e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home హైదరాబాద్‌ నమ్మారా.. గోవిందా!

నమ్మారా.. గోవిందా!

నమ్మారా.. గోవిందా!
  • ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో గాలం
  • మంచి లాభాలు ఇస్తామంటూ బోల్తా
  • అధిక కమీషన్ల ఆశచూపి.. ముగ్గులోకి దించి..
  • నమ్మించి ముంచేస్తున్న సైబర్‌ నేరగాళ్లు
  • అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌

మా దగ్గర పెట్టుబడి పెట్టండి.. మీ స్నేహితులు, తెలిసిన వారితో కూడా ఇన్వెస్ట్‌ చేయించండి.. మంచి లాభాలిస్తాం.. అంటూ నమ్మిస్తూ ఆన్‌లైన్‌లో నిండా ముంచేస్తున్నారు. కొందరు ట్రేడింగ్‌ పేరుతో అమాయకులను వలలో వేస్తుండగా.. మరికొందరు తమ యాప్‌ల్లో పెట్టుబడి పెట్టండంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఇంకో పక్క రోజువారీగా మీకు కొంత పని ఇస్తాం.. దానిని చేసి పెట్టండి… అందుకు గ్యారంటీగా మా వద్ద డిపాజిట్‌ చేయండి అంటూ ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రా, వాట్సాప్‌, టెక్స్‌ మెసేజ్‌లతో ఆకర్షిస్తున్నారు. మరికొందరు ఆన్‌లైన్‌లో మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ చేస్తూ పెట్టుబడులు పెట్టండి.. మీకు తెలిసిన వాళ్లతో కూడా పెట్టుబడి పెట్టిస్తే భారీ కమీషన్‌ వస్తుందంటూ నమ్మిస్తూ బోల్తా కొట్టిస్తున్నారు. ఇలా.. వివిధ రకాలుగా సైబర్‌నేరగాళ్లు వేసే వలలో చిక్కుకొని చాలామంది మోసపోతూ.. సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే.. చాలా మంది అత్యాశకు పోయి.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తున్నాయని నమ్మి మోసపోతున్నారని.. అలాంటివాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

కొన్ని ఘటనలు..

  • గౌలిపురాకు చెందిన అరుణ్‌కు ఫేస్‌బుక్‌లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తాను షేర్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు సంపాదిస్తున్నానని.. మీ వద్ద డబ్బులుంటే పెట్టుబడులు పెట్టండంటూ సూచించాడు. అతను చెప్పిన మాటలు విని అరుణ్‌.. లక్ష రూపాయలు అతడు సూచించిన ఖాతాలోకి బదిలీ చేశాడు. వారం రోజుల్లో లక్షకు లక్ష లాభం వచ్చినట్లుగా, స్క్రీన్‌ షాట్లు తీసి బాధితుడికి వాట్సాప్‌లో పంపించాడు. లాభం వచ్చిన డబ్బులు పంపిస్తున్నానంటూ నమ్మించి చివరకు సెల్‌ఫోన్‌ స్విచాఫ్‌ చేశాడు.
  • యూసుఫ్‌గూడకు చెందిన రాజు ఆన్‌లైన్‌లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుండగా… స్నేహితుడు ఒకరు తాను క్యాప్చాలో పెట్టుబడి పెట్టి వర్క్‌ తీసుకున్నానని, డబ్బులు సక్రమంగానే వస్తున్నాయంటూ చెప్పాడు. ఇది నమ్మిన రాజు రూ. 1.89 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా రాలేదు. తన పెట్టుబడి తిరిగి ఇవ్వాలంటూ బాధితుడు అడిగేందుకు ప్రయత్నించగా నేరగాళ్లు ఫోన్లు స్విచాఫ్‌ చేసుకున్నారు. దీంతో రాజు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేపట్టారు.
  • నగరంలో పలువురికి వాట్సాప్‌ ద్వారా ‘వర్క్‌ ఫ్రం హోం’ పేరుతో మెసేజ్‌లు వచ్చాయి. వాటిలో ఉన్న లింకులు క్లిక్‌ చేయగానే ‘న్యూ వరల్డ్‌ 18’, ‘న్యూ వరల్డ్‌ రిచ్‌’ పేరుతో ఉన్న యాప్‌లు డౌన్‌లోడ్‌ అయ్యాయి. యాప్‌ల్లోకి వెళ్లగానే యూట్యూబ్‌కు కనెక్ట్‌ అయి.. కొన్ని వీడియోలు కన్పిస్తుంటాయి. ఆ వీడియోలను చూసి, లైక్‌, షేర్‌ చేయడంతో పాటు ఆ చానల్‌లో సబ్‌స్ర్కైబ్‌ చేసుకోమంటూ సూచనలు వస్తుంటాయి. సబ్‌స్ర్కైబ్‌ చేసుకోగానే ప్రింట్‌ స్క్రీన్‌ తీసి ఆ యాప్‌లో షేర్‌ చేయడంతో వాళ్లకు రిజిస్ట్రేషన్‌ ఫీ, ప్యాకేజీల ధరలు వస్తాయి. వీడియోలు క్లిక్‌, షేరింగ్‌లకు సంబంధించిన టార్గెట్‌లు ఇచ్చి, వారి ప్యాకేజీల మేరకు ఒక క్లిక్‌కు రూ. 6 ఇవ్వడంతో ఆయా ప్యాకేజీలను బట్టి ధరలు పెరుగుతూ వెళ్లాయి. ఒక్కో ప్యాకేజీ రూ. 30 వేలు, లక్ష, లక్షన్నర, ఇలా ఉన్నాయి. ఈ ఆఫర్లకు చాలామంది ఆకర్షితులయ్యారు. రిజిస్ట్రేషన్‌ ఫీ పేరుతో పెట్టుబడులు భారీగానే జమయ్యాయి. జనాలు ఎక్కువ కావడంతో యాప్‌ల నిర్వాహకులు గేమ్‌ ఓవర్‌ అయ్యిందంటూ ఆ యాప్‌లను మూసేశారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యా దు చేయడంతో కేసులు నమోదయ్యాయి.
  • చంపాపేటకు చెందిన ఓ వ్యక్తికి ఫేస్‌బుక్‌లో సురేశ్‌ పేరుతో గుర్తుతెలియని వ్యక్తి పరిచయం అయ్యాడు. క్రిప్టోకరెన్సీని ప్రస్తుతం మార్కెట్‌ ధర కంటే 15 శాతం తక్కువ ధరకు ఇప్పిస్తానంటూ నమ్మించాడు. అతని మాటలు నమ్మిన బాధితుడు మొదట రూ. 10 వేలు, ఆ తరువాత రూ.20 వేలు పెట్టుబడి పెట్టగా.. క్రిప్టోకరెన్సీని అందించాడు. ఆ తర్వాత బాధితుడు రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టగా సైబర్‌నేరగాళ్లు బిచాణా ఎత్తేశారు.
  • మా వద్ద పెట్టుబడి పెడితే.. వాటిని షేర్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేసి.. మీకు మంచి లాభాలిస్తామంటూ నమ్మించిన ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తికి రూ. 7 లక్షలు టోకరా వేశారు. బాధితుడి స్నేహితుల ద్వారా ట్రేడ్‌ ప్రాఫిట్‌ ఫండ్‌ అనే సంస్థ గురించి తెలుసుకొని అందులో పెట్టుబడి పెట్టాడు. ముందుగా రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టగానే.. మీకు భారీ లాభాలు రావాలంటే మరింతగా పెట్టుబడి ఉండాలంటూ మరో రూ.5 లక్షలు ఇన్వెస్ట్‌ చేయించారు. ఆ తరువాత నేరగాళ్లు ఫోన్లు స్విచాఫ్‌ చేశారు.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నమ్మారా.. గోవిందా!

ట్రెండింగ్‌

Advertisement