e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home క్రైమ్‌ ఒకే రోజు.. రూ. 85 లక్షలు స్వాహా

ఒకే రోజు.. రూ. 85 లక్షలు స్వాహా

ఒకే రోజు.. రూ. 85 లక్షలు స్వాహా

సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోయారు.. లాక్‌డౌన్‌ను కూడా తమకు అనుకూలంగా మార్చుకున్నారు.. పెట్టుబడులంటూ నమ్మించి నిండా ముంచారు.. ఇలా ఒకే రోజు పలువురికి గాలంవేసి నట్టేటా ముంచారు.. ట్రేడింగ్‌లో భారీ లాభాలంటూ ఒకరిని, విలువైన బహుమతుల పేరుతో డాక్టర్‌ను, సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ పాయింట్ల పేరుతో పలువురిని, పేపర్‌ ప్లేట్ల కోసం నెట్‌లో గాలించిన వ్యక్తిని నమ్మించి.. దాదాపు రూ.85 లక్షలు కాజేశారు.. మోసపోయిన బాధితులు గురువారం సీసీఎస్‌ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు ఆయా కేసులను దర్యాప్తు చేపట్టారు.

ట్రేడింగ్‌లో భారీ లాభాలంటూ.. రూ.42.72లక్షలు..

స్టాక్‌ ఎక్సేంజ్‌ల్లో అనుభవం ఉంది.. ట్రేడింగ్‌ చేస్తుంటాం.. మేం చెప్పినట్లు చేస్తే భారీ లాభాలు ఇప్పిస్తామని నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు.. నగరానికి చెందిన ఓ వ్యక్తికి రూ.42.72లక్షలు టోకరా వేశారు.. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ కేంద్రంగా ట్రేడింగ్‌ చేస్తున్నాం..మాకు అన్ని స్టాక్‌ ఎక్సేంజ్‌ల్లో అనుభవం ఉంది.. మేం చెప్పినట్లు చేస్తే భారీ లాభాలు ఇప్పిస్తాం.. అంటూ నగరానికి చెందిన నారాయణ అనే వ్యక్తిని నమ్మించారు.. అప్పటికే నారాయణకు డీమ్యాట్‌ ఖాతా ఉండటంతో.. ఆ ఖాతా పూర్తిగా మా చేతిలో ఉంటే సమయాన్ని బట్టి ట్రేడింగ్‌ చేయడంతో లాభాలొస్తాయని.. మీరు ఒక చోట.. మేం ఒక చోట ఉండటం వల్ల లాభాలు వెంటనే రావడం లేదంటూ చెప్పారు. వారి మాటలు విన్న బాధితుడు డీమ్యాట్‌ ఖాతా వివరాలను అందించి అందులో రూ. 7 లక్షలు పెట్టుబడి పెట్టాడు. రెండు రోజుల్లోనే అందులో రూ. 21 లక్షలు లాభాలొచ్చాయంటూ నమ్మించారు. వచ్చిన లాభాలు తీసుకోవాలంటే కొన్ని పన్నులు చెల్లించాలంటూ.. కొన్ని డబ్బులు వసూలు చేశారు. ఆ తరువాత మరికొంత పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలొస్తాయంటూ మొత్తం రూ. 42,72,500 కాజేశారు. ఇంకా డబ్బులు అడుగుతుండటంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు గురువారం సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

డాక్టర్‌కు రూ. 24.3 లక్షల బురిడీ

సికింద్రాబాద్‌లోని ఓ ప్రముఖ ప్రైవేట్‌ దవాఖానలో పనిచేస్తున్న వైద్యుడికి ఫేస్‌బుక్‌లో ఓ యువతి పరిచయం అయ్యింది. తాను పోలాండ్‌లో ఉంటున్నానంటూ పరిచయం చేసుకున్నది.. కొన్నాళ్లు ఫేస్‌బుక్‌లో చాటింగ్‌ చేస్తూ స్నేహితులుగా మారారు. ఆ తర్వాత ఇన్ని రోజుల మన స్నేహానికి గుర్తుగా పోలాండ్‌ నుంచి తాను విలువైన వస్తువులు బహుమతిగా పంపిస్తున్నానని, అందులో లేటెస్ట్‌ ఐఫోన్‌, ల్యాప్‌టాప్‌లతో పాటు బంగారు, వజ్రాభరణాలతో పాటు డాలర్లు కూడా ఉన్నాయని నమ్మించింది. అందుకు సంబంధించిన వాట్సాప్‌లో కొన్ని ఫొటోలు కూడా పంపించింది. రెండు రోజుల తరువాత ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులమంటూ వైద్యుడికి ఫోన్‌ చేశారు. మీ పేరుతో విలువైన డాలర్లు, బంగారం, ఎలక్ట్రానిక్‌ వస్తువులున్నాయని.. వాటికి కస్టమ్స్‌ డ్యూటీ చెల్లించలేదంటూ మాట్లాడారు. కస్టమ్స్‌, యాంటీ టెర్రరిస్ట్‌, జీఎస్టీ, ఆదాయపన్ను, సేల్‌ ట్యాక్స్‌, ఇలా పలు రకాలైన పేర్లు చెబుతూ వైద్యుడి నుంచి వివిధ బ్యాంకుల్లో రూ. 24.3 లక్షలు డిపాజిట్‌ చేయించారు. ఇంకా డబ్బులు అడుగుతుండటంతో మోసపోయానని గుర్తించిన వైద్యుడు సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు.

పేపర్‌ ప్లేట్ల కోసం వెళ్లి..

ఆన్‌లైన్‌లో పేపర్‌ ప్లేట్లు కొనాలని భావించిన ఒక వ్యక్తి.. నెట్‌లో ఆరా తీశాడు. అందులో ఒక దానిని ఎంచుకొని.. కొనేందుకు సిద్ధమై.. రూ. 3.93 లక్షలు ఆర్డర్‌ కూడా ఇచ్చాడు. డబ్బు చెల్లించిన తరువాత అవతలి వ్యక్తులు సెల్‌ఫోన్లు స్విచాఫ్‌ చేశారు.. ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఆయా ఫిర్యాదులపై ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ నేతృత్వంలోని బృందాలు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

రూ.300లకు 450 లాభమంటూ..

గత నెలలో స్పైక్‌ షేర్డ్‌ పవర్‌ బ్యాంకు సంస్థ తరపున వాట్సాప్‌లో ఒక సందేశం ప్రచారం అయ్యింది. దానికి సంతోష్‌నగర్‌ ప్రాంతానికి చెందిన కొందరు స్పందించారు. ఇందులో ఒక మహిళ చాటింగ్‌ చేయడం, ఫోన్‌లో మాట్లాడటం చేసింది. తాము సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ పాయింట్లు రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. చార్జింగ్‌ పాయింట్ల వద్ద అడ్వర్‌టైజ్‌మెంట్‌ చేస్తామని, భారీఎత్తున ప్రణాళికతో వస్తున్నామంటూ చెప్పుకుంది. అయితే రూ. 300 పెట్టుబడి పెడితే వారం రోజుల్లోనే రూ. 450 వరకు లాభాలు ఇస్తామని, రూ. 3 లక్షల వరకు ఒక్కొక్కరు పెట్టుబడి పెట్టేందుకు అవకాశముందంటూ నమ్మించారు. ముందుగా పెట్టుబడి పెట్టిన వాళ్లకు చెప్పినట్టే లాభాలు ఇవ్వడంతో ఒకరి నుంచి ఒకరికి ఈ విషయం తెలిసి వందలాది మంది పెట్టుబడులు పెట్టారు. ఇలా.. గత నెల 13 వరకు లాభాలు చెల్లిస్తూ వచ్చి, ఆ తరువాత సెల్‌ఫోన్లను ఆఫ్‌ చేశారు. రూ. 10 లక్షల వరకు కేవలం సంతోష్‌నగర్‌ ప్రాంతానికి చెందిన వారే పెట్టుబడులు పెట్టారు. కాగా సెల్‌ఫోన్లు స్విచాఫ్‌గా ఉండటంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితులు సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మృతిచెందిన వ్యక్తి ఖాతా నుంచి రూ.13 లక్షలు మాయం

సికింద్రాబాద్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళ భర్త గత నెల 6న చనిపోయాడు. అయితే ఆ తరువాత ఆయన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 13 లక్షలు మాయం కావడంతో ఇందులో తన భర్త బంధువుల పాత్ర ఉందంటూ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఒకే రోజు.. రూ. 85 లక్షలు స్వాహా

ట్రెండింగ్‌

Advertisement