గురువారం 28 మే 2020
Hyderabad - May 23, 2020 , 01:50:18

కస్టమ్స్‌కు ఫైన్‌ కట్టాలంటూ ట్రాప్‌లోకి లాగి.. డబ్బులు లాగేస్తున్న సైబర్‌ నేరగాళ్లు..

కస్టమ్స్‌కు ఫైన్‌ కట్టాలంటూ ట్రాప్‌లోకి లాగి.. డబ్బులు లాగేస్తున్న సైబర్‌ నేరగాళ్లు..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సైబర్‌ నేరగాళ్లు పంజా విసురుతున్నారు.. మాయమాటలతో బోల్తా కొట్టిస్తున్నా రు.. మొదట తియ్యగా మాట్లాడి..తమ వలలోకి రాగానే మాయ చేసి నిండా ముంచేస్తున్నారు. విదేశాల నుంచి గిఫ్ట్‌లు పంపిస్తున్నామంటూ, ఏటీఎం కార్డులు, కేవైసీ అప్‌డేట్‌ల పేరుతో డబ్బులు లాగేస్తున్నారు.. ఈమెయిల్‌ను హ్యాక్‌చేసి, సంస్థల డేటాచేరీ చేసి వినియోగదారుల ఖా తాలను ఖాళీ చేస్తున్నారు. ఇలా సైబర్‌నేరగాళ్లబారిన పడిన పలువురు బాధితులు శుక్రవారం సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించారు. 

ప్రార్థనలు చేయమని.. ట్రాప్‌లోకి లాగి...

మలక్‌పేట్‌కు చెందిన ఓ యువకుడికి.. జెర్సీ క్లారా అనే యువతి పేరుతో ఫేస్‌బుక్‌లో సైబర్‌నేరగాళ్లు పరిచయం అయ్యారు. కొన్నాళ్లు ఇద్దరూ చాటింగ్‌ చేసి..ఆ తర్వాత వాట్సాప్‌లో మాట్లాడుకున్నారు. త్వరలో నాకు ప్రమోషన్‌ వచ్చేదుంది.. నా కోసం.. నీవు దేవుడికి ప్రార్థనలు చేయాలని సదరు యువతి కోరింది. దీంతో మరుసటి రోజు నీకు త్వరగా ప్రమోషన్‌ రావాలని దేవుడికి ప్రార్థనలు చేశానని వాట్సాప్‌లో యువకుడు చెప్పాడు. రెండు రోజుల తర్వాత నీ ప్రార్థనలతోనే నాకు ప్రమోషన్‌ వచ్చిందని సదరు యువతి సంతోషం వ్యక్తం చేసి.. ఈ ఆనందంలో నీకు మంచి గిఫ్ట్‌ పంపిస్తున్నానంటూ నమ్మించింది. మరుసటి రోజు ఎయిర్‌ పోర్టు నుంచి కస్టమ్స్‌ అధికారులమం టూ యువకుడికి ఫోన్‌ చేసి..  జెర్సీక్లారా అనే యువతి నీకు విలువైన బహుమతులు పంపించిందని, అందులో ఆభరణాలు, ఐఫోన్‌, ల్యాప్‌టాప్‌తో పాటు చాలా డాలర్లు ఉన్నాయని, అవి తీసుకోవాలంటే టాక్స్‌లు కట్టాలని చెప్పారు. అయితే తన వద్ద అంత డబ్బులేదని.. ఆ బహుమతులు నాకు వద్దంటూ యువకుడు ఫోన్‌చేసినవారికి చెప్పాడు. అంతలోనే సదరు యువతి.. యువకుడికి ఫోన్‌చేసి.. నేను కస్టమ్స్‌ డ్యూటీ కట్టడం మరిచిపోయాను.. అం దులో 13 వేల డాలర్లు ఉన్నాయి.. 10 వేల డాలర్లు నీవు తీసుకొని..మిగతా మూడు వేల డాలర్లు కష్టమ్స్‌ అధికారులకు ఇవ్వాలని చెప్పింది. దీంతో యువకుడు మూడు దఫాలుగా రూ.1.26లక్షలను వారు సూచించిన బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేశాడు. ఇంకా డబ్బులు అడుగుతుండడంతో సదరు యువకుడు స్నేహితులకు చెప్పగా.. అదంతా మోసం అని చెప్పారు. వెంటనే బాధితుడు సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

టిఫిన్‌ ఆర్డర్‌ పేరుతో..

టోలీచౌకిలో టిఫిన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న ఓ మహిళకు గుర్తుతెలియని వ్యక్తులు(సైబర్‌ నేరగాళ్లు) ఫోన్‌చేసి.. టిఫిన్‌ ఆర్డర్‌ ఇస్తున్నామంటూ మాట్లాడారు. మీకు ఆన్‌లైన్‌లో డబ్బు పంపిస్తామంటూ నమ్మించి .. గూగుల్‌పేలో క్యూఆర్‌ కోడ్‌ పంపించి.. ఆమె వద్ద నుంచి రూ. 60 వేలు కాజేశారు. 

ఏటీఎం కార్డు బ్లాక్‌ అవుతుందంటూ...

బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామంటూ సైబర్‌ నేరగాళ్లు.. ఓ రిటైర్డు ఉద్యోగికి ఫోన్‌చేసి.. మీ ఏటీఎం కార్డు బ్లాక్‌ అవుతుంది, అప్‌డేట్‌ చేసుకోవాలని చెప్పారు. మీ కార్డు వివరాలు చెబితే అప్‌డేట్‌ చేస్తామని నమ్మించారు. నిజమేనని నమ్మిన రిటైర్డు ఉద్యోగి.. బ్యాంకు వివరాలతోపాటు పిన్‌, ఓటీపీ నంబర్లు కూడా చెప్పడంతో అతని ఖాతా నుంచి రూ. 42 వేలు కాజేశారు.

    వినియోగదారుల డేటా చోరీ చేసి...

ఇటీవల కొందరు వినియోగదారులు సమస్యలపై కెన్‌స్టార్‌ సంస్థకు ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదుల వివరా లు తెసుకున్న గుర్తు తెలియని వ్యక్తులు( సైబర్‌ నేరగాళ్లు) వారికి ఫోన్‌ చేసి..  తమకు రూ.1200 డిపాజిట్‌ చేస్తే మీ సమస్యను త్వరగా పరిష్కరిస్తామని  నమ్మించారు. ప్రస్తు తం లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందన... మీరు డబ్బులు చెల్లిస్తే ఉన్న కొద్ది మందితో ఒకటి, రెండు రోజుల్లోనే ఎగ్జిక్యూటివ్‌, టెక్నికల్‌ పర్సన్‌ను పంపిస్తామని నమ్మించారు. వెంటనే వినియోగదారులు ఏమీ ఆలోచించకుండా సైబర్‌ నేరగాళ్లు సూచించిన  గూగుల్‌పే ఖాతాకు డబ్బు చెల్లించా రు. అయితే.. ఇలా చెల్లించిన వారికి.. తిరిగి గుర్తు తెలియ ని వ్యక్తులు ఫోన్‌ చేసి... అసలు రూ. 1199 మాత్రమే,  కానీ.. మీరు రూ. 1200 చెల్లించారు... దీనికి సిస్టమ్‌ యాక్సెప్ట్‌ చేయడంలేదు..మీరు చెల్లించిన రూ. 1200 తిరిగి మీకు ఇచ్చేస్తాం.. మరో సారి రూ. 1199 చెల్లించాలంటూ సూచించగా.. వినియోగదారులు కూడా చెల్లించారు. అయితే టెక్నీషియన్‌ ఎంతకీ రాకపోవడంతో వినియోగదారులు.. అసలు సంస్థకు వెళ్లి ఆరా తీయగా అదం తా మోసమని తేలింది. దీంతో కెన్‌స్టార్‌ సంస్థ ప్రతినిధులు సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కేవైసీ అప్‌డేట్‌ అంటూ...

నగరానికి చెందిన ఓ యువకుడికి గుర్తు తెలియ ని వ్యక్తులు ఫోన్‌ చేసి.. మీ పేటీఎం కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాలని , లేకపోతే సేవలు నిలిచిపోతాయని నమ్మించారు. కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాలంటే.. మీఫోన్‌లో క్విక్‌సపోర్టు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోమని చెప్పి...దాని ద్వారా అన్ని వివరాలు తెలుసుకున్నారు. ఈ తర్వాత యువకుడికి ఫోన్‌ చేసి.. మీరు ముందుగా రూ. 10లు పేటీఎం ఖాతాలో డిపాజిట్‌ చేయాలంటూ సూచించి, ఆ డబ్బులు డిపాజిట్‌ చేయగానే, అతని ఖాతాలో ఉన్న రూ. 79 వేలను సైబర్‌నేరగాళ్లు కాజేశారు.

మెయిల్‌ హ్యాక్‌చేసి.. 50వేలు కాజేశారు

నగరానికి చెందిన ఓ వ్యక్తి ఈ-మెయిల్‌ను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారు. బాబు అనే వ్యక్తికి.. స్నేహితుడికి సంబంధించిన యాహు మెయిల్‌ మాదిరిగానే, ఒక ఈమెయిల్‌ను అర్జంట్‌గా డబ్బులు కావాలని పంపించారు. ఇది నిజమేనని నమ్మిన స్నేహితుడు  అందులో ఉన్న బ్యాంకు ఖాతాకు రూ. 50 వేలు బదిలీ చేశాడు. రెండు రోజుల తర్వాత డబ్బులు వచ్చాయా అని స్నేహితుడు ఫోన్‌ చేయగా.. నేనెప్పుడు డబ్బులు పంపించమని చెప్పానని అన్నాడు. దీంతో మోసపోయానని భావించిన బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.logo