e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home హైదరాబాద్‌ బలహీనత, అమాయకత్వమే ఆసరాగా వంచన

బలహీనత, అమాయకత్వమే ఆసరాగా వంచన

బలహీనత, అమాయకత్వమే ఆసరాగా వంచన
 • ఇన్సూరెన్స్‌, పెట్టుబడులు, కస్టమర్‌ కేర్‌ అంటూ మోసాలు
 • అమ్మాయిలతో డేటింగ్‌ అంటూ చీటింగ్‌
 • బాధితుల్లో అత్యధికులు విద్యావంతులు, ఉద్యోగులే

క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డు బ్లాక్‌ అవుతుంది.. కేవైసీ అప్‌డేట్‌ చేయాలంటూ ఓటీపీ చెప్పమంటారు. నిజమేనని చెప్పగానే క్షణాల్లో బ్యాంకు ఖాతాలో డబ్బు మాయమవుతుంది. మేము ఆర్మీ అధికారులం. తక్కువ ధరకే వస్తువులు ఇస్తాం. కావాలంటే గూగుల్‌ పే, ఫోన్‌పే చేయండి అంటూ ఆర్మీ సెంటిమెంట్‌ చూపించి వంచన. మీకు అమ్మాయితో పరిచయం కావాలని ఉందా? ఏకాంతంగా గడపాలని ఉందా? అని మెస్సేజ్‌లు వస్తుంటాయి. వెంటనే స్పందించి ఫోన్లు చేస్తే తొలుత రిజిస్ట్రేషన్‌ ఫీజు, ఆ తర్వాత అమ్మాయిలతో మాట్లాడించి అందినకాడికి లాగేస్తుంటారు. ఉచితం, తక్కువ ధరలు, గిఫ్ట్‌ల పేరుతో ఆగడాలు అప్‌డేట్‌, లాటరీ అంటూ డబ్బు మాయం సాంకేతికత అనూహ్యంగా పెరగడంతో అదేస్థాయిలో సైబర్‌ మోసాలు పెచ్చరిల్లుతున్నాయి. అమాయకత్వం, అత్యాశ, పక్కవారితో చర్చించకపోవడం, సులువుగా వస్తుందనే ధోరణి, సెంటిమెంట్లు గుడ్డిగా నమ్మి సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కి విలవిలలాడుతున్నారు. ఏదీ కష్టపడకుండా రాదనే విషయాన్ని విస్మరించి అతి సులువుగా మోసపోతున్నారు. ఇలా మోసపోయి, జేబులు గుల్ల చేసుకుంటున్న వారిలో యువతతోపాటు ఉన్నత విద్యావంతులు, ఉద్యోగులు ఉంటుండడం సైబర్‌ నేరాల పెరుగుదలకు పరాకాష్ట. ఏదీ ఊరికే రాదు.. కష్టపడకుండా డబ్బు వస్తుందనే ఆశ నుంచి బయటపడ డం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

సాంకేతికత ఏ స్థాయిలో పెరిగిందో.. దానిని ఆధారం చేసుకొని అదే రీతిలో నేరాల సంఖ్య సైతం రెట్టింపవుతున్నది. కొంచెం కంప్యూటర్‌ పరిజ్ఞానం..మాయమాటలతో కూర్చున్న చోట నుంచే అంతర్జాల ఆగంతకులు కోట్లు కొల్లగొడుతూ.. ఖాతాలు సున్నా చేస్తున్నారు. ఇందులో బాధితుల పొరపాట్లే ఎక్కువ ఉంటున్నాయి. అందులోనూ చదువుకున్న వాళ్లే మోసపోవడం దిగ్భ్రాంతి పరిచే అంశమే. అవగాహన లోపంతో కొందరు.. అత్యాశకు పోయి మరికొందరు..సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కుకొని తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే మనం కాస్త అప్రమత్తతతో వ్యవహరిస్తే..మోసాన్ని గ్రహించవచ్చు. కేటుగాళ్ల వలలో పడకుండా.. తప్పించుకోవచ్చు. ముప్పును చాకచక్యంతో ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన విధానాలు ఏమిటో తెలుసుకుందాం

ఓటీపీ అడిగారా..?

 • బ్యాంకు అధికారులమని, మీ డెబిట్‌ కార్డు త్వరలో బ్లాక్‌ అవుతుందని, కేవైసీ అప్‌డేట్‌ చేయాలని ఫోన్లు చేస్తారు.
 • బ్యాంకు అధికారులు అనే సరికి చాలా మంది నమ్మి అడిగిన సమాచారం ఇస్తారు.
 • కార్డు వివరాలు తీసుకున్నాక.. బాధితుల సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీని తమకు చెప్పాలని సూచిస్తారు.

ఎవరితో షేర్‌ చేయవద్దు

బ్యాంకింగ్‌ అధికారులెవరూ.. ఫోన్‌ చేసి మీ వివరాలు అడుగరు. అలా ఎవరైనా చేశారంటే.. బ్యాంకుకు వచ్చి చెబుతామంటూ.. కాల్‌ కట్‌ చేయాలి. ఓటీపీ అనేది సీక్రెట్‌గా ఉండాల్సింది. అలాంటిది ఫోన్‌లో అడిగే వారికి ఎలా చెబుతారు. ఓటీపీ చెప్పేస్తే..డబ్బు సైబర్‌నేరగాళ్ల చేతిలోకి వెళ్తుంది. ఒకవేళ మోసపోతే బ్యాంకు కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసి, కార్డు బ్లాక్‌ చేయించి, సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

ఇవి..డౌన్‌లోడ్‌ అస్సలు చేయకండి..

 • కేవైసీ అప్‌డేట్‌ చేయాలి, బ్యాంకు అధికారులమంటూ ఫోన్లు చేస్తుంటారు.
 • కేవైసీ అప్‌డేట్‌కు సాయం చేస్తామంటూ.. ఎనీడెస్క్‌, క్విక్‌ సపోర్టు వంటి యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయిస్తారు.
 • ఆ ప్రక్రియ పూర్తయ్యాక ఒక కోడ్‌ వస్తుంది. దానిని తమకు చెప్పాలని అడుగుతారు.
 • అవగాహన లేకపోవడంతో చాలా మంది కోడ్‌ను చెప్పేస్తుంటారు.
 • ఆ తర్వాత రిమోట్‌ యాప్‌తో సైబర్‌నేరగాళ్లు మన సెల్‌ఫోన్‌ను నియంత్రణలోకి తీసుకుంటారు.
 • ఆ యాప్‌లతో మన చేతిలో ఉండే సెల్‌ఫోన్‌ను ఎక్కడి నుంచైనా.. ఆపరేట్‌ చేసేందుకు వీలుంటుంది.
 • బ్యాంకింగ్‌ లావాదేవీలు చేయిస్తారు. మన ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ వివరాలు తీసుకొని ఖాతాలు ఖాళీ చేస్తారు.

కోడ్‌ చెప్పకండి..

గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి మీ ఫోన్‌లో ఫలానా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోమని చెప్పారంటే అది మోసమని అనుమానించాలి. రిమోట్‌ యాప్‌లను ఉపయోగించి మీ ఖాతాలు ఖాళీ చేశారంటే ..వెంటనే బ్యాంకుకు ఫోన్‌ చేసి ఖాతాను స్తంభింప చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

ఉద్యోగం కోసం డబ్బులడిగారా..!

 • కొందరు ఇంటర్‌నెట్‌లో జాబ్స్‌ కోసం వెతుకుతూ వివిధ ప్రకటనలు క్లిక్‌ చేస్తూ, వివరాలు పొందుపరుస్తుంటారు. అలా డేటా సైబర్‌నేరగాళ్ల చేతికి చిక్కుతుంది.
 • మీకు జాబ్‌ కావాలా? ఫలానా చోట ఉద్యోగం ఉందంటూ నమ్మించి మీ దగ్గర రిజిస్ట్రేషన్‌ ఫీజుల నుంచి మొదలు పెట్టి అందిన కాడికి లాగేస్తారు.
 • ఫేక్‌ ఇంటర్వ్యూలు, ఫేక్‌ అపాయింట్‌మెంట్‌ లెటర్లు పంపించి చీటింగ్‌ చేస్తుంటారు.

కష్డపడితేనే ఉద్యోగాలు

బ్యాక్‌డోర్‌ నుంచి ఉద్యోగాలు సంపాదించాలనుకుంటే అది ఎప్పటికైనా ప్రమాదమనే విషయాన్ని గుర్తించాలి. జాబ్‌ పోర్టల్స్‌ తమ డేటాను జాబ్‌ కన్సల్టెన్సీలకు విక్రయిస్తుంటాయి. అవి ఇంటర్వ్యూలు చేసి ఉచితంగా ఉద్యోగాలు ఇప్పిస్తుంటాయి. ఇది చేసినందుకు ఆయా కన్సల్టెన్సీలకు, జాబ్‌ ఇచ్చిన సంస్థలు కమీషన్‌ ఇస్తాయి. టాలెంట్‌ ఉన్న మానవ వనరులను ఆయా సంస్థలకు ఇవ్వడం కన్సల్టెన్సీల పని. కానీ ఉద్యోగం ఇప్పిస్తామంటూ ముందుగా డబ్బులు వసూలు చేసే వారు మోసం చేసే వారేనని గుర్తించుకోండి.

గూగుల్‌లో వెతికేటప్పుడు జాగ్రత్త

 • డిజిటల్‌ పేమెంట్స్‌, వస్తువు కొనుగోళ్లు, అమ్మకాల్లో ఏదైనా సమస్య వస్తే..ఆయా సంస్థలకు సంబంధించిన కస్టమర్‌ కేర్‌కు ఫిర్యాదు చేయడం, అనుమానాన్ని నివృత్తి చేసుకోవడం సహజంగా నడిచే ప్రక్రియ.
 • ఇప్పుడు ఇదే సైబర్‌నేరగాళ్లకు వరంగా మారింది. మార్కెట్‌లో నడిచే అన్ని సంస్థల పేరుతో నకిలీ కస్టమర్‌ నంబర్లను గూగుల్‌లో అందుబాటులో ఉంచుతున్నారు.
 • ఇంటర్‌నెట్‌పై అంతగా పట్టులేని వారు గూగుల్‌ సెర్చ్‌ చేసి, నకిలీ కస్టమర్‌ కేర్‌ నంబర్లకు ఫోన్‌ చేసి నేరగాళ్ల చేతికి చిక్కుతున్నారు.
 • తాము కస్టమర్‌ కేర్‌ ప్రతినిధులమంటూ మాట్లాడి, మీ సమస్యను పరిష్కరిస్తాం.. ఫారాన్ని నింపండి.. గూగుల్‌ డాక్స్‌, మీ సెల్‌ఫోన్‌లో రిమోట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి. మీ గూగుల్‌ పే నుంచి రూ. 10 మాకు పంపించండి. మీకు రావాల్సిన డబ్బులను చెల్లిస్తామని.. నమ్మిస్తుంటారు. ఖాతా వివరాలు తీసుకొని డబ్బులు కాజేస్తారు.

నిర్ధారించుకోవాలి..

కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసే సమయంలో మనం చేస్తున్న నంబర్‌ నిజమైందా? కాదా? అని నిర్ధారించుకోవాలి. ప్రతి కంపెనీ, ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ ఫామ్స్‌ కాంటాక్టు నంబర్లు, ఆయా సంస్థల కస్టమర్‌ కేర్‌ నంబర్లు వాళ్ల తమ వెబ్‌సైట్లలో ఉంచుతారు. దానిని పరిశీలించుకోవాలి. తెలియకపోతే తెలిసిన వారిని అడిగి తెలుసుకోవడం మంచిది.

పెట్టుబడుల పేరుతో..

 • ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సెల్‌ఫోన్‌కు వచ్చే మెసేజ్‌లు, ఇంటర్‌నెట్‌లో వచ్చే ఇతర ప్రకటనల్లో మీరు పెట్టుబడి పెడితే.. రెట్టింపు ఆదాయం ఇస్తామంటూ ఆకర్శిస్తారు.
 • ముందుగా తక్కువ డబ్బును డిపాజిట్‌ చేయండి, మీకు లాభాలు చూపిస్తామంటూ నమ్మిస్తారు.
 • తక్కువ పెట్టుబడి పెట్టగానే కొన్ని సందర్భాల్లో దానికి రెట్టింపు మొత్తాన్ని మీ ఖాతాలోకి పంపిస్తారు.
 • నమ్మకం కుదరగానే ఎక్కువ పెట్టుబడి బాధితులు పెట్టడం.. తరువాత నేరగాళ్లు బిచాణా ఎత్తేయడం జరిగిపోతుంది.

ప్రకటనలు చూసి..

ఎక్కడ కూడా అసాధారణ లాభాలు రావు. కష్టపడితేనే లాభాలు వస్తాయి. ఇంటర్‌నెట్‌లో ముక్కు ముఖం తెలియని వాళ్లు వేసే ప్రకటనలు చూసి గుడ్డిగా నమ్మవద్దు. ఎక్కడైనా పెట్టుబడి పెడుతున్నారంటే ముందుగా ఏ కంపెనీలో పెడుతున్నారు? ఏ కంపెనీ షేర్స్‌కొంటున్నారు.. అనే విషయాలను పరిశీలించుకోవాలి.

అమ్ముతాం.. కొంటాం..

 • ఓఎల్‌ఎక్స్‌, క్వికర్‌, ఫేస్‌బుక్‌ వంటి ఆన్‌లైన్‌ ప్లాట్‌ ఫామ్స్‌లో వివిధ వస్తువులు అమ్మకానికి, కొనడానికి ప్రకటనలు ఇస్తుంటారు.
 • సైబర్‌నేరగాళ్లు సైతం వస్తువులను అమ్మకానికి, లేదంటే కొనడానికి ముందుకు వస్తారు. తాము ఆర్మీ అధికారులమంటూ నమ్మిస్తారు.
 • గూగుల్‌ లేదా ఫోన్‌ పే ద్వారా డబ్బులు పంపిస్తామని, ముందు టెస్టింగ్‌ కోసం రూ.10 మాకు పంపించాలంటూ.. కోరుతారు.
 • అడిగిన మొత్తాన్ని పంపియగానే.. అవతలి వైపు నుంచి రూ. 20 వెంటనే బాధితులకు పంపిస్తారు.
 • క్యూఆర్‌ కోడ్‌తో ఈ లావాదేవీలు జరుపుతారు. ఆ కోడ్‌లో రూ. 10 వేలు పే అని రాసి ఉంటుంది. బాధితుడు దానిని చూసుకోకుండా యాక్సెప్ట్‌ చేస్తే.. ఖాతా నుంచి డబ్బు వెళ్లిపోతుంది.
 • పొరపాటున మీ డబ్బు మాకు వచ్చింది. తిరిగి పంపిస్తున్నామంటూ నమ్మించి, మరోసారి క్యూఆర్‌ కోడ్‌లో రూ. 20 వేలు పంపిస్తారు.
 • బాధితుడు ఓకే చేయగానే మరోసారి ఖాతాలోంచి డబ్బు నేరస్తుల అకౌంట్‌లోకి వెళ్లిపోతాయి.

అత్యాశతోనే…

అమ్మకాలు, కొనుగోళ్ల విషయంలో సైబర్‌నేరగాళ్లు బాధితుల అత్యాశ, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మోసం చేస్తున్నారు. ప్రకటన రాగానే వస్తువు ఎక్కడుంది, వాహనం అయితే దాని నంబర్‌ ఏమిటీ అనేది పరిశీలన చేయకుండానే భేరం చేస్తుంటారు. వస్తువును చూసిన తరువాత, దానిని అమ్మే వ్యక్తి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడో నిర్ధారించుకున్న తరువాతే ఆర్థికపరమైన లావాదేవీలు చేయాలి. ఎక్కువగా రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లాలో ఇలాంటి మోసాలు చేసే ముఠాలు ఉన్నాయి. క్యూఆర్‌ కోడ్‌ పంపించే సమయంలో డబ్బు చెల్లిస్తున్నామా? మన ఖాతాలో డిపాజిట్‌ అవుతున్నదా? అనే విషయాన్ని పరిశీలించుకోవాలి.

నకిలీ డీపీలతో..

 • వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫామ్స్‌ల్లో బాధితుల ఫొటోలతో నకిలీ ఖాతాలు తెరుస్తారు.
 • ఫొటోలు బాధితులవి పెట్టి వారి సర్కిళ్లలో ఉన్న వారికి తమకు అత్యవసరంగా డబ్బు కావాలంటూ మెసేజ్‌లు పెడుతుంటారు.
 • ఎక్కువగా ఫేస్‌బుక్‌తో నకిలీ ఖాతాలు తెరిచి.. వాట్సాప్‌లో కొత్త నంబర్‌ను ఉపయోగించి బాధితుల డీపీని వాడుతుంటారు.

చెక్‌ చేసుకోవాలి..

తమ స్నేహితుడు ఆపదలో ఉన్నాడని.. డబ్బులు కావాలని నకిలీ ఖాతాల ద్వారా నేరగాళ్లు వల వేస్తారు. అలాంటప్పుడు స్నేహితుడికి ఫోన్‌ చేసి నీ పేరుతో ఇలా వచ్చింది, నిజమా? కాదా? అని నిర్ధారించుకోవాలి. అలా చేయడంతో స్నేహితుడికి కూడా తన పేరుతో నకిలీ ఖాతాలు ఉన్నాయనే విషయం తెలుస్తుంది. ఇతరులను అప్రమత్తం చేస్తాడు.

బ్లాక్‌ మెయిలింగ్‌..

ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లలో నకిలీ ఖాతాలు తెరిచి యువతులను కొందరు బ్లాక్‌మెయిల్‌ చేస్తుంటారు. ఎక్కువగా తెలిసిన వారే ఇలాంటి పనులు చేస్తుంటారు. ఆ సమయంలో వెంటనే బాధితులు సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అమ్మాయిగా చెప్పుకునే సైబర్‌నేరగాళ్లు అర్ధనగ్నంగా, నగ్నంగా చాటింగ్‌ చేసినట్లు వీడియోలు చూపిస్తారు. బాధితుడు కూడా అలాగే చేయగానే వీడియోలు తీస్తారు. వాటిని సోషల్‌మీడియాలో పెడుతామంటూ బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తారు.

భయపడొద్దు..

తెలిసిన వారు బ్లాక్‌మెయిలింగ్‌ చేస్తే అది వాళ్లు ఇతర కారణాలతో చేస్తున్నారనే విషయం స్పష్టమవుతుంది. సైబర్‌నేరగాళ్లు చేసే బ్లాక్‌మెయిలింగ్‌లో ఆర్థిక ప్రయోజనాలు ఒక్కటే ఉంటాయి. వారు డబ్బులు ఇచ్చే వాళ్లు ఎవరు అనే విషయాన్ని గుర్తిస్తారు. ఒక్కసారి భయపడ్డారంటే అందిన కాడికి లాగేసేందుకు ప్రయత్నిస్తుంటారు. పరువుతో కూడుకున్న విషయం కావడంతో కొందరు భయపడి నేరగాళ్లకు డబ్బులు ఇస్తుంటారు. బెదిరింపులకు భయపడకుండా పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయాలి.

దొంగ మెయిల్స్‌

 • కొన్ని సంస్థలు భారీ స్థాయి ఆర్థిక వ్యవహారాలు జరుపుతుంటాయి. ఈ మెయిల్స్‌తో ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహిస్తుంటారు. వీటిని సైబర్‌నేరగాళ్లు పరిశీలిస్తుంటారు.
 • డబ్బులు చెల్లించే సంస్థకు, డబ్బులు పొందే సంస్థ నుంచి ఈ -మెయిల్‌ పంపినట్లు ఒక నకిలీ ఈ-మెయిల్‌ను పంపిస్తారు.
 • నకిలీ ఈ-మెయిల్‌ తరచూ ఆ రెండు సంస్థలు ఉపయోగించే ఈ-మెయిల్‌ మాదిరిగానే ఉంటుంది. ఒక అక్షరం తేడాతో ఉంటుంది.
 • అత్యవసరంగా పని ఉందని, పాత ఖాతా పనిచేయడం లేదు, వెంటనే ఫలానా ఖాతాకు డబ్బులు పంపించాలని ఉంటుంది. ఆయా సంస్థల నిర్వాహకులు వాటిని పరిశీలించుకుండానే డబ్బులు డిపాజిట్‌ చేసేస్తుంటారు.
 • ఒక్కసారి పరిశీలించాలి
 • ఫిషింగ్‌ మెయిల్స్‌ రెండు సంస్థల మధ్య, యజమానికి ఆయా సంస్థ అకౌంటెంట్లకు, స్నేహితులకు, బంధువులకు ఇలా ఎవరికైనా ఆయా పరిస్థితులను బట్టి నేరగాళ్లు పంపిస్తుంటారు. అయితే ఈ-మెయిల్స్‌ ఎక్కడి నుంచి వచ్చింది, అందులో ఉన్న ఖాతా ఎక్కడిదనే విషయాన్ని ఒక్కసారి పరిశీలించాలి. డబ్బు డిపాజిట్‌ చేసే ముందు ఎవరికైతే డబ్బు పంపిస్తున్నామో, వాళ్లకు ఫోన్‌ చేసి నిర్ధారణ చేసుకున్న తరువాతే ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలి.

వైరస్‌ పంపించి..హ్యాక్‌ చేస్తారు..

 • మన కంప్యూటర్స్‌ను సైబర్‌నేరగాళ్లు హ్యాక్‌ చేస్తారు.
 • వైరస్‌ను పంపించి, కంప్యూటర్లను తమ చేతిలోకి తీసుకుంటారు.
 • కంప్యూటర్‌ ఆన్‌ కావాలంటే మాకు కొంత డబ్బు కావాలి, బిట్‌కాయిన్లలో కావాలంటూ బెదిరిస్తుంటారు.
 • ఈ-మెయిల్స్‌, ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ ఖాతాలను సైబర్‌నేరగాళ్లు హ్యాక్‌ చేస్తుంటారు.
 • ఈ- మెయిల్స్‌తో ఫిషింగ్‌ మెయిల్స్‌, ఇంటర్‌నెట్‌ బ్యాంక్‌ ఖాతాలోకి చొరబడి కొత్తగా బెనిఫిషియరీస్‌ను జత చేస్తారు.
 • ఆ తరువాత బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు లాగేస్తారు.

యాంటీ వైరస్‌ పటిష్టంగా ఉండాలి

కంప్యూటర్లలో వైరస్‌ చొరబడకుండా ఉండాలంటే యాంటీ వైరస్‌లు పటిష్టంగా ఉండాలి. కంప్యూటర్‌లో ఉపయోగించే పాస్‌వర్డ్‌ బలంగా ఉండి, వాటిని తరచూ మారుస్తుండాలి. ర్యాన్సమ్‌ వేర్‌ అటాక్స్‌కు బెదిరిపోకూడదు. సైబర్‌నేరగాళ్లు ఎక్కువగా డబ్బు వచ్చే దగ్గరే సమయాన్ని వెచ్చిస్తారు. మనం డబ్బు ఇవ్వమని తెలిస్తే పట్టించుకోరు. ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ను కూడా ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి.

ఫోన్లలో క్లెయిమ్స్‌ కావు..

 • కొందరు ఎప్పుడో ఇన్సూరెన్స్‌ పాలసీ చేసి వాటిని వదిలపెట్టి ఉంటారు.
 • ఆ వివరాలతో తాము ఫలానా ఇన్సూరెన్స్‌ సంస్థ నుంచి మాట్లాతున్నామంటూ సైబర్‌ నేరగాళ్లు మాటలు కలుపుతారు.
 • మీ పాత పాలసీలను క్లెయిమ్‌ చేసుకుంటే భారీగా డబ్బులు వస్తుందంటారు.
 • పాలసీలు క్లెయిమ్‌ చేసుకోవాలంటే.. ప్రభుత్వానికి పన్నులు చెల్లించాలంటూ దోపిడీ మొదలు పెడుతారు. మీ క్లెయిమ్స్‌ రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షలకు పెరిగిపోయాయి. దానికి ట్యాక్స్‌లు పెరిగిపోతాయని నమ్మించి బాధితుల వద్ద నుంచి లక్షలు లాగేస్తారు.
 • చెల్లించే ప్రతి పైసా మీకు తిరిగి వస్తుందంటూ నమ్మకాన్ని కలిగిస్తారు.

కస్టమర్‌ కేర్‌ను సంప్రదించాలి..

ఫోన్లు చేసి మీ పాలసీలు క్లెయిమ్‌ చేసుకోవాలంటూ.. నమ్మించే వారి నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా సీనియర్‌ సిటిజన్స్‌ను మోసగాళ్లు లక్ష్యంగా చేసుకుంటారు. వాళ్లు ఎక్కువగా బ్యాంకులకు, ఇన్సూరెన్స్‌ సంస్థలకు తిరగలేరు, వృద్ధాప్యంలో డబ్బులు వస్తాయనే ఆశను నేరగాళ్లు క్యాష్‌ చేసుకుంటున్నారు. బీమా సంస్థల నుంచి ఫోన్‌ వచ్చిందంటే ఆయా సంస్థలకు సంబంధించిన కస్టమర్‌ కేర్‌, బ్రాంచ్‌ నంబర్లకు ఫోన్‌ చేసి వివరాలు అడగాలి.

పెళ్లి చేసుకుందాం..రా!

 • మ్యారేజ్‌ బ్యూరోల్లో సైబర్‌నేరగాళ్లు తమ ప్రొఫైల్స్‌ను అప్‌లోడ్‌ చేస్తుంటారు. వయసు ఎక్కువగా ఉండి, పెండ్లి కాని మహిళలను లక్ష్యంగా చేసుకుంటారు.
 • పెండ్లి పేరుతో దగ్గరై మాటలు కలుపుతారు. విదేశాల నుంచి వస్తున్నామని, విలువైన గిఫ్ట్‌లు పంపిస్తామంటూ.. నమ్మిస్తారు.
 • గిప్ట్‌లు కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారంటూ.. విడిపించేందుకు పన్నులు కట్టాలని బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తారు.
 • గమనించాలి..
 • మాటలతో మాయ చేస్తున్నారనే విషయాన్ని గమనించాలి. కస్టమ్స్‌ అధికారులు పట్టుకుంటే.. నేరుగా వెళ్లి మొత్తాన్ని చెల్లించాలి. డబ్బు డిపాజిట్‌ చేయమని చెప్పే బ్యాంకు ఖాతా ఎక్కడిదో గుర్తించాలి.

లాటరీ పేరుతో లూటీ..

రూ. 25 లక్షల లాటరీ వచ్చింది.. క్లెయిమ్‌ చేసుకోవాలంటే ప్రభుత్వానికి పన్నులు చెల్లించాలంటూ బురిడీ కొట్టిస్తారు. ఒకటేమిటి వివిధ రకాలైన లాటరీలు వచ్చాయంటూ.. సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు, ఈ-మెయిల్స్‌ పంపిస్తారు. వాటికి స్పందించి ఫోన్లు చేస్తే.. ఆన్‌లైన్‌ సైట్‌లో షాపింగ్‌ చేశారు. ఆ సంస్థ లాటరీ తీయడంతో ప్రైజ్‌ వచ్చిందని నమ్మిస్తారు.

స్పందించవద్దు..

వెయ్యి రూపాయల షాపింగ్‌ చేస్తే రూ. 25 లక్షల లాటరీ వచ్చిందంటే గుడ్డిగా నమ్మేవాళ్లున్నారు. లాటరీలు లేవనే విషయాన్ని నమ్మాలి. అలాంటి మెసేజ్‌లకు స్పందించకుండా ఉండటం మంచిది.

కష్టపడకుండా డబ్బులు రావు..

అత్యాశ, అమాయకత్వమే సైబర్‌నేరగాళ్లకు కలిసి వస్తున్నాయి. సైబర్‌మోసాలు చేసే వారు తెలియవైన వారు కాదు. ఎక్కువగా చదువుకున్న వాళ్ల్లే బాధితులుగా ఉంటున్నారు. అయినా మోసానికి గురవుతున్నారు. డబ్బు వస్తుందంటే అత్యాశకు పోయి తాము ఏం చేస్తున్నామనే విషయాన్ని కనీసం కుటుంబసభ్యులతోనూ షేర్‌ చేసుకోని వారుంటున్నారు. ఆర్థికపరమైన లావాదేవీలు జరిపే సమయంలో ఒకసారి కుటుంబసభ్యులతో చర్చించడం మంచిది. కష్టపడకుండా డబ్బులు రావు. ఈజీ మనీ కోసం ఆశపడి కష్టపడింది పొగొట్టుకోవద్దు. – కేవీఎం ప్రసాద్‌, ఏసీపీ,హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్స్

అవగాహనతో అధిగమించు..

సైబర్‌నేరాలను అవగాహనతో అధిగమించవచ్చు. గిప్ట్‌లు, ఇన్సూరెన్స్‌, చారిటీ, అయిల్స్‌, పెట్టుబడుల పేరుతో వచ్చే ఆఫర్లు ఎంత వరకు నిజం అనేది ఆలోచించాలి. దానిపై తెలిసినవారితో చర్చించుకోవాలి. గుడ్డిగా నమ్మేసి సైబర్‌నేరగాళ్లు చెప్పే మాటలతో మోసపోవద్దు. ఇతరులకు తెలిస్తే నాకు వచ్చే లాభం పోతుందేమో, భారీగా లాభాలు వచ్చిన తరువాత అందరికీ చెప్పాలనే ధోరణిలో ఉంటారు. ఆ ధోరిణి నుంచి బయటకు వచ్చి ఆలోచించాలి. ఏదీ కూడా ఊరికేరాదు, కష్టపడకుండా డబ్బు వస్తుందనే ఆశ నుంచి బయటపడాలి. – హరినాథ్‌, ఏసీపీ, రాచకొండ సైబర్‌క్రైమ్స్

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బలహీనత, అమాయకత్వమే ఆసరాగా వంచన

ట్రెండింగ్‌

Advertisement