శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 15, 2020 , 00:27:15

కీర్తి కిరీటాలు సొగసైన నగీషీలు

కీర్తి కిరీటాలు సొగసైన నగీషీలు

వారసత్వ కట్టడాలకు పూర్వవైభవం

పరిరక్షణకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. వేగంగా కుతుబ్‌షాహీ టూంబ్స్‌ పునరుద్ధరణ 

వన్నెలద్దుకున్న చార్మినార్‌.. ఆహ్లాదంగా మారుతున్న ‘రేమండ్‌'

చరిత్ర పుస్తకాల్లో భాగ్యనగరానికీ కొన్ని పేజీలు ఉన్నాయి. ఎన్నో అద్భుత కట్టడాలకు నిలయమైందీ చారిత్రక నగరం. అందమైన నిర్మాణ శైలికి ప్రతిబింబాలైన వారసత్వ సంపదలు జ్ఞాపకానికి సాక్షిగా నిలుస్తున్నాయి. భాగ్యనగర కీర్తికిరీటంలో మణిహారాలై.. ఆనాటి కాలపు కౌశలానికి, సాంస్కృతిక జీవనానికి ప్రతీకలవుతున్నాయి. గత పాలనలో నిరాదరణకు గురైనా.. తెలంగాణ ప్రభుత్వ చొరవతో ఇప్పుడవి పూర్వవైభవాన్ని సంతరించుకుంటున్నాయి. డెక్కన్‌ చరిత్రకు వారసత్వమైన కుతుబ్‌షాహీ టూంబ్స్‌ అందంగా ముస్తాబవుతున్నాయి. ఇక్కడ నిర్మిస్తున్న భూగర్భ ఇంటర్‌ ప్రిటేషన్‌ సెంటర్‌ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నది. ఇక చార్మినార్‌ సరికొత్తగా సొబగులద్దుకుంటుంటే.. రేమండ్‌ టూంబ్స్‌ ఆహ్లాదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్నది.

భాగ్యనగరం.. చారిత్రక శోభకు నిలయం.. ఎన్నో అద్భుత కట్టడాలకు నిలువుటద్దం.. నాటి చరిత్ర, సంస్కృతి, గొప్పదనానికి ఆనవాళ్లుగా నిలిచే వారసత్వపు సంపదను గత పాలకులు గాలికొదిలేస్తే.. తెలంగాణ సర్కారు వాటి పరిరక్షణకు నడుం బిగించింది. కీర్తికిరీటాలకు సొబగులద్దుతున్నది. ఇందులో భాగంగానే అపురూప నిర్మాణ కౌశలానికి ప్రతీకగా నిలిచే మొజంజాహీ మార్కెట్‌ సరికొత్తగా వన్నెలద్దుకున్నది. రూ. 15 కోట్లతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పునరుద్ధరణ పూర్తి చేసుకున్న ఈ మార్కెట్‌ను మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ప్రారంభించారు. భిన్న సంస్కృతులకు నిలయమైన హైదరాబాద్‌లోని చారిత్రక వారసత్వ కట్టడాలను  పరిరక్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు.

చార్మినార్‌కు మరింత హొయలు.. 

చార్మినార్‌:  నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన చార్మినార్‌ అందాలకు మరింత హొయలు రానున్నాయి. వారసత్వ కట్టడాలను భావితరాలకు అందించే క్రమంలో చరిత్రకు సాక్షిగా నిలిచిన ఈ అపురూప కట్టడం రక్షణ కోసం ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా చార్మినార్‌ను ప్రత్యేక జోన్‌గా గుర్తిస్తూ.. పరిరక్షణకు శ్రీకారం చుట్టింది. 

ప్రత్యేక అలంకరణ..

పాదచారుల జోన్‌లకు ప్రత్యేక అలంకరణగా నిలిచే  ఫసార్డ్‌లను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు చార్మినార్‌ జోన్‌ జోనల్‌ కమిషనర్‌ సామ్రాట్‌ అశోక్‌ తెలిపారు. చార్మినార్‌కు తూర్పు, పడమర దిక్కుల్లో ఉన్న మార్కెట్‌ లాడ్‌ బజార్‌తో పాటు సర్దార్‌ మహల్‌ వైపు ఉన్న రాణి మహల్‌కు వెళ్లే  మార్గాల్లోని వ్యాపార సముదాయాలకు ఫసార్డ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. 

పాదచారుల జోన్‌..

చార్మినార్‌ను కాలుష్యం బారి నుంచి కాపాడే ప్రక్రియలో భాగంగా నాలుగు మార్గాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేస్తూ..  ప్రత్యేకంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. పాదచారుల జోన్‌ పనుల్లో భాగంగా  ఈ కట్టడానికి

కిలోమీటర్‌ దూరంలోని మదీనా నుంచి వెళ్లే మార్గంలో పర్యాటకులు

చార్మినార్‌ అందాలను తనవితీరా ఆస్వాదించేందుకు దారి

పొడవునా ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. చార్మినార్‌ను సందర్శించే యాత్రికులు చారిత్రక కట్టడం వద్ద మరింతగా సమయాన్ని గడిపేందుకు అనుగుణంగా ఈ మార్గాల్లో ప్రత్యేకంగా నాపరాళ్లను అమర్చారు.

బోలార్డ్స్‌ ఏర్పాటు..

చార్మినార్‌ సమీపంలో వాహనాల రాకపోకలను నిలువరిస్తూ..జీహెచ్‌ఎంసీ ప్రాజెక్ట్‌ అధికారులు ప్రత్యేక ఉపకరణాలను వినియోగించారు.  పాదచారుల జోన్‌లో బోలార్డ్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రత్యేక అనుమతి పొందిన వాహనాలు.. ఆ జోన్‌లోకి ప్రవేశించే మార్గాల్లో వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఇవి భూమికి సమాంతరంగా లోపలికి వెళ్లిపోతాయి. అనంతరం యథాస్థితికి వచ్చి..తిరిగి వాహనాల సంచారాన్ని నిలువరిస్తాయి. హైడ్రాలిక్‌ పద్ధతిలో అమర్చిన వీటి వల్ల చార్మినార్‌ కాలుష్యం బారి నుంచి రక్షింపబడుతుంది. 

రూ. 3 కోట్లతో రేమండ్‌ టూంబ్స్‌ సుందరీకరణ

సైదాబాద్‌:  18వ శతాబ్దంలో నిజాం నవాబు నిర్మించిన రేమండ్‌ టూంబ్స్‌ సుందరీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పర్యాటకులను ఆకర్షించేందుకు ‘స్వదేశ్‌ దర్శన్‌' పేరుతో పురావస్తు, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో టూంబ్స్‌ను అందంగా తీర్చిదిద్దుతున్నారు. నిజాం ప్రభుత్వ హయాంలో కంట్రోలర్‌ ఆఫ్‌ ఆర్డినెన్స్‌ అధికారిగా పనిచేసిన రేమండ్‌...ఫ్రెంచ్‌ దేశస్తుడు. పుదుచ్చేరిలో సైనికుడిగా పనిచేసిన ఇతను.. నిజాం సైన్యంలో చేరాడు. ఫిరంగులు, ఆయుధాల నిపుణుడు కావడంతో ఆ  సైన్యంలో కీలక భూమిక పోషించి.. మంచి హోదా, విశ్వాసాన్ని పొందాడు. తిరుగులేని సైన్యాధికారిగా, ప్రజలతో సన్నిత సంబంధాలు కలిగి.. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుని అందరికీ ఆప్తుడయ్యాడు. రేమండ్‌ మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం 1798లో మలక్‌పేట ఆస్మాన్‌ఘడ్‌లో 27 ఎకరాల్లో టూంబ్స్‌ను నిర్మించారు. ప్రస్తుతం 12 ఎకరాల్లో 28 స్తంభాలతో 180 అడుగుల పొడవు, 85 అడుగుల వెడల్పు గద్దెపై 23 అడుగుల స్మారక స్థూపాన్ని యూరోపియన్‌ నిర్మాణ శైలిలో కట్టించారు. స్తూపం సమీపంలోనే ఆయన పెంపుడు జంతువులైన గుర్రం, శునకం సమాధులతో పాటు మరో మందిరాన్ని కూడా నిర్మించారు.

రూ. 3 కోట్లతో.. 

తెలంగాణ రాష్ట్ర పురావస్తు, పర్యాటక శాఖ అధికారులు రూ. 3 కోట్లతో టూంబ్స్‌ సుందరీకరణ పనులు చేపట్టారు. ఆ ప్రాంతాలను ఆహ్లాదకరంగా మారుస్తున్నారు. విలువైన భూమి పరిరక్షణ కోసం ప్రహరీ, వాచ్‌మన్‌ గది, సోలార్‌ ఫెన్సింగ్‌ పనులు పూర్తి చేశారు. ప్రాచీన కట్టడాలను వీక్షించేందుకు చుట్టూ.. పాత్‌ వే వాకింగ్‌ ట్రాక్‌, 18 చోట్ల రాతి బెంచీలు, వర్షపునీటి సంరక్షణకు అనేక చోట్ల కొలనులు, ప్రకృతిని ఆస్వాదించేలా ఆహ్లాదకరమైన ల్యాండ్‌ స్కేపింగ్‌, వాహనాల పార్కింగ్‌, గ్రీనరీ, సమాధుల చుట్టూ గ్రిల్స్‌, రకరకాల పూల మొక్కలు, గ్రీన్‌ మార్బుల్స్‌తో చుట్టూ ఆరు అడుగుల ప్రహరీ, గోడపై ఫెన్సింగ్‌, వాటర్‌ ఫౌంటెన్‌తో  శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. నగరానికి వచ్చే ఫ్రెంచ్‌ దేశస్తులు, విదేశీయులు రేమండ్‌ టూంబ్స్‌ను సందర్శిస్తారని, సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెప్పారు. 

రూ. 100 కోట్లతో అభివృద్ధి

రాష్ట్ర పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఆగాఖాన్‌ ఫౌండేషన్‌ సుమారు రూ. 100 కోట్లతో పునరుద్ధరణ పనులు చేపట్టింది. ఈ చారిత్రక సంపదకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు 2013  నుంచి కృషి చేస్తున్నది. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నది. ఇప్పటివరకు సుమారు రూ. 96 కోట్ల నిధులతో టూంబ్స్‌ను అభివృద్ధి చేసింది.

సెవన్‌ టూంబ్స్‌లో

ఇంటర్‌ ప్రిటేషన్‌ సెంటర్‌

భూగర్భంలో నిర్మాణం 

మెహిదీపట్నం: ఎన్నో వారసత్వ కట్టడాలకు నిలయమైన భాగ్యనగరంలో మణిహారంగా నిలుస్తుంది సెవన్‌ టూంబ్స్‌. గోల్కొండను పాలించిన కుతుబ్‌షాహీ రాజులకు సంబంధించిన సమాధుల ప్రదేశమిది. ఈ పురాతన సమాధులను పరిరక్షించేందుకు పర్యాటక, పురావస్తు శాఖ నడుం బిగించింది.  సెవన్‌టూంబ్స్‌ వద్ద  హెరిటేజ్‌ పార్కు ప్రాంగణంలో సుమారు రూ.45.39 కోట్లతో ఇంటర్‌ప్రిటేషన్‌ సెంటర్‌ను భూగర్భంలో నిర్మించనున్నారు. ఇటీవలే ఈ పనులను మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, హోం మంత్రి మహమూద్‌ అలీ, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తదితరులు ప్రారంభించారు. స్వదేశ్‌ దర్శన్‌ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం కుతుబ్‌షాహీ టూంబ్స్‌ , హయత్‌బక్షీ బేగం మసీదు, రేమండ్‌, పైగా టూంబ్స్‌ల అభివృద్ధికి  రూ. 96.89కోట్ల నిధులను కేటాయించింది. ఇందులోభాగంగా ఈ ఇంటర్‌ప్రిటేషన్‌ సెంటర్‌ను నిర్మించనున్నారు.  6500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీనిని 12 నెలల్లో నిర్మిస్తారు. ఈ కేంద్రం  మొత్తం భూగర్భంలోనే ఉంటుంది. దీని ఎంట్రన్స్‌ జోన్‌లో ఓరియంటేషన్‌ కోర్టు, చిల్డ్రన్స్‌ గ్యాలరీస్‌, ఫిల్మ్‌ స్క్రీనింగ్‌ గదులు , సావనీర్‌ దుకాణాలు ఉంటాయి. గ్యాలరీ జోన్‌లో మల్టీపర్పస్‌ హాల్‌, టికెట్‌ కౌంటర్‌, బ్యాగేజ్‌ సౌకర్యాలు కల్పించనున్నారు.  చారిత్రక వస్తువులతో కూడిన ప్రదర్శనశాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు.


logo