e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home క్రైమ్‌ నమ్మితే.. ఇలా మోసపోతారు..

నమ్మితే.. ఇలా మోసపోతారు..

నమ్మితే.. ఇలా మోసపోతారు..
  • వినియోగదారులు అత్యధికంగా జరిపే లావాదేవీలపై దృష్టి
  • సామాజిక మాధ్యమాలను వాడుతూ దోపిడీ
  • జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న పోలీసులు

సైబర్‌నేరగాళ్లు అమాయకులను ముంచేస్తున్నారు. మత్తుమత్తు మాటలతో బోల్తా కొట్టిస్తున్నారు. ముఖ్యంగా వినియోగదారులు ఎక్కువగా లావాదేవీలు జరిపై 16 అంశాలపై గురి పెట్టి వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా స్మార్ట్‌గా దోచేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అసలు సైబర్‌ నేరగాళ్లు వినియోగదారులను ఏ విషయాల్లో ఎలా బోల్తా కొట్టిస్తున్నారో ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న కథనం..

మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ ప్రకటనలపై..

“మీరు చేరి మరో ఇద్దర్ని చేర్పించండి. భారీగా లాభాలు పొందండి. మా దగ్గర చేరిన వారు కొద్ది నెలల్లోనే లక్షలు సంపాదించారు.” ఇలాంటి ప్రకటనలకు అమాయకులు సులభంగా బోల్తా పడి మోసపోతున్నారు.

వస్తువుల వాపస్‌ విషయంలో..

- Advertisement -

వివిధ వస్తువులు కొనుగోలు చేసినప్పుడు వాటి నాణ్యత, డెలివరీ విషయాలపై అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు వినియోగదారులు ఆన్‌లైన్‌లో పలు కంపెనీల కస్టమర్‌ కేర్‌ నంబర్ల కోసం వెతకడం సహజం. ముఖ్యంగా నాణ్యతలేని వస్తువులను తిరిగి వాపస్‌ చేసే విషయంలో కంపెనీ నంబర్లకు కాకుండా సైబర్‌ నేరగాళ్లు పొందుపర్చిన నంబర్లకు వినియోగదారులు ఫోన్‌ చేస్తున్నారు. వారు అడిగిన వివరాలను వెనుకాముందూ ఆలోచించకుండానే ఇచ్చేస్తుండటంతో వారు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.

నచ్చిందంటూ మాయ..

స్థలం కొనుగోలు, ఇంటిని అద్దెకిస్తామంటూ ఆన్‌లైన్‌లో ఇస్తున్న ప్రకటనలపై గుర్తు తెలియని వ్యక్తులు నేరుగా స్థలం, గృహం చూడకుండా నచ్చిందని చెబుతున్నారు. అడ్వాన్స్‌ ఇస్తామని అకౌంట్‌ వివరాలు అడుగుతూ మాయ చేస్తున్నారు.

గడువు ముగిసిందంటూ..

డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల గడువు ముగిసిందంటూ అప్‌డేట్‌ చేసుకోకపోతే కార్డు సేవలు ఆగిపోతాయని ఫోన్లు చేసి బెదిరిస్తారు. ఇది నిజమని నమ్మితే ఇక గోవిందా.

ఇంటి నుంచే పని అంటూ..

తాజా పరిస్థితుల్లో ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని సైబర్‌ నేరగాళ్లు ఇంట్లో కూర్చొని రోజుకు వేలాది రూపాయలు సంపాదించవచ్చని ఆన్‌లైన్‌, ఫోన్‌లో ప్రకటనలు ఇస్తున్నారు. ఇది నిజమేనని నమ్మిన కొందరు లక్షలు వదిలించుకుంటున్నారు.

నంబర్ల కోసం వెతికామా..

గూగుల్‌లో ఏ కంపెనీ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసమైనా వెతికితే అంతకు ముందే తిష్ఠ వేసుకొని కూర్చున్న సైబర్‌ నేరగాళ్లు వెంటనే ఫోన్‌ చేసి ఏం సేవలు కావాలంటూ అడుగుతున్నారు. మాటలతో మభ్య పెట్టి బ్యాంకు ఖాతా వివరాలు సేకరించి నిమిషాల్లో నగదు దోచేస్తున్నారు.

అప్‌డేట్‌ పేరు చెప్పి..

బ్యాంకు ఖాతాలు, మొబైల్‌ నంబర్లకు కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాంటూ సైబర్‌ నేరగాళ్లు వినియోగదారులకు ఫోన్లు చేస్తున్నారు. నిర్ణీత గడువు లోగా ఇది చేయకపోతే సేవలు నిలిచిపోతాయని అయోమయానికి గురి చేస్తున్నారు. కేవైసీ అప్‌డేట్‌ చేస్తామంటూ మాటల్లో దింపి ఖాతా వివరాలు తెలుసుకుంటున్నారు. ఇంకేముంది నిమిషాల్లో ఖాతా ఖాళీ చేసి పడేస్తున్నారు.

తియ్యగా పలకరించి..

ఇటీవల కొంతమంది అమ్మాయిలు ఫోన్లు చేస్తూ తియ్యగా పలుకరిస్తున్నారు. ఆ తర్వాత నగ్నంగా దర్శనమిస్తూ అవతలి వ్యక్తులను వివస్ర్తులుగా చేసి ఆ వీడియోను రికార్డ్‌ చేస్తున్నారు. అనంతరం అలా తీసిన వీడియోను వారికే పంపి బ్లాక్‌ మెయిల్‌కు దిగుతున్నారు.

పెట్టుబడికి మూడింతల లాభమంటూ..

తాము సూచించిన పథకాల్లో పెట్టుబడులు పెడితే మూడింతల లాభమంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఏకంగా వర్చువల్‌ రూపంలో లాభాలను చూపిస్తున్నారు. కానీ విత్‌డ్రా ఆప్షన్‌ తొలగిస్తున్నారు. చిన్న పెట్టుబడికి పెద్ద లాభం చూపుతూ.. పెట్టుబడి పెట్టగానే ఏకంగా ఫోన్లు స్విచ్చాఫ్‌ చేసుకొని పరారవుతున్నారు.

క్లిక్‌ చేయమంటూ..

ఐదు కోట్ల విలువైన లాటరీ తగిలింది. ఈ సొత్తు పొందాలనుకుంటే వెంటనే ఈ నంబర్‌కు వాట్సాప్‌ కాల్‌ చేయండి లేదంటే లింక్‌ ఓపెన్‌ చేసి వివరాలు నింపితే 48 గంటల్లో లాటరీ సొమ్ము ఖాతాలో జమ అవుతుందంటూ బురిడీ కొట్టిస్తారు.

ఉద్యోగం ఇప్పిస్తామని..

భారీ ప్యాకేజీలతో పాటు విదేశాల్లో ఉద్యోగాలని నిరుద్యోగులకు ఎర వేస్తున్నారు. బ్యాక్‌ డోర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ప్రాసెసింగ్‌ ఫీజు పేరుతో లక్షలు గుంజుతున్నారు.

పెండ్లి పేరుతో పరిచయం..

వివాహాలకు సంబధించిన ప్రొఫైల్స్‌ చూస్తున్న సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ నంబర్లు సేకరించి వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం పెంచుకుంటున్నారు. పెండ్లి చేసుకుందామని నమ్మిస్తున్నారు. భారీ గిఫ్ట్‌లు పంపించామని ఫోన్‌ చేస్తున్నారు. ఆ తర్వాత కస్టమ్స్‌ పేరుతో బెదిరించి అమాయక మహిళల నుంచి లక్షలు దండుకుంటున్నారు.

మత్తుమత్తు మాటలతో..

అమాయకులను ట్రాప్‌లో లాగడానికి సైబర్‌ నేరగాళ్లు రోమాన్స్‌ను అస్త్రంగా వాడుకుంటున్నారు. ముందుగా అందమైన యువతి డీపీతో ఉన్న నెంబర్‌తో పలకరించి సెక్స్‌ చాట్‌ చేస్తారు. వాటిని సోషల్‌ మీడియాలో పెడుతామని బెదిరించి మరీ డబ్బులు లాగుతున్నారు.

స్కాన్‌ చేయమంటూ..

చెల్లింపుల కోసం క్యూ ఆర్‌ కోడ్‌ను పంపుతున్న సైబర్‌ నేరగాళ్లు స్కాన్‌ చేసి రూపాయి పంపమని అడుగుతున్నారు. ఇది నిజమని నమ్మి స్కాన్‌ చేస్తే యూపీఐ పిన్‌ నంబర్‌తో పాటు ఇతర వివరాలు వారికి తెలిసిపోతున్నాయి.

డిస్కౌంట్ల ఆశ చూపి..

పలు ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌లలో ఆకర్షణీయమైన ప్రకటనలు సైబర్‌ నేరగాళ్లు గుప్పిస్తున్నారు. ఆకర్షితులవుతున్న సామాన్యులు వాటిని బుక్‌ చేసుకొని డెలివరీకి ముందే నగదు చెల్లించి బోల్తా పడుతున్నారు.

ఈ- మెయిల్స్‌ పంపుతూ..

పలు సంస్థలకు సంబంధించిన ఈ- మెయిల్స్‌ను ఓ అక్షరం తేడాతో ఇతర కంపెనీలకు పంపుతారు. ఇది నిజమేనని నమ్మిన కంపెనీలు ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నాయి. ఇంకేముంది కంపెనీల ఖాతాలకు వెళ్లాల్సిన నగదు సరాసరి సైబర్‌ నేరగాళ్లకు అందుతున్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నమ్మితే.. ఇలా మోసపోతారు..
నమ్మితే.. ఇలా మోసపోతారు..
నమ్మితే.. ఇలా మోసపోతారు..

ట్రెండింగ్‌

Advertisement