వేర్వేరు ప్రాంతాల్లో ఆరుగురికి సైబర్‌చీటర్ల టోకరా

హైదరాబాద్ : మా సెల్‌ఫోన్ నెట్వర్క్ విస్తరణలో భాగంగా టవర్లు ఏర్పాటు చేస్తున్నాం.. ఇందుకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో లీజ్‌కు ఖాళీ స్థలాలు ఉంటే చెప్పండి.. అంటూ ఎంబీఏ విద్యార్థికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు.. అతడికి రూ. 70 వేలు టోకరా వేశారు. పోలీసుల కథనం ప్రకారం... నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువకుడు చిక్కడపల్లిలోని బంధువుల ఇంట్లో ఉంటూ రాజేంద్రనగర్‌లోని ఓ కళాశాలలో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇతడికి గత నెల 30న ఐడియా నెట్వర్క్ సంస్థ నుంచి మాట్లాడుతున్నామంటూ గుర్తుతెలియని వ్యక్తులు ( సైబర్ నేరగాళ్లు) ఫోన్ చేశారు. తెలుగులోనే మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా మా సంస్థ సెల్‌ఫోన్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తుందని.. ఇందుకు టవర్లు ఏర్పాటు చేయడానికి .. హైదరాబాద్ పరిసరాల్లో గానీ, ఇతర ప్రాంతాల్లో గానీ లీజ్‌కు ఖాళీ స్థలాలు ఉంటే చెప్పండి అంటూ మాట్లాడారు. దీనికి సదరు యువకుడు తనకేం తెలియదన్నాడు.. అయినా రోజూ అతడి సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్లు పంపిస్తున్నారు. ఒకవేళ స్థలం ఇస్తే.. అడ్వాన్స్‌గా రూ.10లక్షలు, కుటుంబంలో ఒకరికి ఐడియా సంస్థలో ఉద్యోగం అని నమ్మించారు. దీంతో యువకుడు .. ఈ విషయాన్ని పరిగిలో ఉన్న తన మామకు చెప్పగా.. అతను లీజ్‌కు స్థలం ఇస్తానన్నాడు.
ఈ విషయాన్ని ఫోన్చేసినవారికి చెప్పాడు.. దీంతో వారు టవర్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ మొదలు పెడదామని, స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఆధార్‌కార్డులు, సైట్ మ్యాప్ తదితర వివరాలు వాట్సాప్‌లో పంపించాలని సూచించగా పంపించారు. అన్ని పరిశీలించామని, మీతో ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ టవర్ ఏర్పాటు, అద్దెకు సంబంధించిన పత్రాలు కూడా తయారు చేసి వాట్సాప్‌లో పంపించారు. అయితే ఘజియాబాద్‌లో ఉండే తమ న్యాయవిభాగం మరోసారి వీటిని పరిశీలించి ఖరారు చేస్తుందని, అందుకు రూ. 70 వేలు చెల్లించాలంటూ సైబర్‌నేరగాళ్లు కోరారు. దీనిపై అనుమానం వచ్చిన సదరు యువకుడు... మీ న్యాయ విభాగం ఘజియాబాద్‌లో ఎందుకు ఉంటుంది అం టూ ప్రశ్నించాడు. అయినా సైబర్‌నేరగాళ్లు నచ్చజెప్పి.. అతడి నుంచి రూ. 70 వేలు వసూలు చేశారు. ఆ తరువాత స్పందన లేకపోవడంతో మోసపోయామని గుర్తించిన యువకుడు సైబర్‌క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు.
అదే విధంగా.. మరో రెండు ఘటనల్లో ఓఎల్ఎక్స్లో వాహనాలు కొనేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు సైబర్‌చీటర్ల చేతికి చిక్కి.. రూ.65 వేలు పోగొట్టుకున్నారు.
క్విక్ సపోర్టు యాప్‌తో రూ.6.10లక్షలు ...
మీ ఏటీఎం కేవైసీ అప్డేట్ చేసుకోవాలి.. ఇందుకు క్విక్ సపోర్టు యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని నమ్మించిన సైబర్ దొంగలు ... ఓ ప్రైవేటు ఉద్యోగి నుంచి రూ.6.10 లక్షలు కాజేశారు. నిజాంపేటకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి ఫోన్‌కు ఈ నెల 6న ఓ మెసేజ్ వచ్చింది. అందులో మీ పేటీఎం కేవైసీ గడువు తీరిపోతుంది.. మీరు అప్డేట్ చేసుకోకపోతే.. మీ సేవలు నిలిచిపోతాయని ఉంది. ఆందోళన పడ్డ సదరు ఉద్యోగి.. తన సిటీబ్యాంక్‌కు సంబంధించిన కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేసి..అందులో ఉన్న ఒక నంబర్‌ను సంప్రదించాడు. మీ ఫోన్లో క్విక్‌సపోర్టు యాప్ డౌన్లోడ్ చేసుకోండి.. అప్డేట్ చేస్తాం అని గుర్తు తెలియని వ్యక్తులు నమ్మించారు. ఆ తర్వాత మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎవరికైనా రూ.10 పంపండని సూచించగా.. పంపించాడు. వెంటనే అతడి ఖాతా నుంచి రూ.6.10 లక్షలు ఇతర ఖాతాలకు బదిలీ అయ్యాయి.
లింక్ క్లిక్ చేయించి రూ.75 వేలు ...
మీ ద్విచక్రవాహనం రుణం వాయిదాలు అయి పోయాయి..ఎన్ఓసీ పంపిస్తాం.. ఇందుకు ఒక లింక్ పంపిస్తాం.. దాన్ని క్లిక్ చేయండంటూ చెప్పిన సైబర్ నేరగాళ్లు... ఓ వ్యాపారికి రూ.75వేలు టోకరా వేశారు. జగద్గిరిగుట్ట ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి... ఓ ఫైనాన్స్ సంస్థ నుంచి రు ణం తీసుకొని ద్విచక్ర వాహనం కొనుగోలు చేశాడు. దానికి ఈఎంఐలు కూడా పూర్తి అయ్యాయి. ఈ క్రమంలో ఫైనాన్స్ సంస్థ నుంచి మాట్లాడుతున్నామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌చేసి.. మీ రుణం తీరిపోయిం ది.. ఇందుకు ఎన్ఓసీ జారీ చేస్తున్నామని ఓ లింక్‌ను పంపించి.. దాన్ని క్లిక్ చేసి తిరిగి పంపియమని చెప్పారు. దీంతో సదరు వ్యాపారి ఆ లింక్‌ను క్లిక్ చేసి తిరిగి పంపించాడు. ఆ తర్వాత గుర్తు తెలియని వ్యక్తి మరోసారి ఫోన్ చేసి.. మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఓ రూపాయిని ఎవరికైనా పంపమని చెప్పగా.. అలాగే పంపాడు. అంతే.. నిమిషాల వ్యవధిలోనే అతడి ఖాతా నుంచి రూ.75 వేలు ఇతరుల ఖాతాకు బదిలీ అయ్యాయి. దీంతో బాధితుడు సైబరాబాద్ సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు.
తక్కువ ధరకు కారంటూ రూ.2.9లక్షలు...
ఫేస్బుక్లో ప్రకటన చూసి.. సైబర్‌నేరగాళ్లకు చిక్కిన ఓ వ్యక్తి రూ.2.9 లక్షలు పోగొట్టుకున్నాడు. బాచుపల్లి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి .. ఇటీవల ఫేస్బుక్లో స్విఫ్ట్ కారు రూ.1.3 లక్షలకు విక్రయిస్తున్నట్లు ఉన్న ప్రకటనను చూసి.. అందులోని నంబర్‌ను సంప్రదించాడు. అవతల నుంచి తాను ఆర్మీ ఉద్యోగినని.. ఇతర ప్రాంతానికి బదిలీ కావడంతో కారును తక్కువ ధరకే అమ్మేస్తున్నానని నమ్మించాడు. కారు డబ్బులతోపాటు.. వివిధ ట్యాక్స్‌లు కట్టాలంటూ నమ్మించి.. అతడి నుంచి రూ.2.9లక్షలు కాజేశారు. ఇంకా అడుగుతుండటంతో మోసపోతున్నానని భావించిన బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు.
తాజావార్తలు
- ఆక్సిజన్ పార్కును ప్రారంభించనున్న మంత్రి హరీశ్
- కార్పొరేట్ల అనుకూల బడ్జెట్టే : వ్యవసాయ మంత్రి
- ఏఆర్ రెహమాన్‌ను కలిసిన టీమిండియా యంగ్ ప్లేయర్
- దూరవిద్య పీజీ పరీక్షల తేదీల్లో మార్పు
- ఒకే కళాశాలలో 25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్
- శివగామి ఎత్తుకున్న చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూడండి!
- కాగ్‌లో 10,811 పోస్టులు
- ఈ నెల 31 వరకు ఎర్రకోట మూసివేత
- అజిత్ ముద్దుల తనయుడు పిక్స్ వైరల్
- పీఆర్సీ నివేదిక పూర్తి పాఠం