యాంకు ఖాతాలో దాచిన సొమ్మును కూడా నేరగాళ్లు కాజేస్తున్నారు. సైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కిన బాధితులు.. ఇన్‌స్టంట్‌ బ్యాంక్‌ లోన్‌ కోసం కావాల్సిన సమాచారాన్ని స్వయంగా  నేరగాళ్లకు ఇచ్చేస్తున్నారు. దీంతో ఖాతాదారుడి ఖాతా నుంచే లోన్‌కు దరఖాస్తు చేస్తున్నారు. ఇన్‌స్టంట్‌ లోన్‌ వెంటనే మంజూరవుతుంది. బ్యాంకులో మాత్రం ఖాతాదారుడికే లోన్‌ ఇచ్చినట్లు రికార్డుల్లో నమోదవుతుంది. ఇక ఆ రుణానికి బాధ్యత ఖాతాదారుడే వహించాల్సి ఉంటుంది. ఓ బాధితుడికి బ్యాంకు నుంచి రుణం వాయిదాలు చెల్లించాలంటూ నోటీసులు కూడా వచ్చాయి. 

బ్యాంకు అధికారులు వివరాలు అడగరు

బ్యాంకు అధికారులు ఫోన్‌చేసి మీ బ్యాంకు ఖాతా వివరాలు అడగరు. ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌కు సంబంధించిన పాస్‌వర్డ్‌, యూజర్‌ ఐడీలు, ఓటీపీలు చాలా రహస్యంగా ఉంచుకోవాలి. అలాంటిది దొంగలకు ఇంటి తాళాలు ఇచ్చేసినట్లు.. నేరగాళ్లకు బ్యాంకు సమాచారాన్ని గుడ్డిగా ఇచ్చేస్తున్నారు. కొందరు అమాయకత్వంతో ఇస్తుంటే.. మరికొందరు అత్యాశతో కూడా వివరాలు అందజేస్తూ బోల్తా పడుతున్నారు. రుణం వచ్చే అవకాశం ఉన్న వారు ఖాతా వివరాలు ఇవ్వడంతో, ఆ ఖాతాలోని డబ్బును ఈజీగా సైబర్‌నేరగాళ్లు కొట్టేస్తున్నారు. నెట్‌ బ్యాంకింగ్‌కు సంబంధించిన యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, సీక్రెట్‌ కోడ్‌, ఓటీపీలు ఎవరితో చెప్పకూడదని  అవగాహన కల్పిస్తున్నాం. 

- ప్రశాంత్‌, ఇన్‌స్పెక్టర్‌ సైబర్‌క్రైమ్స్‌

తాజావార్తలు


logo