బుధవారం 08 జూలై 2020
Hyderabad - May 29, 2020 , 04:51:45

వేర్వేరు ఘటనల్లో రూ.12.02 లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

వేర్వేరు ఘటనల్లో రూ.12.02 లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

సైబర్‌ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతూనే ఉన్నారు.. అమాయకులను టార్గెట్‌ చేసుకొని నిండా ముంచేస్తున్నారు.. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపిస్తూ.. మంచి గిఫ్ట్‌లు పంపిస్తున్నామంటూ... ఓఎల్‌ఎక్స్‌లో తక్కువ ధరకు వాహనాలను విక్రయిస్తున్నామంటూ బురిడీ కొట్టిస్తున్నారు. కొందరు అత్యాశకు పోయి.. మరికొందరు తక్కువ ధరకు వస్తున్నాయంటూ నమ్మి మోసపోతున్నారు. ఇంకొందరు కస్టమర్‌కేర్‌ నంబర్ల కోసం గూగుల్‌లో సెర్చ్‌చేసి.. సైబర్‌నేరగాళ్ల చేతికి చిక్కి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇలా.. వీరి బారినపడిన పలువురు బాధితులు గురువారం   సీసీఎస్‌ సైబర్‌క్రైమ్స్‌ పోలీసులను ఆశ్రయించారు... 

సికింద్రాబాద్‌కు చెందిన విజయ్త్న్ర...ఓఎల్‌ఎక్స్‌ మార్కెట్‌ ప్లేస్‌లో హోండా యాక్టివాను రూ. 19 వేలకు విక్రయానికి పెట్టిన ఒక ప్రకటన చూశాడు.. అందులో ఉన్న నంబర్‌ను సంప్రదించి.. విక్రయదారుడితో మాట్లాడి రూ. 14 వేలకు కొనుక్కునేలా ఒప్పందం చేసుకున్నారు. తాను ఇండియన్‌ ఆర్మీలో పనిచేస్తున్నానని, హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు బదిలీ కావడంతో మొత్తం షిఫ్ట్‌ చేస్తున్నానని, అందుతే తక్కువ ధరకు ఒప్పుకుంటున్నానంటూ గుర్తు తెలియని వ్యక్తి నమ్మించాడు. ఆ తరువాత ముందు గా రూ. 2500 ట్రాన్స్‌పోర్టు చార్జీలు, రూ. 500 ప్యాకింగ్‌ చార్జీలు చెల్లించాలని సూచించగా.. విజయ్‌ ఆ డబ్బు చెల్లించాడు. ఆ తరువాత ట్రాన్స్‌ఫర్‌ ఫీ, ట్రాన్స్‌పోర్టు చార్జీలు పెరిగాయని, సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాలని..ఈ చెల్లించే డబ్బు తిరిగి నీకే వస్తుందని...ఆర్మీ వాళ్లను నమ్మవా అని నమ్మబలికి రూ. 1.16 లక్షలు వసూలు చేశాడు. 

గూగుల్‌లో సెర్చ్‌చేసి..96వేలు పోగొట్టుకున్నాడు...

హిమాయత్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో స్టేషనరీ బుక్స్‌ కొనుగోలు చేశాడు. ఆ వస్తువులను ఫెడెక్స్‌ కొరియర్‌లో పంపిస్తున్నట్లు సదరు విక్రయ సంస్థ సూచించింది. అయితే.. నిర్దిష్ట సమయానికి కొరియర్‌ రాకపోవడంతో ఫెడెక్స్‌ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేసి.. అందులో ఉన్న ఒక నంబర్‌కు ఫోన్‌ చేశాడు. అవతల నుం చి.. మేం అనుకున్న సమయానికి డెలివరీ చేయలేకపోయాం..మీకు గూగుల్‌ పే అకౌంట్‌ ఉందా.. అంటూ మాట్లాడి, మీ డబ్బు వాపస్‌ ఇస్తున్నామంటూ నమ్మించారు. వారి మాటలు నమ్మిన బాధితుడు..  గూగుల్‌ పే, ఫోన్‌ పేల వివరాలు చెప్పాడు. వెంటనే సైబర్‌ నేరగాళ్లు అతని ఖాతాల నుంచి రూ.96వేలను తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు. గూగుల్‌, ఫోన్‌ పేల ద్వారా చెల్లించే సమయాల్లో నగదు అని ఉన్న చోట.. అది కోడ్‌ అంటూ సైబర్‌నేరగాళ్లు బాధితుడిని నమ్మిస్తూ.. దోచేశారు. ఈ మేరకు బాధితులు వేరు వేరుగా ఫిర్యాదులు చేయడంతో సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

30వేల పౌండ్ల ఆశ చూపి..8.9లక్షలు కాజేశారు...

ఫేస్‌బుక్‌లో వచ్చిన ఓ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌... ఓ వివాహితను రూ. 8.9 లక్షలు ముంచేసింది. ఆస్ట్రేలియాలో మంచి ఉద్యోగం చేస్తున్నాను.. తమ స్నేహానికి గుర్తుగా రూ.30 వేల పౌండ్లు పంపిస్తున్నానని నమ్మించిన నైజీరియన్‌ సైబర్‌నేరగాళ్లు.. వివిధ టాక్స్‌ల పేరుతో డబ్బులు కాజేశారు. సీసీఎస్‌ సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ కథ నం ప్రకారం... కాచిగూడకు చెందిన ఓ వివాహిత  ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నది. ఆమెకు ఫేస్‌బుక్‌లో జాన్‌ బ్లిక్స్‌ అనే పేరుతో గుర్తుతెలియని వ్యక్తి( నైజీరియన్‌ సైబర్‌ నేరగాడు ) ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపించాడు. వెంటనే ఆమె దానికి అంగీకరించగా.. ఇద్దరూ స్నేహితులయ్యా రు. రోజూ చాటింగ్‌ చేసేవారు. ఒకరి వివరాలు ఒకరు తెలుసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆస్ట్రేలియాకు సంబంధించిన ఒక వాట్సాప్‌ నంబర్‌ను ఆమెకు పం పించాడు.. రోజూ వాట్సాప్‌లో చాటింగ్‌ చేయడం ప్రారంభించారు.
ఈ క్రమంలో మంచి ఉద్యోగం చేస్తున్నాను...ఇన్ని రోజుల మన స్నేహానికి గుర్తుగా ఒక మంచి బహుమతి పంపిస్తున్నాను.. అందులో 30 వేల పౌండ్లు,  బంగారం, వజ్రాభరణాలు ఉన్నాయంటూ నమ్మించాడు..  రెండు రోజుల తరువాత అలియా అనే పేరుతో ఓ మహిళ ఫోన్‌ చేసి.. మీ పేరుతో ఒక పార్శిల్‌ వచ్చింది.. అందులో 30 వేల పౌండ్లున్నాయి.. రూ. 30 వేలు చార్జీలు చెల్లించాలంటూ మాట్లాడింది. ఆ తరువాత జీఎస్టీ, ఆదాయపన్ను, తదితర పేర్లు చెబు తూ దఫ దఫాలుగా రూ.8.9 లక్షలు వసూలు చేశారు. ఇంకా డబ్బులు అడుగుతుండడంతో ఇదంతా మోసమని గ్రహించిన బాధితురాలు గురువారం సీసీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

స్విఫ్ట్‌ కారంటూ లక్ష..

లంగర్‌హౌస్‌కు చెందిన ఓ వ్యక్తి.. ఓఎల్‌ఎక్స్‌లో స్విఫ్ట్‌కారును రూ. 1.5 లక్షల విక్రయానికి పెట్టిన ప్రకటన చూసి.. అందులోని నంబర్‌ను సంప్రదించాడు. విక్రయదారుడితో లక్ష రూపాయలకు ఒప్పందం చేసుకున్నాడు. ఆ తరువాత ధరలో 50 శాతం  ముందుగా చెల్లించాలని, ఆ తరువాత ప్యాకింగ్‌ చార్జీలని, సెక్యూరిటీ డిపాజిట్‌లు అంటూ రూ. 1 లక్ష కాజేశారు.  


logo