e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home హైదరాబాద్‌ నకిలీ ఈ కామర్స్‌ వెబ్‌సైట్లతో.. అమాయకులకు వల

నకిలీ ఈ కామర్స్‌ వెబ్‌సైట్లతో.. అమాయకులకు వల

  • దేశ వ్యాప్తంగా వేలాది మందిని ముంచిన ఘరానా చీటర్‌
  • సైబరాబాద్‌లో 9 కేసులు నమోదు.. బెంగళూర్‌లో అరెస్ట్‌
  • నిందితుడి వద్ద నుంచి రూ. 40 లక్షల నగదు స్వాధీనం

సిటీబ్యూరో, జూలై 23(నమస్తే తెలంగాణ): పేరున్న ఈ కామర్స్‌ వెబ్‌సైట్లను పోలిన నకిలీ వెబ్‌సైట్లు తయారు చేసి, దేశ వ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్న ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఘరానా సైబర్‌ నేరగాడిని సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ. 40 లక్షలు రికవరీ చేశారు. సీపీ సజ్జనార్‌ తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఖాజాగూడకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ (బాధితుడు) బిగ్‌ బాస్కెట్‌ మాదిరిగా ఉన్న జోపోనవ్‌.ఇన్‌ అనే వెబ్‌సైట్‌లో నిత్యావసర సరుకులు ఆర్డర్‌ చేసి రూ. 1,544 చెల్లించాడు.

డబ్బు చెల్లించిన తరువాత నిర్ణీత సమయానికి సరుకులు ఇంటికి రాకపోవడంతో కస్టమర్‌ కేర్‌కు, ఆ తర్వాత ఈమెయిల్‌ చేసినా ఎవరు కూడా సమాధానం ఇవ్వలేదు. దీంతో బాధితుడు ఈ వెబ్‌సైట్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి ఫిర్యాదులే ఇతర పోలీసు స్టేషన్లలో కూడా నమోదయ్యాయి. సైబర్‌ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్లను రూపొందించి భారీ మోసాలకు పాల్పడుతున్నారని గుర్తించిన సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌, మాదాపూర్‌ జోన్‌ పోలీసులు సంయుక్తంగా ఈ కేసుల దర్యాప్తు చేపట్టి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

వెబ్‌సైట్‌ తయారీలో పట్టు..

- Advertisement -

ఉత్తర్‌ప్రదేశ్‌ వారణాసికి చెందిన రిషబ్‌ ఉపాధ్యాయ అలియాస్‌ చందన్‌ బీఎస్సీ పూర్తి చేశాడు. ఆ తర్వాత బెంగళూర్‌లో ఎంబీఏలో చేరి ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ కోర్సును 2012లో పూర్తి చేసి, అక్కడే బీపీఓ కాల్‌ సెంటర్‌లో, జూనియర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా పనిచేస్తూ వెబ్‌ డిజైనింగ్‌, పీహెచ్‌సీ కోర్సులు చేసి వెబ్‌ పోర్టల్స్‌ తయారు చేయడంపై పట్టు సాధించాడు. ఈ క్రమంలోనే ఫ్రీలాన్సర్‌.కామ్‌, అప్‌వర్క్‌.కామ్‌లో తన పేరును రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాడు. మూడేండ్ల కిందట తనకు వెబ్‌సైట్‌ కావాలంటూ అమెరికాకు చెందిన ప్రిన్స్‌ కాంటాక్టు అయ్యాడు. అతడికి జాబ్‌ఫైండర్‌.ఇన్ఫో అనే పేరుతో వెబ్‌సైట్‌ తయారు చేసి ఇచ్చాడు. ఆ తర్వాత ఆ వెబ్‌సైట్‌ ద్వారా చాలా మందికి ఉద్యోగాలిస్తామంటూ నమ్మించి ముంచేసిందనే రివ్యూస్‌ చదివాడు.

ఆ వెబ్‌సైట్‌ ద్వారా ప్రిన్స్‌ మోసం చేసినట్లు గుర్తించాడు. తాను కూడా అలాగే వెబ్‌సైట్లు రూపొందించి, మోసం చేయాలని ప్లాన్‌ చేశాడు. మైకెల్‌ బ్రేక్‌, రోనాల్‌, జసన్‌, రాయ్‌ రనే పేర్లతో హెచ్‌ఆర్‌, హైరింగ్‌, టెక్నికల్‌, లీగల్‌ ఎక్స్‌పర్ట్స్‌ అంటూ నకిలీ స్కైప్‌ ఖాతాలు తెరిచాడు. ప్రీలాన్సర్‌.కామ్‌లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగాలిస్తామంటూ నమ్మిస్తూ మోసాలు చేయడం ప్రారంభించాడు. పంజాబ్‌కు చెందిన రాహుల్‌ అనే వ్యక్తి ద్వారా డిజిటల్‌ మార్కెట్‌ంగ్‌ సేవలు వాడుకున్నాడు. మోసాలలో మరో అడుగు ముందుకేసి డెకప్‌.కామ్‌ పేరుతో వెబ్‌సైట్‌ తయారు చేసి, దానిని శివేంద్ర సింగ్‌ రానా పేరుతో హోస్ట్‌ చేశాడు. దీని ద్వారా ఉద్యోగాలిస్తామంటూ పలువురికి ఆశ చూపి మోసం చేశాడు.

అన్ని పీఎస్‌లలో సైబర్‌ క్రైమ్‌ విభాగం..

సైబరాబాద్‌ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్లలో మార్చి నెల నుంచి సైబర్‌ క్రైమ్‌ విభాగాలు పని చేస్తున్నాయని సీపీ తెలిపారు. ప్రతి ఫిర్యాదును తీసుకొని కేసు నమోదు చేస్తారని వివరించారు. సైబర్‌క్రైమ్‌ పోలీసు స్టేషన్‌తో పాటు సైబరాబాద్‌లోని 36 పోలీసు స్టేషన్లలో సైబర్‌క్రైమ్‌పై అవగాహన ఉన్న సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీ విజయ్‌కుమార్‌, వెంకటేశ్వర్లతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఆన్‌లైన్‌లో నిత్యావసరాలు…

లాక్‌డౌన్‌ సమయంలో చాలా మంది బయటకు వచ్చి నిత్యావసరాలు కొనడంలో ఇబ్బంది పడిన విషయాన్ని గుర్తించాడు. దీంతో బెంగళూర్‌లో పేరున్న జోపోనౌ.కామ్‌ మాదిరిగా జోపోనౌ.ఇన్‌, ఫర్నీచర్‌ విక్రయాల్లో పేరున్న మోడ్‌వే.కామ్‌ మాదిరిగా మోడ్‌వేఫర్నీచర్‌.ఇన్‌ పేర్లతో వెబ్‌సైట్లు తయారు చేశాడు. వీటిని పంజాబ్‌కు చెందిన రాహుల్‌ డిజిటల్‌ మార్కెటింగ్‌ చేయడంతో పబ్లిక్‌లోకి వెళ్లింది. నకిలీ వెబ్‌సైట్లకు అనుసంధానంగా 20 క్యాష్‌ఫ్రీ పేమెంట్‌ గేట్‌వేకు సంబంధించిన ఖాతాలు తెరిచాడు. గతంలో ఉద్యోగాలిస్తామంటూ పలువురి వద్ద నుంచి సేకరించిన చిరునామాలు, ఫొటోలు, ఆధార్‌కార్డులతో పలు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచాడు.

బిగ్‌ బాస్కెట్‌, ఈకామర్స్‌ వెబ్‌సైట్‌ మాదిరిగానే వెబ్‌సైట్‌ డిజైన్‌ చేసి, డిస్కౌంట్‌ ఆఫర్లు ఎక్కువగా ఇవ్వడంతో ఈ పోర్టల్‌ ద్వారా చాలా మంది నిత్యావసరాలు, ఫర్నీచర్‌ కొనుగోలు చేశారు. సైబరాబాద్‌ పరిధిలో జోపోనౌ.ఇన్‌ బాధితులు ఏడుగురు ఉండగా, మోడ్‌వేఫర్నీచర్‌.ఇన్‌ బాధితులు ఇద్దరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బ్యాంకు ఖాతాల ఆధారంగా నిందితుడు బెంగళూర్‌లో ఉన్నట్లు రాయదుర్గం పోలీసులు గుర్తించారు. నిందితుడు రిషబ్‌ ఉపాధ్యాయను అరెస్ట్‌ చేసి, రూ.40 లక్షలు, రెండు ల్యాప్‌టాప్‌లు, మూడు ఫోన్లు, 20 డెబిట్‌ కార్డులు, 6పాస్‌ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana