గురువారం 26 నవంబర్ 2020
Hyderabad - Oct 30, 2020 , 07:54:12

ఆ ఖాతాలు కూలీలవే..!

ఆ ఖాతాలు కూలీలవే..!

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కూలీల నుంచి బ్యాంక్‌ ఖాతాలు సేకరించి.. నగరానికి చెందిన ఓ మహిళకు ఖరీదైన్‌ గిఫ్ట్‌ పంపిస్తున్నానంటూ నమ్మించిన సైబర్‌ నేరగాడు.. ఆమె నుంచి కాజేసిన రూ.16లక్షలను వారి ఖాతాల్లోకి బదిలీకి చేసుకున్నాడు. ఈ కేసులో సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి ఆ ఖాతాలకు చెందిన కూలీలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించి.. ఆ తర్వాత వారిని కోర్టు అనుమతి ద్వారా కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా వి చారిస్తున్నారు.  ప్రధాన సూత్రధారి అయిన సైబర్‌ నేరగాడి కోసం గాలిస్తున్నారు. 

వివరాల్లోకి వెళితే.. మాదాపూర్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు ఫేస్‌బుక్‌లో యూకే పౌరుడి నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. ఆమె దాన్ని అంగీకరించడంతో.. ఇద్దరు కొన్ని రోజులు చాటింగ్‌చేసి మంచి స్నేహితులుగా మారా రు. ఆ తర్వాత ఇన్ని రోజుల మన స్నేహానికి గుర్తుగా మీకు మంచి గిఫ్ట్‌ పంపిస్తున్నానంటూ చెప్పాడు. దీనికి సంతోషపడ్డ ఆమె బహుమతి కోసం ఎదురుచూస్తుంది. ఈ క్రమంలో ఢిల్లీ కస్టమ్స్‌ అధికారులమంటూ గుర్తు తెలియ ని వ్యక్తులు (సైబర్‌ నేరగాళ్లు ) ఫోన్‌ చేశారు.. మీ పేరుపై ఖరీదైన గిఫ్ట్‌ వచ్చిందని, మీకు ఇంత ఖరీదైన వస్తువులు ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు, మీ మీద పెద్ద కేసు పడుతుందని చెప్పగా భయాందోళనకు గురైంది.  గమనించిన ఫోన్‌చేసిన వ్యక్తులు.. మీరు మహిళ కాబట్టి వదిలేస్తాం.. అయితే ఇందుకు కొంత ప్రాసెసింగ్‌ ఫీజులు కడితే సరిపోతుంది... ఇక మీపై ఎలాంటి కేసు ఉండదు ...కోట్లు విలువ చేసే బహుమతులు మీకేనని నమ్మించారు. వెంటనే ఆమె దఫ దఫాలుగా దాదాపు రూ.16 లక్షలను వారు సూచించిన బ్యాంక్‌ ఖాతాలకు పంపించింది. ఇంకా డబ్బులు కావాలంటూ ఫోన్‌ చేస్తుండటం తో.. అనుమానించి జరిగిన విషయాన్ని తెలిసినవారికి చెప్పగా.. వారు అదంతా మోసం అని చెప్పారు. దీంతో బాధితురాలు సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యా దు చేసింది. పోలీసులు బాధితురాలు పంపించిన ఖాతాల ఆధారంగా దర్యాప్తు చేపట్టగా.. అవి కూలీలవని తేలింది. వెంటనే ఢిల్లీ, పచ్చిమబెంగాల్‌ చెందిన కూలీలను అదుపులోకి తీసుకొని విచారించగా.. మాకేం తెలియదు..  బ్యాంక్‌ ఖాతాలు తెరిచి పాస్‌బుక్‌, డెబిట్‌ కార్డు ఇస్తే కమీషన్‌లు ఇస్తామని కొందరు చెప్పారు. దీనికి ఆశపడి వాటిని వారికి ఇచ్చామని చెప్పారు. దీని ఆధారంగా లోతుగా దర్యాప్తు చేపట్టగా.. దీనివెనక నైజీరియా దేశానికి చెందిన సైబర్‌ నేరగాడు ఉన్నాడని తేలింది. ఆ కూలీలను  కోర్టు అనుమతి ద్వారా కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారిస్తున్నారు. 

అప్రమత్తంగా ఉండాలి

సైబర్‌ నేరగాళ్ల పట్ల నిత్యం అప్రమత్తంగా ఉం డాలని  పోలీసులు, సైబర్‌ నిపుణులు  అవగాహన కల్పిస్తున్నా... ప్రసార మాధ్యమాలు, పత్రికల ద్వా రా అలర్ట్‌గా ఉండాలని విస్తృత ప్రచారం చేస్తున్నా .... కొందరు మాత్రం పట్టించుకోవడంలేదు. దీంతో సైబర్‌ నేరగాళ్లు గిఫ్ట్‌లు, లాటరీ, తదితర పేర్లతో విసురుతున్న గాలానికి కొంతమంది చిక్కి లక్షలు పోగొట్టుకుంటున్నారు. మన ముందు ఉన్న వారికే డబ్బులు అప్పుగా లేదా సహాయంగా ఇచ్చి నా అవి తిరిగి వచ్చే వరకు నమ్మకం ఉండదు. అలాంటిది కేవలం సోషల్‌ మీడియా వేదికల ద్వా రా పరిచయమై...వాట్సాప్‌లో చాటింగ్‌ మాటలకు నమ్మి లక్షలకు లక్షలు వారు సూచించిన ఖాతాల్లోవేసి మోసపోతున్నారు. ఇకనైనా గుర్తు తెలియని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యం గా కేవైసీ అప్‌డేట్‌, లాటరీ, గిఫ్ట్‌ల పేరుతో వచ్చే ఫోన్లను నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు.