e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 16, 2021
Home హైదరాబాద్‌ మాయమాటలు.. ఖాతాలకు ఎసరు

మాయమాటలు.. ఖాతాలకు ఎసరు

సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మాయమాటలతో దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో రీతిలో కోట్లు కొల్లగొడుతున్నారు. సైబర్‌ క్రైం పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా… అనేక మంది ఆగంతకుల చేతిలో మోసపోతూనే ఉన్నారు.

అద్దెకు ఇల్లు కావాలి…అలా చేయండి

సిటీబ్యూరో, సెప్టెంబర్‌ 13 (నమస్తే తెలంగాణ): మారేడ్‌పల్లికి చెందిన సాయికుమార్‌ తన ఇంట్లో ఒక పోర్షన్‌ అద్దెకు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో సైబర్‌నేరగాళ్లు ఫోన్‌ చేసి.. మేం ఆర్మీ అధికారులం.. ఇక్కడే ఉంటాం.. ఇంటిని అద్దెకు తీసుకుంటాం’ అంటూ ముందుకొచ్చారు. మీరు రూపాయి పంపిస్తే.. ఇందుకు రెట్టింపుగా.. ఆర్మీ కేంద్ర కార్యాలయం నుంచి మీకు డబ్బులు వస్తాయని నమ్మించారు. యజమాని వారు చెప్పినట్లు చేయగానే.. రెండు రూపాయలు అతడి గూగుల్‌ పే నంబర్‌కు పంపించారు. రెండు మూడు సార్లు ఇలానే చేసి.. ‘మీరు రూ. 1.4 లక్షలు పంపించండి, రూ. 2.8 లక్షలు మీ ఖాతాలో డిపాజిట్‌ అవుతాయి’ అంటూ.. చెప్పారు.

- Advertisement -

బాధితుడు ఆ మొత్తాన్ని పంపించగానే అవతలి వ్యక్తులు సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశారు. మరో ఘటనలో డీఆర్‌డీవోలో స్వీపర్‌గా పనిచేస్తున్న విజయలక్ష్మి ఏటీఎం సెంటర్‌ వద్ద డబ్బు డ్రా చేసి పెట్టమంటూ.. ఓ వ్యక్తిని కోరింది. ఇదే అదనుగా వివరాలు తీసుకున్న నేరగాడు.. డబ్బులు డ్రా చేశాక.. నగదు, కార్డును తిరిగి ఇచ్చేశాడు. కార్డు వివరాలు, పిన్‌ నంబర్‌, సీవీవీ ఉండటంతో నిందితుడు ఆ అకౌంట్‌ నుంచి డబ్బు కొట్టేస్తున్నాడు. సుమారు రూ. 2.5 లక్షలు ఖాతాలో లేకపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయా ఫిర్యాదులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రోజుకు గంట పనిచేస్తే చాలు..

బంజారాహిల్స్‌, సెప్టెంబర్‌ 13: రోజుకు గంట పనిచేస్తే రూ.5వేల దాకా సంపాదించుకోవచ్చంటూ.. మాయమాటలు చెప్పడంతో నమ్మిన ఓ వ్యక్తి మోసపోయాడు. బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలివి.. టోలీచౌకిలో నివాసముంటున్న అబ్దుల్‌ సత్తార్‌(24) ప్రైవేటు ఉద్యోగి. పార్ట్‌టైమ్‌ జాబ్‌ కోసం వెతికే క్రమంలో ఈ-బే988 అనే వెబ్‌సైట్‌ను క్లిక్‌ చేయగా, అతడికి వాట్సాప్‌లో ఓ వ్యక్తి మెసేజ్‌ చేశాడు. రోజుకు గంటసేపు పనిచేస్తే రూ.500 నుంచి రూ.5వేల వరకు సంపాదించే అవకాశం ఉంటుందని నమ్మబలికాడు.

అతడి సూచనల మేరకు బాధితుడు ఫోన్‌ నంబర్లు, బ్యాంక్‌ ఖాతా వివరాలు అందజేశాడు. తమ సైట్‌లో ప్రొడక్ట్స్‌ కొని.. అమ్మితే కమీషన్‌ వస్తుందని చెప్పడంతో సత్తార్‌ అతడు సూచించిన ప్రొడక్ట్‌కు ఆర్డర్‌ ఇవ్వగానే రూ.10 కమీషన్‌ వచ్చింది. మరికొన్ని ప్రొడక్ట్స్‌ కొంటే మరింత కమీషన్‌ వస్తుందని చెప్పడంతో ఆర్డర్లు ఇచ్చాడు. సుమారు రూ. 69వేల నగదు ఈ-బే 988 అకౌంట్‌లో వేయగానే ఫ్రీజ్‌ అయింది. తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మీ ఇంటి కరెంట్‌ కనెక్షన్‌ కట్‌

అల్వాల్‌కు చెందిన చందులాల్‌(67)కు ‘మీ ఇంటికి సంబంధించిన విద్యుత్‌ బిల్లు అప్‌డేట్‌ కాలేదు…సరఫరాను నిలిపివేస్తున్నాం’ అంటూ ఓ వ్యక్తి సందేశం పం పాడు. కంగారుపడిన చందులాల్‌ ఆన్‌లైన్‌లో విద్యుత్‌ బిల్లును చెల్లించే ప్రయత్నం చేశాడు. అయితే ఓవర్‌ డ్యూ అని సమాధానం వచ్చింది. ఇంతలో ఆగంతకుడు ఫోన్‌ చేసి.. టీమ్‌ వ్యూయర్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే సమస్య పరిష్కారమవుతుందని చెప్పాడు. ఆ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేయగానే.. ఖాతా నుంచి దాదాపు రూ. 2.97 లక్షలు బదిలీ అయ్యాయి.

20 లక్షల రుణమంటూ..3.94 లక్షలు కాజేసి..

చౌటుప్పల్‌కు చెందిన అరిగె చిరంజీవి ఏప్రిల్‌లో ఫేస్‌బుక్‌లో టాటా క్యాపిటల్‌ ఫినాన్స్‌ లిమిటెడ్‌ పేరుతో ఓ ప్రకటనను చూశాడు. అందులో ఉండే నంబర్లను సంప్రదించగా, రూ. 20 లక్షల రుణం పొందే అర్హత ఉందని, ప్రాసెస్‌ చేయాలంటే ముందుగా ఫీజు చెల్లించి ..డాక్యుమెంట్లు వాట్సాప్‌లో పంపాలని ఆగంతకుడు చిరంజీవికి సూచించాడు. అలా బాధితుడి వద్ద మొత్తం రూ. 3.94 లక్షలు వసూలు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన సైబర్‌ క్రైం పోలీసులు..యూపీకి చెందిన వికాస్‌ దీక్షిత్‌ను సోమవారం అరెస్టు చేశారు. మరో నిందితుడు కన్హాశర్మ పరారీలో ఉండటంతో గాలిస్తున్నారు.

రూ. 5వేలకు తగ్గకుండా కొనండి

కుత్బుల్లాపూర్‌, సెప్టెంబర్‌ 13 : లక్కీ కస్టమర్‌ పేరుతో ఓ మహిళను సైబర్‌ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. జీడిమెట్ల పరిధిలోని మీనాక్షి ఎస్టేట్స్‌కు చెందిన ఓ మహిళకు ఈనెల 6న ఫోన్‌కాల్‌ వచ్చింది. నైకా కస్టమర్‌ నుంచి మాట్లాడుతున్నామని, లక్కీ లాటరీ కస్టమర్‌గా ఎంపికయ్యారని, ఏదైనా వస్తువును రూ.5 వేలకు తగ్గకుండా కొనుగోలు చేస్తే.. లాటరీకి అర్హులవుతారని పేర్కొన్నారు. బాధితురాలు ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారా వస్తువును ఎంపిక చేసుకొని రూ.5 వేలు పంపించింది. ఆ తర్వాత ఆగంతకులు మాయమాటలు చెప్పి.. ఖాతా నుంచి రూ. 65,053 కాజేశారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పేట్‌బషీరాబాద్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కెనడాలో ఉద్యోగాలు ఉన్నాయ్‌.. మీకు ఇష్టమైతేనే..

మల్లంపేట్‌కు చెందిన రాహుల్‌ ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. కెనడాలో పనిచేసేందుకు వర్క్‌ పర్మిట్‌ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే జూలైలో అతనికి ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెయిల్‌ వచ్చింది. ‘కెనడాలో ఉద్యోగాలు ఉన్నాయి.. మీకు ఇష్టమైతే.. మా వారిని సంప్రదించండ’ని ఆ దేశపు సీరిస్‌తో ఉండే ఫోన్‌ నంబర్లు, మెయిల్‌ అడ్రస్సులు ఇచ్చాడు. వారితో మాట్లాడిన రాహుల్‌.. కెనడాలో ఉద్యోగం చేసేందుకు సిద్ధపడి వారు చెప్పినట్లు అన్నింటికీ అంగీకరించి.. రూ. 6.66 లక్షలను వారి ఖాతాల్లో జమ చేశాడు. వారు ఫోన్లు ఎత్తకపోవడంతో ఢిల్లీకి వెళ్లి.. కెనడా రాయబార కార్యాలయంలో ఆరా తీశాడు. వారు అంతా ఫేక్‌ అని చెప్పడంతో దుండిగల్‌ పీఎస్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana