బుధవారం 27 జనవరి 2021
Hyderabad - Nov 27, 2020 , 08:11:21

వదంతులను నమ్మొద్దు

వదంతులను నమ్మొద్దు

  • మత ఘర్షణలు సృష్టించేవారికి సిటీలో స్థానం లేదు
  • ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు
  • నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో ప్రశాంతతకు భంగం కల్గించేలా వ్యవహరించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ హెచ్చరించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీల ప్రచారాలు జోరందుకున్నాయనీ, ఇదే సమయంలో కొందరు నగరంలో ప్రశాంత వాతావారణాన్ని చెడగొట్టేందుకు కుట్ర పన్నుతున్నారని సీపీ పేర్కొన్నారు. ప్రశాంతతను భగ్నం చేసి మతసామరస్యాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్న వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 హైదరాబాద్‌లో ఏడేండ్లలో శాంతి భద్రతలు బాగుతున్నాయనీ, నేరాలు అదుపులో ఉండడంతోపాటు మత ఘర్షణలకు తావులేదని స్పష్టంచేశారు. ఈ పరిస్థితుల్లో  కొందరు ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇతర సోషల్‌ మీడియా వేదికల ద్వారా  ఫేక్‌న్యూస్‌తో వదంతులు సృష్టిస్తున్నారని చెప్పారు. మత ఘర్షణలు సృష్టించాలనుకునే వారికి హైదరాబాద్‌లో స్థానంలేదని సీపీ అన్నారు. నగర ప్రతిష్ఠను మరింత పెంచేందుకు అందరు కృషిచేయాలని కోరారు. సోషల్‌ మీడియాలో వదంతులు, గొడవలు సృష్టించాలనుకునే వారి గురించి స్థానిక పోలీసులకు లేదా  డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని సీపీ సూచించారు.  logo