గురువారం 04 మార్చి 2021
Hyderabad - Feb 24, 2021 , 05:12:28

అత్యాశ.. అమాయకత్వం..అదే ముంచేస్తోంది!

అత్యాశ.. అమాయకత్వం..అదే ముంచేస్తోంది!

  • నిజాన్ని దాచి.. అబద్ధానికి ప్రాధాన్యత 
  • మాయ మాటలతో చిక్కుల్లోకి..
  • తప్పులో కాలేస్తున్న బాధితులు
  • వారి ఆశే.. సైబర్‌నేరగాళ్లఆదాయ వనరు
  • అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

సిటీబ్యూరో,  ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ): అత్యాశ.. నిర్లక్ష్యం.. అమాయకుల అవగాహన రాహిత్యం సైబర్‌ నేరగాళ్లకు భారీ ఆదాయ వనరులుగా మారాయి. ప్రతి రోజూ వివిధ రకాలుగా ప్రజలను మోసం చేస్తున్నారు. మోసం చేసేవారు కొన్ని ఘటనల్లో పదో తరగతి కూడా పాసై ఉండరు... అలాంటి వారు ఉన్నత చదువులు చదివిన వారిని నిండా ముంచేస్తున్నారు. ఇందులో అమాయకులు, అత్యాశపరులు ఈజీగా సైబర్‌నేరగాళ్లకు దొరికిపోతున్నారు. ఓటీపీలు, సోషల్‌మీడియా ద్వారా జరిగే నేరాలు, రిమోట్‌ యాప్స్‌, కేవైసీ అప్‌డేట్స్‌ వంటి నేరాలు అవగాహన రాహిత్యంతో జరుగుతుండగా.. కస్టమర్‌ కేర్‌, స్ఫూపింగ్‌ మెయిల్స్‌తో జరిగే నేరాల్లో ఖాతాదారుల నిర్లక్ష్యమే ఎక్కువగా కనిపిస్తున్నది.

ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు..

  • బీఎస్సీ అగ్రికల్చర్‌ చేసిన ఓ యువతి... తన వ్యాపారాన్ని పెంచుకోవాలనుకుని ఇండియా మార్ట్‌లో ప్రకటన పెట్టింది. దీన్ని  చూసి సైబర్‌నేరగాళ్లు వేసిన వలలో చిక్కుకొని రూ.48 లక్షలు పోగొట్టుకుంది. ఇక్కడ.. ఘనా దేశంలో వీగ గార్లిక్‌ లిక్విడ్‌ అనే నూనెకు గిరాకీ ఉందంటూ నమ్మించి.. ఆమెను మోసగించారు. విదేశీ వ్యాపారం.. అధిక లాభాలనే ఆశతో బాధితురాలు కూడా నమ్ముతూ రెండు నెలల పాటు డబ్బులు చెల్లిస్తూ వెళ్లింది. చివరికి అదంతా మోసమని తేలింది. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.
  • బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెడితే రెండింతల లాభాలొస్తాయంటూ నమ్మించిన సైబర్‌నేరగాళ్లు.. నగర వ్యాపారికి రూ. 30 లక్షల టోకరా వేశారు. ఇక్కడ.. సైబర్‌ నేరగాళ్లు ముషీరాబాద్‌కు చెందిన వ్యాపారిని టెలిగ్రామ్‌ యాప్‌ గ్రూప్‌లో యాడ్‌ చేసి.. బిట్‌కాయిల్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలంటూ నమ్మించారు.. వారి మాటలు నమ్మి.. వారు పంపించిన బిట్స్‌స్టిల్‌-క్రిప్టో.కామ్‌ అనే వెబ్‌సైట్‌లో దఫదఫాలుగా 1200 డాలర్లు పెట్టుబడి పెట్టి మోసపోయాడు.. దీంతో బాధితుడు గత వారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక్కడ బాధితుడు అత్యాశకు పోయి మోసపోయాడు.
  • నగరానికి చెందిన ఓ మహిళకు ఫేస్‌బుక్‌లో సైబర్‌నేరగాడు పరిచయమై.. మంచి స్నేహితుడిగా మారాడు..  స్నేహానికి గుర్తుగా మీకు విలువైన బహుమతి పంపిస్తానంటూ నమ్మించి, ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ క్లియరెన్స్‌ పేరిట రూ.13 లక్షలు కాజేశాడు. ఇక్కడ బాధితురాలు అమాయకత్వంతో నమ్మి మోసపోయింది.
  • మీ ఇన్సూరెన్స్‌ పాలసీకి కోటి రూపాయలు క్లెయిమ్‌ చేసుకోవచ్చంటూ నమ్మించిన సైబర్‌నేరగాళ్లు ఓ మహిళ వద్ద నుంచి రెండేండ్లుగా రూ.25 లక్షలు లాగేశారు. మాసాబ్‌ట్యాంక్‌కు చెందిన ఓ గృహిణికి.. 2019లో గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి.. తాము ఐసీఐసీఐ బ్యాంకు ఇన్సూరెన్స్‌ విభాగం నుంచి మాట్లాడుతున్నాం.. మీ పాలసీని క్లెయిమ్‌ చేసుకోవచ్చని, దానికి కోటి రూపాయలు వస్తాయంటూ నమ్మించి.. రిజిస్ట్రేషన్‌ ఫీజుల పేరిట రూ.25 లక్షలు దోచేశారు. ఇక్కడా బాధితురాలు అత్యాశకుపోయి మోసపోయింది.

బాధితుల పొరపాట్లతోనే..

సైబర్‌నేరాల్లో బాధితుల వైపు నుంచే ఎక్కువగా తప్పులుంటున్నాయి. బాధితులు అత్యాశ, తొందరపాటు, నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యం వంటివి సైబర్‌నేరగాళ్లకు కలిసి వస్తున్నాయి. మనిషి ఆశనే పెట్టుబడిగా పెడుతూ సైబర్‌నేరగాళ్లు మోసం చేస్తున్నారు. ఎవరైనా డబ్బిస్తామన్నా, తక్కువ ధరకు వస్తువు వస్తుందనుకున్నా.. అది ఎందుకు వస్తుంది మనకు అనే చిన్న లాజిక్‌ను ఆలోచించాలి. కొన్ని రోజుల పరిచయానికి కోట్ల రూపాయల విలువైన బహుమతులు ఎలా పంపిస్తారు ? సెక్యూరిటీ లేకుండానే రుణాలు ఎందుకు ఇస్తారు..? అర్హత లేకుండా డబ్బు తీసుకొని ఉద్యోగం ఎలా ఇస్తారు..? ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా ఆలోచించకుండా ఈజీగా సైబర్‌నేరగాళ్ల చేతిలో బాధితులు చిక్కుతున్నారు. ఇకనైనా అప్రమత్తంగా ఉంటూ అత్యాశకు వెళ్లకుండా ఉంటే మోసాలకు ఈజీగా చెక్‌పెట్టవచ్చు. - కేవీఎం ప్రసాద్‌, సీసీఎస్‌ సైబర్‌క్రైమ్స్‌

VIDEOS

logo