ఆరేండ్లలో సేఫ్ సిటీగా అంతర్జాతీయ ఖ్యాతి

- సంస్కరణలతో అద్భుత ఫలితాలు
- ఉమ్మడి రాష్ట్రంలో భయం.. భయం
- ఆరేండ్లలో సేఫ్‌సిటీగా అంతర్జాతీయ ఖ్యాతి
- టెక్నాలజీ, సంస్కరణలతో పోలీసింగ్‌లో మార్పులు
- అడుగడుగునా నిఘా.. అల్లరిమూకలపై ఉక్కుపాదం
- మహిళల కోసం షీటీములు.. ఆకతాయిల ఆటకట్టు
- తగ్గిన నేరాలు.. ‘జీరో’కు చేరిన చైన్‌స్నాచింగ్
రౌడీమూకల స్వైరవిహారం, దొంగల బీభత్సం, మహిళలపై ఆకృత్యాలు, ఘడియకో ఘర్షణ.. గంటకో నేరం.. నిత్యం ఉద్రిక్తతల మధ్య ఊగిపోయిన హైదరాబాద్ నగరం -ఇదంతా ఆరేండ్ల క్రితం..
ఇప్పుడు హైదరాబాద్ దేశంలోనే అత్యంత సురక్షిత నగరం. మహిళలకు భద్రతను, భరోసాను ఇవ్వడమే కాదు.. ఆకతాయిల, అల్లరిమూకల ఆటలు కట్టించిన నగరం. గతంలో ప్రతిరోజూ పదేసి సంఖ్యలో గొలుసు దొంగతనాలు జరుగగా, నేడు వాటి సంఖ్య జీరో. హైదరాబాద్‌ను నేరరహితంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పానికితోడు అందివచ్చిన అధునాతన సాంకేతికత, సంస్కరణలతోసాధ్యమైన ఫ్రెండ్లీ పోలీసింగ్ తోనే ఇది సాధ్యమైంది. ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గిపోయాయి. నిఘా పెరగడంతో నేరాలు తగ్గుముఖం పట్టాయి.
నాడు
నగరంలో మహిళలు మార్నింగ్ వాక్కు కూడా ధైర్యంగా వెళ్లలేని పరిస్థితి. ఎవడు ఎప్పుడొచ్చి మెడలో గొలుసు తెంచుకుపోతాడోనన్న భయం. పండక్కి సొంతూరు వెళ్దామంటే తిరిగొచ్చే దాకా ఇల్లెంత భద్రంగా ఉంటుందో తెలియని కాలం. అలా దోపిడీకి గురైన ఇండ్లు అనేకం. కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు పోకిరీల వేధింపులు.. నిత్యం ఏదో ఒక చోట హత్యలు.. అరాచకాలు.. సాయం కోసం పోలీస్ స్టేషనుకు వెళ్తే.. చీదరింపులు, ఛీత్కారాలు! నాటి పాలకుల నిర్లక్ష్యం, వ్యవస్థల లెక్కలేనితనానికి బాధితులుగా మిగిలినవారు వందలు, వేలు!!
నేడు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కేసీఆర్ సర్కారు కొలువు దీరాక నగరం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నది. ఇప్పుడిక్కడ చైన్ స్నాచింగులు లేవు. ఆకతాయిల ఆగడాల్లేవు. నేరాలు తగ్గాయి. నిఘా నీడలో నగరం ప్రశాంతంగా ఉన్నది. అద్భుతమైన సంస్కరణలు, అత్యాధునిక సాంకేతికతతో పౌరులకు సర్కారు రక్షణ ఛత్రం పట్టింది. 100కి డయల్ చేస్తే నిమిషాల్లో పోలీసులు రక్షణగా వాలిపోతారనే నమ్మకం కల్పించింది.
అప్పుడు కల్లోల నగరం
2014కు ముందు వరకు మత ఘర్షణలతో హైదరాబాద్ తరచూ ఉలిక్కిపడేది. 35 ఏండ్లలో 2,703 అల్లర్లు జరిగాయి. 554 మంది ప్రాణాలు వదిలారు. 4,798 మంది గాయపడ్డారు.
ఇప్పుడు ప్రశాంతం
ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. ఈ ఆరేండ్లలో మత కలహాలు అన్నవే లేకుండా చేసి ప్రశాంతతను నెలకొల్పారు.
శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్న చోటే ఉపాధి రంగం విలసిల్లుతుంది. అందుకే సిటీలో భద్రతను పటిష్టం చేశాం. ఏ చిన్న ఘటన జరిగినా క్షణాల్లో స్పందించే సాంకేతిక సదుపాయాలను పోలీస్‌శాఖకు అనుసంధానం చేస్తున్నాం. నగరం శాంతిగా ఉంటే జనం హాయిగా ఉండగలుగుతారు. - మంత్రి కేటీఆర్
జీరో చైన్ స్నాచింగ్స్
ఆరేండ్ల కిందట మహిళలు ఒంటరిగా రోడ్డుమీదికి రావాలంటే భయపడే పరిస్థితి. రోజూ 20 దాకా చైన్ స్నాచింగ్‌లు జరుగుతుండేవి. తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుని నగరంలో చైన్ స్నాచింగ్ అన్నదే లేకుండా చేసింది.
5.80 లక్షల సీసీ కెమెరాలు
నగరంలో 350 సీసీ కెమెరాలు మాత్రమే ఉండేవి. ఏదైనా నేరం జరిగితే ఆధారాల సేకరణకు కష్టంగా ఉండేది. ప్రస్తుతం 5 లక్షల 80వేల సీసీ కెమెరాలున్నాయి. చీమ చిటుక్కుమన్నా పోలీసులకు తెలిసిపోతున్నది. నేరం చెయ్యాలంటేనే వెన్నులో వణుకు పుట్టే వాతావరణం ఏర్పడింది.
నేరము.. శిక్ష..
2014కు ముందు ఏ నేరంగా చేసినా సులభంగా బెయిల్ పొందవచ్చనో, శిక్ష పడకుండా బయటపడొచ్చనో నేరస్తుల్లో ఓ ధీమా ఉండేది. కానీ ఇప్పడు సాంకేతికతతో పోలీసులు నేరస్తుల ఆటకట్టిస్తున్నారు. నేరం జరిగిన స్థలం నుంచి శిక్ష ఖరారయ్యే వరకు ఆయా అధికారులు డ్యూటీలు సక్రమంగా చేస్తూ.. రికార్డులను ఎప్పటికప్పుడు టెక్నాలజీ సాయంతో భద్రపర్చుకుంటున్నారు. విచారణ సమయంలో కావాల్సిన ఆధారాలు, సాక్ష్యాలు చెదిరిపోకుండా.. సాక్ష్యులు బెదిరిపోకుండా చూస్తూ నేరగాళ్లకు శిక్షలను ఖాయం చేయిస్తున్నారు. దీంతో నేరగాళ్లు క్రైం చేయడానికి వణికిపోతున్నారు. పోలీసు సిబ్బంది కూడా ప్రతిరోజూ అప్డేట్ అయ్యేలా, ఆధునిక సాంకేతికతపై అవగాహన పెంచుకునేలా అధికారులు ప్రోత్సహిస్తున్నారు.
మహిళల భద్రతకు ప్రాధాన్యం
2014కు ముందు..
రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లాలంటేనే మహిళలు భయపడేవారు. ఎవరు ఎక్కడ ఈవ్‌టీజింగ్ చేస్తారోననే భయం యువతులు, మహిళను వెంటా డేది. ఆపదలో ఉన్నప్పుడు ఎవరిని ఆశ్రయించాలో తెలియకపోయేది. అఘాయిత్యాలకు గురైన మహిళలకు పోలీసుల భరోసా, కనీస ఓదార్పు దొరకని పరిస్థితి.
2014 తరువాత..
మహిళలను వేధించే వారిపై ఉక్కుపాదం మోపేందుకు షీ-టీమ్స్ ఏర్పాటు చేశారు. అవి మంచి ఫలితాలు ఇవ్వడంతో ఇతర రాష్ర్టాల పోలీసులు కూడా హైదరాబాద్‌కు వచ్చి షీ-టీమ్స్ పనితీరును తెలుసుకొని వెళ్లేవారు. అఘాయిత్యాలకు గురయ్యే మహిళలు, బాలల కోసం ప్రత్యేకంగా భరోసా కేంద్రం కూడా ఏర్పాటైంది.
ఫలితాలు..
షీ-టీమ్స్‌కు 5వేల ఫిర్యాదులు వచ్చాయి. పోలీసులు ఐదువేల మంది పోకిరీల భరతంపట్టారు. ఇప్పుడు నగరంలో ఈవ్‌టీజర్ అనేవారే లేకుండాపోయారు. దాంతో పాటు మహిళలపై దాడులు చేస్తే కఠినచర్యలుంటాయనే భయం అందరిలో నెలకొంది. షీటీమ్స్‌కు పట్టుబడిన వారికి కౌన్సెలింగ్ చేసి, మంచిపౌరులుగా వారిని మారుస్తున్నారు. భరోసా కేంద్రంలో బాధితులకు ధైర్యాన్నిస్తున్నారు. వారికి వైద్య, న్యాయ సలహాలతోపాటు పునరావాస కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు.
వ్యవస్థీకృత నేరాల కట్టడి
2014కు ముందు..
నగరంలో పేకాట క్లబ్బులు, గుడుంబా విక్రయాలు, మట్కా, జూదం, రౌడీయిజం, గుండాయిజం వంటివి కొనసాగేవి. జూదంతో పేదలు, మధ్యతరగతితోపాటు ధనవంతులు సైతం డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండేది.
2014 తరువాత..
వ్యవస్థీకృత నేరాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు పేకాట క్లబ్బులను ప్రభుత్వం నిషేధించింది. గుడుంబా విక్రయాలను పూర్తిగా అడ్డుకొని, దానిపై ఆధారపడిన వారికి పునరావాస కార్యక్రమాలతో జీవనోపాధి కల్పించారు. డ్రగ్స్ నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం మోపారు.
ఫలితాలు:
వ్యవస్థీకృత నేరాలు కనుమరుగయ్యాయి. అన్నివర్గాల నుంచి జూదం దూరమైంది. అనేక కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
అత్యాధునిక కమాండ్ కంట్రోల్ కేంద్రాలు
హైదరాబాద్ రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో అత్యాధునిక కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిద్వారా లక్షల కెమెరాలను ప్రత్యక్షంగా చూడొచ్చు. స్థానికంగా జరుగుతున్న వ్యవహరాలను ఎప్పటికప్పుడు అధికారులు తెలుసుకోవచ్చు. ట్రాఫిక్ ఉల్లంఘనలను కూడా పరిశీలించవచ్చు. ఆధునిక కమాండ్ కంట్రోల్‌తో కమిషనరేట్ల పరిధి మొత్తాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చారు. రౌడీషీటర్ల ఇండ్లకు, సమస్యాత్మక ప్రాంతాలకు జియోట్యాగింగ్ చేసి అక్కడి పరిస్థితులపై ప్రతినిమిషం పరిశీలిస్తారు. దీంతో వారి కదలికల గురించి పోలీసులకు ఎప్పటికప్పుడు తెలిసిపోతాయి. వెంటనే అప్రమత్తమై అవసరమైన చర్యలను తీసుకుంటారు.
ట్రిపుల్ రైడింగ్, అతివేగానికి కళ్లెం
రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో జాతీయ, రాష్ట్ర రహదారులున్నాయి. ఒకప్పుడు ఈ రహదారులపై ప్రయాణమంటే మృత్యువు నోట్లో తలపెట్టేలా ఉండేది. ఈ రహదారులపై టిప్పర్లు, భారీ వాహనాలు సృష్టించే భయం వాహనదారులను కంగారుపెట్టి వారిని ప్రమాదంలోకి నెట్టేది. రాత్రివేళల్లో గుర్తుతెలియని వాహనాలు.. ఢీకొట్టి ఎవరికీ దొరకకుండా వెళ్లిపోయేవి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఈ రహదారులపై సీసీ కెమెరాలు, ప్రధాన కేంద్రాల వద్ద ఏర్పాటుచేసిన ఇన్ఫ్రారెడ్ కెమెరాలు.. అతివేగంతో వెళ్లే వాహనాలను ఫొటో తీసి పోలీసులకు ఆధారాలుగా ఇస్తున్నాయి. ఇక డ్రంకెన్ డ్రైవింగ్ విషయంలోనూ పోలీసులు సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్ వల్ల జరిగే ప్రమాదంలో ఎవరైనా చనిపోతే.. కారకుడైన డ్రైవర్‌పై 304 పార్ట్-2ను విధించి అతడికి పదేండ్ల జైలుశిక్ష పడేలా చేస్తున్నారు. ట్రిపుల్ రైడింగ్, అతివేగంతో చేసే బైక్ విన్యాసాలు సామాన్య వాహనదారులను భయపెట్టేవి. ప్రమాదాల్లో చాలా కుటుంబాలు చేతికి అందిన కొడుకులను పొగొట్టుకున్నాయి. ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరించడం మంచి ఫలితాలను ఇచ్చింది. ప్రమాదాల సంఖ్య తగ్గింది.
అత్యంత సురక్షిత నగరం
హైదరాబాద్ సిటీ ఇప్పుడు దేశంలో అత్యంత సురక్షితంగా నగరం. పౌర రక్షణ కోసం ప్రభుత్వం పోలీసులకు అందిస్తున్న సహకారంతో శాంతిభద్రతలు చాలా పటిష్టంగా ఉన్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు నగరంలో పని చేయడానికి ఆసక్తిచూపుతారు. పోలీసులు ప్రజలను భాగస్వామ్యం చేస్తూ నేర నియంత్రణపై దృష్టిపెడుతున్నారు. ఇతర రాష్ర్టాల ఉద్యోగినులను వారి తల్లిదండ్రులు నిస్సంకోచంగా హైదరాబాద్‌లో ఉద్యోగం చేసేందుకు పంపుతుండటం మన సిటీ శాంతి భద్రతల మీద వారికి ఉన్న నమ్మకం స్పష్టమవుతున్నది. పోలీసుల సేవల అందేందుకు హాక్ ఐ చాలా ఉపయోగపడుతోంది. -కృష్ణ ఏదుల, సోసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి
పాస్‌పోర్ట్ సేవలు వేగవంతం
2014కు ముందు..
పాస్‌పోర్టు రావాలంటే కేవలం పోలీస్ వెరిఫికేషన్కే సగటున 45రోజుల సమయం పట్టేది.. వెరిఫికేషన్‌కు వచ్చే సిబ్బందికి చేయి తడపనిదే పని అయ్యేదికాదు.. అంటే దరఖాస్తుదారుడికి పాస్‌పోర్టు ఎప్పుడొస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉండేది.
2014 తరువాత..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాస్‌పోర్టు వెరిఫికేషన్ వ్యవస్థను టెక్నాలజీ పరమైన సంస్కరణలతో ప్రక్షాళన చేశారు. పాస్‌పోర్టు కార్యాలయం నుంచి వెరిఫికేషన్ కోసం సిటీ స్పెషల్ బ్రాంచ్‌కు దరఖాస్తు రావడం మొదలు ప్రక్రియ పూర్తయ్యేవరకు వివిధ దశల్లో అప్లికేషన్ స్టేటస్‌ను ఎప్పటి కప్పుడు తెలుసుకోవచ్చు. ఫలానా పోలీసు అధికారి.. ఫలానా సమయంలో మీ వద్దకు వెరిఫికేషన్ కోసం వస్తున్నాడన్న సమాచారం దరఖాస్తు దారుడికి తెలియజేస్తున్నారు. వెరిఫికేషన్ తర్వాత సిబ్బంది ప్రవర్తనపైనా పోలీసుశాఖ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నది. దీంతో సిబ్బంది జవాబుదారీతనం, పారదర్శక పెరిగింది.
ఫలితాలు:
వెరిఫికేషన్ మూడ్రోజుల్లో పూర్తయ్యి.. ఏడురోజు ల్లోనే దరఖాస్తుదారుడికి పాస్‌పోర్టు చేరుతున్నది. పారదర్శకత.. వేగవంతమైన సేవలపై కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసలు కురిపించింది.
సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా
2014కు ముందు..
హైదరాబాద్ నగరంలో కేవలం 350 సీసీ కెమెరాలు మాత్రమే ఉండేవి.
2014 తరువాత..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే సీసీ కెమెరాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రభుత్వం, ప్రజల భాగస్వామ్యంతో నేడు మూడు పోలీస్‌కమిషనరేట్ పరిధిలోనే 5.8 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి. అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న నగరాల్లో దేశంలోనే హైదరాబాద్ మొదటిస్థానంలో ఉంది.
ఫలితాలు:
చీమ చిటుక్కుమన్నా తెలిసిపోతోంది. నేరాలు పూర్తిగా తగ్గిపోయాయి. తప్పు చేయాలంటే ప్రతి ఒక్కరూ జంకే పరిస్థితి నెలకొంది. దీంతో హైదరాబాద్‌లో ప్రశాంతమైన వాతావరణం ఆరున్నరేండ్లుగా ఉంది. నేరస్థులపై పటిష్ట నిఘా ఉంది. నగరంలో నమోదైన పలు సంచలనాత్మక కేసుల్ని 24 గంటల్లోనే ఛేదించడంలో సీసీ కెమెరాలు ముఖ్య భూమిక పోషించాయి. అంతర్రాష్ట్ర దొంగలు హైదరాబాద్ వైపు కన్నెత్తయినా చూడకుండా చేయడంలో పోలీసులకు సీసీ కెమెరాలు ఉపయోగపడుతున్నాయి. నగరంలో జరిగిన పండుగలు, వేడుకలు, ర్యాలీలన్నీ ప్రశాంతంగా ఇన్సిడెంట్ ఫ్రీగా జరుగడానికి ఈ నిఘాయే కారణం.
పీడీ యాక్టుతో అణచివేత..
2014కు ముందు..
పీడీయాక్టులు అంటే ఎప్పుడో ఓసారి మాత్రమే వినపడేది. దీంతో నేరగాళ్లలో భయం అనేది లేకుండా.. చేసిన నేరాలే చేసేవారు. ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ అశాంతి, అలజడులు సృష్టించారు.
2014 తరువాత..
నేరాలకు ప్రధాన కారణాలను విశ్లేషించారు. బుద్ధిమార్చుకోని వారిపై పీడీయాక్టులు పెట్టారు. ఆరేండ్లలో సుమారు 450 మంది నేరగాళ్లపై పీడీయాక్టు ప్రయోగించారు. కొందరిపై మూడేసి సార్లు పీడీయాక్టు పెట్టారు. చేసిన నేరాలను త్వరగా కోర్టుల్లో తగిన రుజువులతో నిరూపిస్తూ, పీడీయాక్టులో సదరు నిందితులు జైళ్లలో ఉండగానే కోర్టు తీర్పులు వచ్చేలా కేసుల దర్యాప్తును వేగవంతం చేశారు. పీడీయాక్టు సమయం పూర్తయ్యేసరికి నేరస్థులకు కోర్టు శిక్షలు విధిస్తూ.. జైళ్లలోనే శిక్షాకాలం పూర్తయ్యే వరకు ఉండేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేశారు.
ఫలితాలు:
అన్ని రకాల నేరాలు తగ్గుముఖం పట్టాయి. పీడీయాక్టుల భయంతో చాలమంది నేరగాళ్లు తమ నేరప్రవృత్తిని మానుకొని, సాధారణ జీవనంవైపు మళ్లారు. సీసీ కెమెరాలు, వ్యవస్థీకృత నేరాల కట్టడి, పీడీయాక్టులతో నేరాలు పూర్తిగా కట్టడి చేసే ప్రయత్నంలో పోలీసులు విజయం సాధించారు.
చోరీలకు చెక్
2014కు ముందు..
మహిళలు రోడ్లపైకి వెళ్లాలంటే భయపడేవారు. గుడికి వెళ్లాలన్నా.. ఇంటి ముందు ముగ్గు వేయాలన్న వణికిపోయేవారు. ప్రతిరోజూ 10 నుంచి 20 వరకు మహిళల మెడలో నుంచి గొలుసులు, మంగళసూత్రాలను దొంగలు ఎత్తుకెళ్లిన ఘటనలు అప్పట్లో నిత్యకృత్యం. ఏడాదికి సుమారు 800 వరకు స్నాచింగ్ ఘటనలు జరిగేవి. దీంతో మహిళలు మెడచుట్టూ కొంగు కప్పుకొని వెళ్లాలని, ఆభరణాలు వేసుకోవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేయాల్సివచ్చింది. మరోవైపు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి. ఇంట్లో దాచుకున్న సొమ్ము దొంగలు అపహరిస్తారని ఆందోళన వెంటాడేది.
2014 తరువాత..
తెలంగాణ ప్రభుత్వం ఈవిషయాన్ని సీరియస్‌గా తీసుకొంది. మహిళల మెడలో నుంచి మంగళసూత్రం అపహరణ అనేది సెటిమెంట్‌తో కూడుకున్నది. దీంతో స్నాచింగ్ ముఠాలపై ఉక్కుపాదం మోపింది. నగరవ్యాప్తంగా సీసీ కెమెరాలు, పీడీయాక్టులు పెట్టడం, ఇతర రాష్ర్టాల స్నాచర్లు ఏమూలన దాక్కున్నా పట్టుకురావడం వంటి చర్యలకు ఉపక్రమించింది. స్నాచింగ్, దొంగతనాల నివారణలో పటిష్టమైన పెట్రోలింగ్ వ్యవస్థ తోడయ్యింది.
ఫలితాలు:
నేడు ఏడాదికి 10 స్నాచింగ్‌లు కూడా జరగకుండా పోలీసులు కట్టడి చేశారు.. ఒక్కో నెలలో ఒక్కకేసూ నమోదు కావడం లేదు. జీరోస్నాచింగ్లకు పరిస్థితి వచ్చింది. నిశ్చింతగా ఇంటికి తాళమేసి బయటకు వెళ్లివస్తున్నారు. టెక్నాలజీపరమైన సంస్కరణలతోనే నేరాల అదుపు సాధ్యమయ్యింది.
ప్రజల కోసం మొబైల్ అప్లికేషన్
2014కు ముందు..
ప్రజలు పోలీసులు సమాచారం ఇవ్వడానికి అవకాశం ఉండేది కాదు. నేరుగా పోలీస్‌స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఉండేది. మిస్సింగ్ సర్టిఫికెట్ కావాలన్నా రోజుల తరబడి పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగాల్సి వచ్చేది. అమ్యామ్యాలు లేనిదే ఠాణాల్లో పనికాని, పట్టించుకోని పరిస్థితి అప్పట్లో ఉండేది.
2014 తరువాత..
ప్రజలకు, పోలీసులకు మధ్య వారధిగా ఉండేందుకు టెక్నాలజీని వాడాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ‘హాక్-ఐ’ మొబైల్ అప్లికేషన్‌ను అందుబా టులోకి తెచ్చారు. దాంతో సోషల్ మీడియా ద్వారా కూడా పోలీసులకు ఫిర్యాదులు, సలహాలు, సూచనలు ఇచ్చేలా చూశారు. మిస్సింగ్ సర్టిఫికెట్ల కోసం ప్రత్యేకంగా ‘లాస్ట్రిపోర్ట్' అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు.
ఫలితాలు:
‘హాక్ఐ’ ద్వారా పౌరుల నుంచి పలు ఫిర్యాదులు, సలహాలు, సూచనలు పోలీసులకు అందుతున్నాయి. దాంతోపాటు లాస్ట్రిపోర్టు యాప్ ద్వారా 72గంటల్లోనే మిస్సింగ్ సర్టిఫికెట్ ఫిర్యాదుదారుడు ఈమెయిల్ ద్వారా పొందవచ్చు. ఇలా ఇప్పటి వరకు 25వేల మందికి సంబంధించిన మిస్సింగ్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. ఫేస్బుక్ ద్వారా 25వేలు, వాట్సాప్ ద్వారా 38వేలు, ట్విట్టర్ ద్వారా 20 వేలకుపైగా ఫిర్యాదులు పోలీసులకు వచ్చాయి.
మహిళల కోసం 24/7 హెల్ప్‌లైన్స్
మహిళలకు హైదరాబాద్‌లో ఉన్న రక్షణ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేదు. మహిళలకు రెడీగా సులభంగా.. భరోసా, సఖి,డయల్ 100 వంటివాటితో నిమిషాల్లో పోలీసు సేవలు దొరుకుతున్నాయి. మార్గదర్శక్, సంఘమిత్రల ద్వారా ఉద్యోగినులతోపాటు సాధారణ మహిళలు కూడా నిర్భయంగా మాట్లాడే వేదికగా మారింది. వారిపై జరుగుతున్న వేధింపులను వారు షీ టీమ్స్, పోలీసులకు దృష్టికి తీసుకెళ్లగలుగుతున్నారు. ’మైక్యాబ్', ‘ఆటో ఈజ్ సేఫ్', షీ-షటిల్స్ వంటివాటితో మహిళలకు భద్రతతో కూడిన ప్రయాణం లభిస్తుంది. -ప్రత్యూష శర్మ, కాగ్నిజెంట్ సీనియర్ హెచ్ఆర్ డైరెక్టర్.
తాజావార్తలు
- ఇలా పడుకుంటే నెలసరి నొప్పిని తగ్గించుకోవచ్చు..
- ప్రదీప్ మాట్లాడుతుండగానే స్టేజీపైనే కుప్పకూలిపోయిన డైరెక్టర్
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన నటి నందిత శ్వేత
- నందిగామ పంచాయతీ కార్యదర్శి, ఏపీఎం సస్పెండ్
- ఏపీలో కొత్తగా 158 మందికి కోరోనా
- తెలంగాణలో సాగు విస్తీర్ణం పెరిగింది : సీఎం
- మహిళలు, పిల్లలపై హింసను ఎదుర్కొనేందుకు 'సంఘమిత్ర'
- బిజినెస్ ఫ్రెండ్లీకి దెబ్బ: ‘మహా’ సర్కార్‌కు జీఎం వార్నింగ్!
- పాలమూరు-రంగారెడ్డి’ని ఈ ఏడాదిలోగా పూర్తి చేయాలి : సీఎం కేసీఆర్
- 2020 లో జీవితం ఇంతేనయా! చిన్నారులు పాపం..