శనివారం 30 మే 2020
Hyderabad - May 24, 2020 , 01:48:21

లాక్‌డౌన్‌ సడలింపుతో రెచ్చిపోతున్న సైబర్‌నేరగాళ్లు..

లాక్‌డౌన్‌ సడలింపుతో రెచ్చిపోతున్న సైబర్‌నేరగాళ్లు..

హైదరాబాద్ : లాక్‌డౌన్‌ సమయంలో అన్ని నేరాలతో పాటు సైబర్‌ నేరాలు తగ్గాయి. అయితే లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు ఇవ్వడంతో సైబర్‌ నేరగాళ్లు తిరిగి రెచ్చిపోతున్నారు. ఓటీపీలు తెలుసుకొని బ్యాంకు ఖాతాల్లోని నగదును లూటీ చేస్తున్నారు. ఇలాంటి నేరగాళ్లు వేసే వలలో తెలివైన వారే పడుతుండటం విశేషం. మోసపోయిన వారు సైబర్‌నేరగాళ్లు ఫోన్‌ చేసిన సమయంలో అంతా తమకు తెలుసుననే భావనతో ఉండడం.. ఫోన్లో మాట్లాడుతున్నది ఎవరన్నది నిర్ధారణ చేసుకోకపోవడం.. క్యూఆర్‌ కోడ్‌ పంపితే అది డబ్బు అవతలి వాళ్లకు పంపించేందుకు వచ్చిన కోడా? తమకు వచ్చేందుకు పంపిందా? అన్న కనీస అవగాహన లేకుండా..  కొందరు అత్యాశకు పోయి.. మరికొందరు నిర్లక్ష్యంతో.. ఇంకొందరు మిడిమిడి జ్ఞానంతో సైబర్‌నేరగాళ్ల చేతిలో పడి మోసపోతున్నారు. గుడ్డిగా ఓటీపీలు చెప్పేశానంటూ కొందరు.. అవతలి వ్యక్తి ఆర్మీ అనే సరికి నమ్మేశానంటూ మరికొందరు ఠాణాలకు వచ్చి వాపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. లాక్‌డౌన్‌ సమయంలో సైబర్‌ఠాణాకు వచ్చిన ఫిర్యాదులలో ఓఎల్‌ఎక్స్‌ 25 % , ఓటీపీ 30%, మిగతాకేసులు 45%  ఉన్నాయి.

క్రమక్రమంగా పెరుగుతున్న నేరాలు.. 

ఉద్యోగాలు, ఇన్సూరెన్స్‌, సెల్‌ టవర్స్‌, వ్యాపార లావాదేవీలు, ఫ్రెండ్‌షిప్‌, మంచి కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తామంటూ  కొందరు సైబర్‌ నేరగాళ్లు కొన్ని పట్టణాల్లోని కాల్‌సెంటర్లను అడ్డాగా చేసుకొని అమాయకులకు ఫోన్లు చేస్తుంటారు. అయితే దేశమంతా లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో కొన్ని పట్టణాల్లోని కాల్‌సెంటర్లకు తాళాలు పడగా నేరాలు తగ్గుముఖం పట్టాయి. సైబర్‌ నేరాల్లో ఆరితేరిన కొందరు నైజీరియన్లు కూడా నేరాలను తగ్గించారు. మొత్తంగా వారం రోజుల క్రితం లాక్‌డౌన్‌కు కేంద్రం సడలింపు ఇవ్వడంతో చాలా పట్టణాల్లో కార్యాలయాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. అదే సమయంలో సైబర్‌ నేరాలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో ప్రతిరోజు 15 నుంచి 20 ఫిర్యాదులు వస్తే.. ప్రస్తుతం 30 నుంచి 45 వస్తున్నాయి. 

అందులోవాళ్లు స్పెషలిస్ట్‌లు..!

‘ మీ డెబిట్‌ కార్డు బ్లాక్‌ అవుతుంది.. పేటీఎం కేవైసీ అప్‌డేట్‌ చేయాలి.. ఈ లింక్‌ పంపిస్తున్నాము.. ఓఎల్‌ఎక్స్‌లో వస్తువును విక్రయానికి పెట్టి ఆర్మీ ఉద్యోగులమంటూ’ అమాయకులను ఈజీగా బుట్టలో వేసుకొని  గూగుల్‌ పే లింక్‌, క్యూ ఆర్‌ కోడ్‌, అడ్వాన్స్‌లను బ్యాంకులలో డిపాజిట్‌ చేయించుకుంటున్నారు ఘరానా మోసగాళ్లు. ప్రతిరోజు నాలుగు నుంచి ఐదు ఫిర్యాదులు సైబర్‌ఠాణాకు వస్తే అందులో సగం ఇలాంటి ఫిర్యాదులే ఉంటున్నాయి. రాజస్థాన్‌, బీహార్‌, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌ నేరగాళ్లు ఒక్కరిద్దరూ ముఠాలుగా ఏర్పడి ఇండ్లలో నుంచి  ఈ తరహా మోసాలకు  పాల్పడుతున్నారు. logo