మంగళవారం 04 ఆగస్టు 2020
Hyderabad - Jul 15, 2020 , 23:07:59

ప్రసాద్‌ ల్యాబ్స్‌కు ‘సైబర్‌' టోకరా

ప్రసాద్‌ ల్యాబ్స్‌కు ‘సైబర్‌' టోకరా

స్పూఫింగ్‌ ఈ-మెయిల్‌తో రూ. 4.95 లక్షలు లూటీ

క్రెడిట్‌ కార్డు ఇంటికి పంపి.. ఖాతా ఖాళీ చేశారు

వేర్వేరు ఘటనల్లో సైబర్‌  మోసాలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : స్పూఫింగ్‌ మెయిల్‌తో ప్రసాద్‌ ల్యాబ్స్‌కు సైబర్‌నేరగాళ్లు రూ. 4.95 లక్షల టోకరా వేశారు. పోలీసుల కథనం ప్రకారం... ప్రసాద్‌ ల్యాబ్స్‌కు ఇంగ్లాండ్‌లో ఫిలిమ్‌ లైట్‌ లిమిటెడ్‌ అనే సంస్థ ైక్లెంట్‌. కాగా ప్రసాద్‌ ల్యాబ్స్‌ తన ైక్లెంట్‌తో నిర్వహించే ఈ-మెయిల్‌ సంభాషణలకు సంబంధించిన ఈ-మెయిల్‌ ఫిలిమ్‌లైట్‌, యూకే, ఎల్‌టీడీని సైబర్‌ నేరగాళ్లు స్పూఫింగ్‌ చేశారు. పైకి అసలైన ఈ-మెయిల్‌ కన్పించే విధంగా చూపించారు. తమకు అత్యవసరంగా డబ్బులు కావాలని, ఫలానా బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేయాలని, రెగ్యులర్‌ ఖాతాలో కొన్ని సమస్యలు వచ్చాయంటూ అందులో పేర్కొన్నారు. అయితే ఈ-మెయిల్‌కు స్పందించి, రిటర్న్‌ మెయిల్‌ పంపితే అది మెయిల్‌.కామ్‌కు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో సైబర్‌ నేరగాళ్లు పంపించిన ఈ-మెయిల్‌ అసలైన ైక్లెంట్‌ పంపించాడని నమ్మిన ప్రసాద్‌ ల్యాబ్స్‌ సిబ్బంది అందులో రూ. 4.95 లక్షలు డిపాజిట్‌ చేశారు. తరువాత ైక్లెంట్‌ను సంప్రదించగా తాము ఎవరికీ ఈ-మెయిల్‌ పంపలేదంటూ తేల్చి చెప్పారు. దీంతో ఇదంతా మోసమని గుర్తించి సంస్థ తరపున రాజేశ్‌ అనే ఉద్యోగి బుధవారం సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేపట్టారు. 

మరికొన్ని ఘటనలు...

* మనీషా అనే ఓ మహిళకు యాక్సిస్‌ బ్యాంకులో ఖాతా ఉంది. ఆమె క్రెడిట్‌ కార్డుకు దరఖాస్తు చేసుకోలేదు. అయినా కార్డు ఇంటికి వచ్చేసింది. మరుసటి రోజు తాము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని ఫోన్‌ చేశారు. కార్డు వివరాలు చెప్పాలంటూ ఓటీపీతో సహా అన్ని వివరాలు తెలుసుకొని రూ. 43 వేలు కాజేశారు.

* లాల్‌బజార్‌కు చెందిన అశోక్‌కుమార్‌కు రూ. 12 లక్షల విలువైన లక్కీ డ్రా గెలుచుకున్నారని, ఆ డబ్బు రాబట్టుకోవడం కోసం పేరు రిజిస్ట్రేషన్‌ ఫీజు, ట్యాక్స్‌లు కట్టాలంటూ సూచించిన సైబర్‌నేరగాళ్లు అతని వద్ద నుంచి రూ. 53 వేలు దోచేశారు.

* బంజారాహిల్స్‌కు చెందిన ఆయేషా సిద్దిఖీకి చెందిన యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌కార్డు నుంచి గుర్తుతెలియని వ్యక్తులు రూ. 1.61 లక్షలు కొట్టేశారు.

* బంజారాహిల్స్‌కు చెందిన గోపీకృష్ణకు సైబర్‌నేరగాళ్లు కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాలని మేసేజ్‌ పెట్టారు. దానికి ఆయన స్పందించకపోవడంతో ఫోన్‌ చేశారు. క్విక్‌ సపోర్ట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించారు. ఆయన యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని అందులో బ్యాంకు వివరాలు పొందుపరచడంతో సైబర్‌నేరగాళ్లు అతడి ఖాతా నుంచి రూ. 34 వేలు కాజేశారు.


logo