శుక్రవారం 22 జనవరి 2021
Hyderabad - Jan 13, 2021 , 02:10:06

వ్యాక్సిన్‌ వచ్చెన్‌

వ్యాక్సిన్‌ వచ్చెన్‌

పదినెలలుగా గడగడలాడిస్తున్న కరోనా నియంత్రణ వ్యాక్సిన్‌ ఎట్టకేలకు  నగరానికి చేరుకున్నది. పుణె నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న టీకాలను ప్రత్యేక భద్రత మధ్య వైద్య ఆరోగ్య శాఖాధికారులు కోఠిలోని కేంద్రానికి తరలించారు. నేటి నుంచి అన్ని జిల్లాలకు  సరఫరా చేయనున్నారు. ఈనెల 16వ తేదీ నుంచి మొదటిదశలో ప్రభుత్వ, ప్రైవేటు  సిబ్బందికి టీకా ఇవ్వనున్నారు.  

కరోనా కోరలు విరిచేందుకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా టీకా ఎట్టకేలకు మంగళవారం నగరానికి చేరుకున్నది. ఫుణేలోని సీరం సంస్థకు చెందిన 3.72లక్షల కొవిషీల్డ్‌ టీకా డోస్‌లు ప్రత్యేక విమానంలో ఉదయం 11.30గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి. ఇందులో 31 బాక్సులు..12వేల వయల్స్‌ ఉన్నాయి. అప్పటికే రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖాధికారులు విమానాశ్రయానికి చేరుకొని కరోనా టీకాను పక్కా ఏర్పాట్ల మధ్య రిసీవ్‌ చేసుకున్నారు. విమానాశ్రయం నుంచి భారీ పోలీస్‌ బందోబస్తు మధ్య ఇన్‌సెల్టర్‌ వాహనంలో కోఠిలోని రాష్ట్ర టీకా నియంత్రణ కేంద్రానికి (ఇమ్యూనైజేషన్‌) తరలించారు. అక్కడ వాక్‌ ఇన్‌ కూలర్‌కు డీఎంఈ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, డీహెచ్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు, టీఎస్‌ఎంఐడీసీ అధికారి చంద్రశేఖర్‌రెడ్డిలు కరోనా వ్యాక్సిన్‌ను తరలించిన వాహనంతోపాటు వాక్‌ ఇన్‌ కూలర్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇన్‌సెల్టర్‌లోని కొవిషీల్డ్‌ టీకాలను వాక్‌ ఇన్‌కూలర్‌లోకి తరలించారు. ఈ వాక్‌ ఇన్‌ కూలర్‌లో 2 నుంచి 8 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత ఉంటుందని వైద్యాధికారులు తెలిపారు. హైదరాబాద్‌ జిల్లాకు సంబంధించిన కోల్డ్‌చైన్‌ ప్రాంతాన్ని బషీర్‌బాగ్‌లోని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే హైదరాబాద్‌ జిల్లావ్యాప్తంగా టీకాలను సరఫరా చేయనున్నారు. రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌లకు సంబంధించిన కోల్డ్‌ చైన్‌ ఏరియాను శివరాంపల్లిలోని రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేశారు. కోఠిలోని ఇమ్యూనైజేషన్‌ భవనం నుంచి టీకాలను బుధవారం నుంచి అన్ని జిల్లాలకు సరఫరా చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. 

టీకా వేయడమే తరువాయి..  

కొవిషీల్డ్‌ టీకా నగరానికి చేరుకోవడంతో వైద్యఆరోగ్యశాఖ అధికారులు వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించారు. ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రి, రంగారెడ్డి జిల్లా వైద్యాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. మొదటివిడతలో హెల్త్‌కేర్‌ వర్కర్లకు టీకా వేయనుండడంతో వారి డేటా పరిశీలన, వారి ఫోన్లకు వచ్చిన టైమ్‌ స్లాట్‌ మేసేజ్‌ పరిశీలన, కొవిన్‌ యాప్‌లో డేటా నమోదు చేయడం, వ్యాక్సినేషన్‌ తదితరాంశాలపై ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయడంతోపాటు ప్రధానంగా వ్యాక్సిన్‌ తీసుకున్న వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించే అంశంపై వైద్యాధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 

ఉస్మానియా, ఫీవర్‌ ఆస్పత్రుల్లో ఏర్పాట్లు

ఈనెల 16వ తేదీ నుంచి వ్యాక్సిన్‌ ఇవ్వనున్న నేపథ్యంలో ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌ వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 16,18,19,21,22,25వ తేదీల్లో ఉస్మానియాలో ఎంపిక చేసిన ఆరు కేంద్రాల్లో వైద్య సిబ్బందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇస్తారని, ఇచ్చే సమయంలో అనస్థీషియా, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బేగంబజార్‌ యూపీహెచ్‌సీ వైద్యబృందం సమన్వయంతో వ్యాక్సిన్‌ ఇస్తామని పేర్కొన్నారు. అలాగే నల్లకుంటలోని ఫీవర్‌ దవాఖానలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీకా ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన మూడు ప్రత్యేక వార్డులను దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌, ఆర్‌ఎంవో చంద్రశేఖర్‌ పరిశీలించారు. రెండు గంటలకు 25 మంది చొప్పున వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని, తొలుత ఫీవర్‌ దవాఖాన సిబ్బంది, వైద్యులకు టీకా ఇవ్వనున్నట్లు చెప్పారు.  logo