e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home హైదరాబాద్‌ నార్సింగి ఠాణాలో ‘సైబర్‌ క్రై టీం’ఏర్పాటు

నార్సింగి ఠాణాలో ‘సైబర్‌ క్రై టీం’ఏర్పాటు

నార్సింగి ఠాణాలో ‘సైబర్‌ క్రై టీం’ఏర్పాటు

మణికొండ, మార్చి 26 : హలో.. నేను బ్యాంకు నుంచి మాట్లాడుతున్నా మీ ఏటీఎం కార్డు ఎక్స్‌పైరీ అయిపోతుంది.. రెన్యూవల్‌ చేయాలండీ.. మీ కార్డు వెనుకాల ఉన్న మూడంకెల నెంబరు చెప్పండీ అంటూ ఒకరు.. మీకు బంఫర్‌ ఆఫర్‌ వచ్చిందంటూ మీ అకౌంట్‌ నెంబరు చెప్పండీ అంటూ ఇంకొకరు.. ఇలా సైబర్‌ నేరగాళ్లు ఖాతాదారుని అకౌంట్‌లో ఉన్న నగదును దోచుకుని అడ్రస్సు లేకుండా పోతున్నారు. దీంతో రోజురోజుకూ సైబర్‌ నేరాల సంఖ్య పెరుగుతుంది. మరికొంతమంది ఓఎల్‌ఎక్స్‌లో విక్రయాలంటూ నగదు బదిలీలు, సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన పదజాలంతో చాటింగులు, ఆన్‌లైన్‌ మోసాలు, రెచ్చగొట్టే పోస్టింగులు, బంపర్‌ డ్రాలంటూ అనేక రకాల మోసాలు ఇటీవల తీవ్రమయ్యాయి. ఈ తరహా మోసాలకు చెక్‌పెట్టేందుకు రాష్ట్ర పోలీసు శాఖ ప్రత్యేక విభాగాలను నేరుగా ఆయా పోలీస్‌స్టేషన్లకే అప్పగించి అక్కడ ‘సైబర్‌ క్రైం వింగ్‌’ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోలీసు సేవలను విస్త్రృత పర్చుతున్నారు. ఇటీవల డీజీపీ కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ తరగతులను పూర్తిచేసుకున్న సిబ్బందితో కలిసి ఠాణాకు ఐదుమందితో కూడిన ఓ బృందాన్ని సైబర్‌ క్రైం విభాగంగా ఏర్పాటు చేస్తున్నారు.
శిక్షణ పూర్తి..
మొన్నటి వరకు సైబర్‌ నేరాల ఫిర్యాదుల విభాగం కమిషనరేట్ల వరకే ఉండగా ప్రస్తుతం ప్రతి ఠాణాలో సైబర్‌ విభాగాలను పోలీసుశాఖ ఏర్పాటు చేస్తున్నది. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో ఇటీవల ప్రత్యేకంగా సైబర్‌ క్రైం బృందాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఒక ఎస్సై, ఐదుగురు కానిస్టేబుళ్లతో నార్సింగి పీఎస్‌లో సైబర్‌ క్రైం బృందం ఏర్పాటైంది. ఈ బృందం ఇన్‌స్పెక్టర్‌ పర్యవేక్షణలో కొనసాగుతుంది. ప్రత్యేక గదిలో సైబర్‌ క్రైం విభాగం పేరిట ఏర్పాటు కావడంతో సైబర్‌ మోసాలకు నష్టపోయిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. సైబర్‌ నేరాలపై చేపట్టాల్సిన విచారణ గురించి ఇప్పటికే బృందం సభ్యులు శిక్షణ పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు.
సైబర్‌ క్రైం విభాగ బృందం సభ్యులు వీరే..
నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ ఎస్సై, ఐదుమంది కానిస్టేబుళ్లతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. నార్సింగి సెక్టార్‌ ఎస్సై కె.బలరాం నాయక్‌ నేతృత్వంలో కానిస్టేబుళ్లు షారూఖ్‌, కిషన్‌, చంద్రకళ, సావిత్రి బృంద సభ్యులుగా బాధ్యతలు చేపట్టారు. ఈ బృంద సభ్యులంతా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో ప్రావీణ్యత పొందిన వారు కాగా ఇటీవల డీజీపీ కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా పలు రకాల అంశాలపై శిక్షణ పొందారు. సైబర్‌ నేరాలపై ఎలాంటి ఫిర్యాదులైనా పోలీస్‌స్టేషన్‌లోనే స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ పర్యవేక్షణలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి అక్కడే విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగిలే చూస్తారు.
జనాభాకు అనుగుణంగా చర్యలు..
నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రోజురోజుకూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఠాణా పరిధిని సెక్టార్ల వా రీగా విభజించి ఆయా సెక్టారుకు ఓ ఎస్సైని నియమించి అక్కడ జరిగే కార్యకలాపాలపై ఎప్పుటికప్పుడూ నిఘా పెంచుతూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా మొబైల్‌ పెట్రోలింగ్‌ ద్వారా అనేక సమస్యలు ఆదిలో పరిష్కారమౌతుండటం గమనార్హం. చిన్నపాటి గొడవలకు సైతం అప్పట్లో పోలీస్‌స్టేషన్‌ వరకు వచ్చి పరిష్కరించుకునేవారు ఇప్పుడు ప్రజల్లోనూ చైతన్యం పెరుగుతుండటంతో చిన్నస్థాయి పంచాయతీలు తగ్గినప్పటికీ సోషల్‌ మీడియా ద్వారా జరిగే మోసాలతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అధికశాతం విద్యావంతులే ఈ సైబర్‌ నేరాలకు మోసపోతున్నట్లు పోలీసు అధికారులు గుర్తించారు. వీరిలో అధికంగా మహిళలే ఉండటం గమనార్హం. పనికిరాని చిట్‌చాట్లను చేయడం ఆపై ఆకర్షితులై మోసపోవడం ఆ తర్వాత ఎవ్వరికీ చెప్పుకోకుండా మనస్థాపనకు గురై లక్షల్లో డబ్బులు మోసపోయిన ఘటనలు నగరంలో అనేక వెలుగుచూస్తున్నారు. ఈ తరహా మోసాలకు చెక్‌పెట్టేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసి అమలు చేస్తుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తంచేస్తున్నారు.
ఈ తరహా మోసాలపై ఫిర్యాదులు చేయవచ్చు..
ఆన్‌లైన్‌లో బంపర్‌ ఆఫర్లు అంటూ అకౌంట్‌ నెంబర్లను తీసుకుని నగదును దోచుకునేవారిపై, ఓఎల్‌ఎక్స్‌లో భారీగా డిస్కౌంట్లు అంటూ వినియోగదారులను మోసం చేసే వారిపై, సోషల్‌ మీడియా ద్వారా అసభ్యంగా వ్యవహరించేవారిపై, రెచ్చగొట్టే వాఖ్యలపై, అనవసర పోస్టింగులతో అవమాన పర్చే వ్యక్తులపై ఈ తరహ ఫిర్యాదులను సైబర్‌ క్రైం విభాగంలో ఫిర్యాదు చేయవచ్చు. ఇటీవల నార్సింగి పోలీస్‌స్టేషన్‌ సైబర్‌ క్రైం విభాగం అందుబాటులోకి రావడంతో ఇప్పటి వరకు ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని అధికారులు తెలిపారు. సైబర్‌ నేరాలు, మోసాలపై బాధితులు నేరుగా సైబర్‌వింగ్‌కు వచ్చి ఫిర్యాదులు చేసుకోవచ్చని అంటున్నారు.
ప్రజల్లో అవగాహన పెంచుతాం..
సైబర్‌ నేరాలపై ఎప్పటికప్పుడు పకడ్బందీ చర్య లు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. సైబర్‌ నేరగాళ్లు వినియోగించే సాంకేతికతపై పూర్తిస్థాయి అవగాహనతో, స్టేషన్‌ అధికారి పర్యవేక్షణలో మా టీం పనిచేస్తున్నది. సాంకేతిక నిపుణుల వద్ద శిక్షణ పొందిన తమ సిబ్బంది సైబర్‌ నేరాల నివారణ కోసం శక్తివంచనలేకుండా పనిచేయడానికి ఎల్లప్పుడు అందుబాటులోనే ఉంటాం. అంతకన్న ముందు ప్రజల్లో సైబర్‌ మోసాలపై అవగాహన కల్పించేందుకు కృషిచేస్తున్నాం. నార్సింగి, పుప్పాలగూడ, కోకాపేట తదితర ప్రాంతాల్లో అపార్టుమెంట్‌ కల్చర్‌ పెరిగిపోవడంతో పాటు ఈ ప్రాంతాల్లో సైబర్‌మోసాలపై ఫిర్యాదు అందేవి. వీటిని ఆదిలోనే అరికట్టేందుకు సైబర్‌ విభాగం నిబద్ధతతో పనిచేసేందుకు కృషిచేస్తాం. -కె.బలరాం నాయక్‌, ఎస్సై, సైబర్‌ క్రైం విభాగం ఇన్‌చార్జి, నార్సింగి పోలీస్‌స్టేషన్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నార్సింగి ఠాణాలో ‘సైబర్‌ క్రై టీం’ఏర్పాటు

ట్రెండింగ్‌

Advertisement