శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - May 21, 2020 , 01:00:23

కొత్త సిమ్‌కార్డుదారులకు సైబర్‌ నేరగాళ్ల వల

కొత్త సిమ్‌కార్డుదారులకు సైబర్‌ నేరగాళ్ల వల

సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. లాక్‌డౌన్‌లోనూ మోసాలకు పాల్పడుతున్నారు.. కేవైసీ అప్‌డేట్‌ పేరుతో నమ్మించి.. నిండా ముంచుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, అమాయకులను టార్గెట్‌ చేసి.. వలవేస్తున్నారు.. సిమ్‌ కార్డులకు కేవైసీ అప్‌డేట్‌ చేయాలంటూ క్విక్‌ సపోర్టు, ఎనీ డెస్క్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయించి.. మన స్మార్ట్‌ఫోన్‌ను వారి ఆధీనంలోకి తెచ్చుకుంటారు. మన నుంచే పిన్‌ నంబర్‌, ఓటీపీలు తెలుసుకుని.. బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు దోచేస్తున్నారు. ఇలా వారిబారిన పడినవారు ఇప్పుడు హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ల పరిధిలో సైబర్‌ ఠాణాలను ఆశ్రయిస్తున్నారు. రోజుకు పదుల సంఖ్యలో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఒక్కో బాధితుడు రూ.50వేల నుంచి రూ.1.5లక్షల వరకు పోగొట్టుకున్నట్లు సమాచారం. 

  సైబర్‌ క్రిమినల్స్‌.. ముందుగా కొత్తగా సిమ్‌కార్డులు తీసుకున్నవారి డేటాను సేకరిస్తారు. ఆ తర్వాత.. వారికి ఫోన్‌ చేసి.. మీరు కొత్త సిమ్‌ కార్డు తీసుకున్నారు.. దానికి కేవైసీ అప్‌డేట్‌ చేయాలి.. అలా చేయకపోతే మీ సేవలు నిలిచిపోతాయి అని నమ్మిస్తారు. ఈ క్రమంలో ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాం.. తర్వాత ఫోన్‌ చేయండి అని కార్డుదారులు సమాధానం ఇవ్వగా.. మీ సేవ కోసమే మేం ఉన్నాం సార్‌.. జస్ట్‌ మీరు మీ ఫోన్‌లో క్విక్‌ సపోర్టు, ఎనీ డెస్క్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోండి.. అందులో వచ్చే ఐడీని మాకు చెప్పండి అని సైబర్‌ నేరగాళ్లు నమ్మిస్తారు. 

ఆ తర్వాత  యూపీఐ యాప్‌ ద్వారా మాఫోన్‌కు ఒక్క రూపాయి పంపండి.. వెంటనే మీ సిమ్‌ కేవైసీని అప్‌డేట్‌ చేస్తామంటూ నమ్మిస్తారు. నిజమేనని నమ్మిన కార్డుదారు లు క్విక్‌ సపోర్టు, ఎనీ డెస్క్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని.. వ చ్చిన ఐడీని సైబర్‌ నేరగాళ్లకు చెప్పగానే.. మన ఫోన్‌ వారికం ట్రోల్‌లోకి వెళ్లిపోతుంది. వెంటనే కార్డుదారుడి పిన్‌ నంబర్‌, ఓటీపీలు తెలుసుకుని .. ఖాతా నుంచి డబ్బును కొట్టేస్తారు.  ఇప్పటి వరకు పేటీఎం, ఇతర యూపీఐ యాప్‌ల కేవైసీ అప్‌డేట్‌ అంటూ బురిడీ కొట్టించిన సైబర్‌ మాయగాళ్లు ...తాజాగా సిమ్‌ కార్డుల కేవైసీ అంటూ పంజా విసురుతున్నారు.  

గూగుల్‌ కేవైసీ అని ...

అలాగే సైబర్‌ దొంగలు.. గూగుల్‌ కేవైసీ అప్‌డేట్‌  చేసుకోవా లంటూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. గూగుల్‌ కేవైసీ అప్‌డేట్‌ చేసుకోకపోతే  ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోతాయని నమ్మిస్తారు.. కొందరు వెంటనే సైబర్‌ నేరగాళ్లు చెప్పిన యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుని బోల్తాపడుతున్నారు.   

కేవైసీ అంటే గందరగోళం వద్దు....

కేవైసీ అంటే నో యువర్‌ కస్టమర్‌ (మీ వినియోగదారుడి గురించి తెలుసుకో) సిమ్‌ కార్డులు, గూగుల్‌, పేటీఎం ఇతర యూపీఐ యాప్‌లకు సంబంధించి కేవైసీ అప్‌డేట్‌ అవసరం లేదు. మన ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తేనే.. మనకు సిమ్‌ ఇస్తారు. ఆ తర్వాత ఇంకా అప్‌డేట్‌ చేయాల్సింది ఏమీ ఉండదు. ఇక యూపీఐ యాప్‌ల సంగతికి వస్తే మనం వద్దనుకుంటే వాటిని ఫోన్‌ల నుంచి డెలీట్‌ చేసుకోవచ్చు. అంతేగానీ దానికి అప్‌డేట్‌ అవసరం లేదు. అందుకే కేవైసీ అప్‌డేట్‌ అనగానే ఎవరూ గందరగోళానికి గురి కావద్దని పోలీసులు సూచిస్తున్నారు. కేవైసీ కాల్స్‌కు ఎక్కువగా 60 ఏండ్లు దాటిన వారు, మహిళలు, అమాయకులు బోల్తాపడుతున్నారు. కేవైసీ అప్‌డేట్‌ అంటూ ఎవరు ఫోన్‌ చేసినా అది మోసమేనని గుర్తించాలి. అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి నేరాలన్నీ ఢిల్లీ, బీహార్‌, మధ్యప్రదేశ్‌ ప్రాంతాల్లోని సైబర్‌ నేరగాళ్లు చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.logo