e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Home హైదరాబాద్‌ తెలివిమీరుతున్నారు…

తెలివిమీరుతున్నారు…

  • ఒకే సంఘటన.. రెండు పీఎస్‌లలో కేసులు
  • ఒక కేసులో బాధితులైతే.. మరో కేసులో నిందితులు
  • విషయాన్ని దాచిపెడుతూ పీఎస్‌లో ఫిర్యాదు, కోర్టుల్లో పిటీషన్లు
  • తలబాదుకుంటున్న పోలీసులు

సంఘటన ఒకటే.. ఫిర్యాదులు రెండు. ఒక ఘటనలో ఒకరు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే.. మరొకరు కోర్టు ద్వారా (కోర్టు రిఫర్‌) కేసులు నమోదు చేయిస్తున్నారు. దీంతో ఒకే సంఘటనపై రెండు వేర్వేరు పీఎస్‌లలో రెండు కేసులు నమోదవుతున్నాయి. ఒక పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు.. మరో పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసులో బాధితులుగా మారుతున్నారు. అంతేకాదు.. సివిల్‌ తగాదాలను క్రిమినల్‌ కేసులుగా మార్చేస్తున్నారు. ఫిర్యాదుదారులు వ్యవహరిస్తున్న తీరు పోలీసులకు తలనొప్పిగా మారింది. కేసు దర్యాప్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

నగరంలో ఏదైనా సంఘటన జరిగితే బాధితులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తారు. పోలీసులు ఫిర్యాదును పరిశీలించి కేసు నమోదు చేస్తారు. దర్యాప్తు మొదలు పెడుతారు. ఒక్కోసారి కేసు తీవ్రతను బట్టీ స్థానిక పోలీసులు ఆ కేసును సిటీ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌(సీసీఎస్‌)కు బదిలీ చేస్తారు. ఒక్కోసారి సీఐడీకి కూడా బదిలీ చేస్తుంటారు. కేసుల బదిలీ వంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టి, నిజాలు తేల్చడంతో పాటు పూర్తి వివరాలను కోర్టుకు సమర్పిస్తారు. దీంతో ప్రతి కేసులో ఒకవర్గం బాధితులుగా ఉంటే.. మరో వర్గం నిందితుల జాబితాలో ఉంటుంది. కొన్ని సంఘటనల్లో ఇరు వర్గాలు ఒకే పోలీస్‌ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో రెండు వేర్వేరు కేసులు నమోదు చేస్తుంటారు. అయితే, ప్రస్తుతం నగరంలో ఓ వింత ట్రెండ్‌ మొదలైంది. విషయం ఒక్కటే ఉంటుంది.

- Advertisement -

కాని, ఫిర్యాదులు వేర్వేరుగా రెండు పోలీస్‌ స్టేషన్లలో నమోదవుతున్నాయి. ఒకరు నేరుగా పీఎస్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే.. మరొకరు మరొక పీఎస్‌లో ఫిర్యాదు చేస్తూ కేసులు నమోదు చేయిస్తున్నారు. కేసుల వివరాలపై రెండు గ్రూపులకు అవగాహన ఉన్నప్పటికీ పోలీసులకు చెప్పకుండా దాచిపెడుతున్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసులు కేసులు నమోదు చేయకుంటే.. పోలీసులపై కోర్టును ఆశ్రయించి, న్యాయస్థానం అనుమతితో కేసులు పెట్టిస్తున్నారు. ఉదాహరణకు ఇటీవల ఒక సంఘటనపై సీసీఎస్‌తో పాటు బంజారాహిల్స్‌ పీఎస్‌లో కూడా కేసు నమోదైంది. దీంతో ఒక కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు.. మరో కేసులో బాధితులుగా మారారు. ఫిర్యాదు దారులు వ్యవహరిస్తున్న తీరుతో పోలీసులకు తలనొప్పిగా మారింది.

ఒక్క చోటనే ఫిర్యాదు చేయాలి

కొంత మంది ఫిర్యాదు దారులు వ్యవహరిస్తున్న తీరు ఇబ్బందిగా మారుతుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఒక సమస్యపై ఒక చోటనే ఫిర్యాదు చేయాలి. అక్కడ ఇరు వర్గాల వారు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. విచారణలో ఫిర్యాదు దారుడు తప్పుడు సమాచారం ఇస్తే తప్పకుండా అతడిపై చర్యలు ఉంటాయి. ఒకే సమస్యపై రెండు గ్రూపుల వారు అతి తెలివిని ప్రదర్శిస్తూ వేర్వేరు పోలీస్‌ స్టేషన్లలో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటున్నారు. దీంతో సమస్య తీవ్రత ఇంకా పెరుగుతుంది. విచారణలో నిజాలు బయటకు వస్తాయన్నారు. తప్పు చేసిన వ్యక్తులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా చర్యలు తప్పవన్నారు.

బంజారాహిల్స్‌లో విక్రమ్‌దేవ్‌రెడ్డి నిందితుడు

నజీబ్‌ అహ్మద్‌ జూలై 28న విక్రమ్‌దేవ్‌రెడ్డి, ఎం.పావనీ, ఎంఏఎస్‌ రాయుడు, జి.జగన్మోహన్‌, ఎం.వెంకటశివరాంరెడ్డి, ప్రసాద్‌, వెంకటలక్ష్మి, మనోజ్‌కుమార్‌ నాయుడు, ప్రశాంతి, వేణుగోపాల్‌ నాయుడుతో పాటు మరికొంత మందిపై బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో (కోర్టు రెఫర్‌) ఫిర్యాదు చేశాడు. నజీబ్‌ ఫిర్యాదుతో విక్రమ్‌దేవ్‌ రెడ్డితో పాటు మరికొంతమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఒకే స్థలం వివాదంలో వేర్వేరు పోలీస్‌ స్టేషన్లలో రెండు కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో బాధితులుగా ఉన్న వ్యక్తులు.. మరో కేసులో నిందితులుగా మారారు.

సీసీఎస్‌ కేసులో నజీబ్‌ నిందితుడు

జూలై 14న షేక్‌పేట్‌ పరిధిలోని ఓ స్థలం వివాదంలో శ్రీసాయి కన్‌స్ట్రక్షన్‌ ఎండీ విక్రమ్‌దేవ్‌రెడ్డి సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించారు. నజీబ్‌ అహ్మద్‌, సుధాకర్‌రెడ్డి, కృష్ణారెడ్డితో పాటు మరికొంతమందిపై ఫిర్యాదు చేశాడు. సీసీఎస్‌ పోలీసులు (క్రైం నం.0110/2021) కేసు నమోదు చేశారు.

సీఐడీ కేసులు సైతం

పశ్చిమ మండలం పరిధిలోని పలు పోలీస్‌ స్టేషన్లలో నమోదవుతున్న కేసుల్లో సివిల్‌ మూలాలున్న వాటిని క్రిమినల్‌ కేసులుగా కొంతమంది పోలీసులు మార్చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బంజారాహిల్స్‌ డివిజన్‌లో ఇలాంటి ఆరోపణలు రావడంతో స్పందించిన నగర సీపీ ఆయా కేసులను సీఐడీ దర్యాప్తునకు ఆదేశించారు. అంతేకాకుండా.. ఒకే సంఘటనపై బంజారాహిల్స్‌ పీఎస్‌లో ఒకరు ఫిర్యాదు చేస్తే.. మరొకరు జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారంలో పోలీసులు కూడా ఫిర్యాదు దారులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఒక తాసీల్దార్‌ ఫిర్యాదు చేస్తే రెండు రోజుల తర్వాత కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ప్రైవేటు ఫిర్యాదుల్లో మాత్రం పోలీసులు వెంటనే స్పందిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana