ఆదివారం 07 మార్చి 2021
Hyderabad - Jan 28, 2021 , 04:51:17

ఆర్థికవృద్ధిలో కస్టమ్స్‌ది కీలకపాత్ర

ఆర్థికవృద్ధిలో కస్టమ్స్‌ది కీలకపాత్ర

  • కొవిడ్‌ సమయంలో పనితీరు భేష్‌
  • అంతర్జాతీయ కస్టమ్స్‌ డే వేడుకల్లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

హైదరాబాద్‌, జనవరి 27 (నమస్తే తెలంగాణ): దేశ ఆర్థిక వృద్ధిలో కస్టమ్స్‌ విభాగం పనితీరు అత్యంత కీలకమని గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ సరఫరాలోనూ కస్టమ్స్‌ అధికారులు కీలకంగా పనిచేశారని అభినందించారు. బుధవారం హైదరాబాద్‌ కస్టమ్స్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో అంతర్జాతీయ కస్టమ్స్‌ డే వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన తమిళిసై మాట్లాడుతూ.. కరోనా సమయంలో 150కిపైగా దేశాలకు అత్యవసర మందుల ఎగుమతి, అత్యవసర, నిత్యావసర వస్తువుల రవాణాలో అంతరాయం కలుగకుండా తీసుకున్న చర్యలు అద్భుతమన్నారు.  బంగారం అక్రమ రవాణాకు స్మగ్లర్లు వేస్తున్న ఎత్తులను చిత్తు చేస్తూ వారి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నారని కితాబిచ్చారు. ఇంత గొప్పగా పనిచేస్తున్న కస్టమ్స్‌ అధికారుల కార్యక్రమంలో పాల్గొని.. సిబ్బందిని అభినందించాలన్న ఉద్దేశంతోనే తాను చెన్నైలో హాజరుకావాల్సిన కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్టు వెల్లడించారు. అనంతరం ఉత్తమ ప్రతిభచాటిన కస్టమ్స్‌ అధికారులకు గవర్నర్‌ అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో గవర్నర్‌ భర్త, ప్రముఖ నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ సౌందరరాజన్‌, కస్టమ్స్‌, ఇన్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ చీఫ్‌ కమిషనర్‌ మల్లికా ఆర్యా, ప్రిన్సిపల్‌ కమిషనర్‌ జేసీ చంద్రశేఖర్‌, ఐటీ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ మహాపాత్ర, ప్రిన్సిపల్‌ కమిషనర్‌ (జీఎస్టీ) పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo